ఆర్థికశాఖకు వినయ్‌చంద్ బదిలీ
రెవిన్యూశాఖ కార్యదర్శి (దేవాదాయ)గా ఉన్న వడరేవు వినయ్‌చంద్‌ను ఆర్థికశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను ఆర్థికశాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం రెవిన్యూశాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ ఆశాఖకు అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. కాగా అజయ్‌జైన్‌కు యువాభివృద్ధి,సాంస్కృతికశాఖల అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. గతంలో ఈ శాఖలను వినయ్‌చంద్ చూసేవారు. కాగా ఆర్థికశాఖలో నివాస్ బదిలీపై కేంద్రానికి వెళ్లిన అనంతరం ప్రభుత్వం ఇక్కడ సమర్థుడైన అధికారి కోసం అన్వేషించి చివరకు వినయ్‌చంద్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. మరోవైపు మరికొన్ని రోజుల్లో భారీగా ఐఏఎస్, ఐపిఎస్‌ల బదిలీలు జరుగుతాయనే ప్రచారం సాగుతోంది. కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేస్తారంటున్నారు. ఈ వారం చివరిలో బదిలీలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.