స్వకులస్తులే ‘బాబు‘కు విపక్షమా...!?
అంతులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు‘కు స్వకులస్తులే విపక్షంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఏడాది క్రితం ఆయన నేతృత్వంలోని కూటమి 164 సీట్లను గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. అయితే.. ఈ ఏడాదిలో ‘చంద్రబాబు’ ఆయన తనయుడు ఏమి చేసినా..చెల్లుబాటు అవుతూ వస్తోంది. ప్రజలు అప్పగించిన అధికారాన్ని చాలా వరకూ న్యాయంగానే వాడుతున్నా..పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారనే మాట ఆయా వర్గాల ద్వారా వ్యక్తం అవుతోంది. ఏడాదిలో మెజార్టీ నిర్ణయాలు బాగున్నా కొన్ని నిర్ణయాలు ప్రజలను ఆలోచనల్లో పడేస్తున్నాయి. ముఖ్యంగా వైకాపాలోని ముఖ్యులతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలతో పాటు, కొందరు వైకాపా వారికి పదవులు అప్పగించడం, నిన్నిటి దాకా..ప్రాణాలు అడ్డేసి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వకపోవడం..ఒకవేళ ఇచ్చినా..ప్రాధాన్యత కల్పించకపోవడం, అమరావతిలో మళ్లీ భూములు సేకరించడం, వైకాపా కాంట్రాక్టర్లకు కొమ్ముకాయడం వంటివాటిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.‘చంద్రబాబు’ పాలన సజావుగా సాగడం లేదనే మాట అన్ని వర్గాల నుంచి ఇప్పుడిప్పుడే వ్యక్తం అవుతోంది. అధికార యంత్రాంగం తీరు, ఎమ్మెల్యేలు, ఎంపిల నడవడిక, మంత్రుల అవినీతి, స్థానిక నాయకుల విచ్చలవిడితనం వంటివాటితో ప్రజల్లో క్రమంగా ‘చంద్రబాబు’ పాలనపై అసంతృప్తికి దారి తీస్తోంది. అయితే..ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవడంలో ప్రధాన పార్టీ అయిన వైకాపా విఫలం అవుతోంది. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను వదిలేసి రౌడీ భాష మాట్లాడుతుండడం, పర్యటనల్లో జనాలను పోగేసి షోలు చేస్తుండడంతో ఆయనను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఏడాదిలో ఆయన ఒక్కటంటే ఒక్క ప్రజాసమస్యపై సరైన రీతిలో ప్రభుత్వాన్ని నిలదీసిన పాపాన పోలేదు. కీలకమైన సమస్యలపై ఆయనకు ఒక అవగాహన లేకపోవడం, గతంలో తాను తీసుకున్న గొయ్యిలో తానే పడడంతో..ఆయా సమస్యలపై ఆయన ఉద్యమించే పరిస్థితి లేదు. అయితే..ప్రజా సమస్యలపై ఆయన ఉద్యమించకున్నా..‘చంద్రబాబు’ కులస్తులు మాత్రం ‘చంద్రబాబు’ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ముఖ్యంగా రాజధాని అమరావతిలో మరో 40వేల ఎకరాలు తీసుకోవాలన్న నిర్ణయంపై టిడిపి మాజీ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వానికి రైతులు భూములు ఇవ్వవద్దంటూ..ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకూ భూములు ఇచ్చిర రైతులకే ప్రభుత్వం న్యాయం చేయలేదని, ఇప్పుడు కొత్తగా భూములు తీసుకుని ఏమి చేస్తారన్న ఆయన ప్రశ్న పలువురు రైతులను ఆలోచింపచేస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా..ఇంత వరకూ కనీసం రాజధానికి వెళ్లే కరకట్ట రోడ్డును విస్తరించలేని ప్రభుత్వం..రాజధాని అమరావతిని ఏమి నిర్మిస్తుందన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి జవాబు లభించడం లేదు. రాజధాని పనులు నత్తనడకన సాగుతుండడంతో..వడ్డే మాటలకు కొంత ప్రాధాన్యత వస్తోంది. అదే విధంగా బనకచర్ల ప్రాజెక్టుపై రిటైర్ఢ్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావు చేస్తోన్న వాదనలు కూడా సబబుగానే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టును ఇంకా పూర్తి చేయలేని ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేని బనకచర్ల ప్రాజెక్టు కడతామని చెబుతుండడం సబబు కాదని ఆయన వాదిస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై శ్వేతపత్రం ప్రకటించి..వాటిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆయన చేస్తోన్న వాదన కూడా బాగానే ఉందనిపిస్తోంది. మొత్తం మీద..జగన్ చేయాల్సిన డిమాండ్లను చంద్రబాబు స్వంత కులస్థులు, టిడిపి మాజీ నాయకులు చేస్తోండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగన్‌కు ప్రజాసమస్యలపై శ్రద్ధలేదని, ఆయన ఎంత సేపూ పదవి కోసం ప్రాకులాడతారని, లేకుంటే కుల,మత ఘర్షణల కోసం ఎదురు చూస్తుంటారు తప్ప ప్రజాసమస్యలపై నోరెత్తరని, అదీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై అసలే నోరెత్తరని ఆయన విమర్శకులు అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు స్వకులస్తులే ఆయనకు ప్రత్యర్ధులుగా మారబోతున్నారనిపిస్తోంది.