‘అమరావతి’లో ఏం జరుగుతోంది...!?
అమరావతి ప్రేమికుల్లో ఏడాది క్రితం వరకూ ఒక ఆలోచన ఉండేది. ఎప్పుడు జగన్ సిఎం పీఠం నుంచి దిగిపోతాడో..అప్పుటి నుండే రాజధాని అమరావతిలో అభివృద్ధి మొదలవుతుందని… శరవేగంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని..రైతులకు న్యాయం జరుగుతుందని..దేశ ప్రజలకు..ఆంధ్రాకు..ఒక రాజధాని ఉందని తెలిసివస్తుందనే ఆలోచనలు, భవిష్యత్తుపై అపారమైన నమ్మకం ఉండేవి. ఈ దుర్మార్గుడు దిగిపోతే చాలు...రాజధానికి ఇక అడ్డంకే ఉండదని, దూసుకుపోతుందనే భావన ఈ ప్రాంత ప్రజలతో పాటు, రాజధాని అభిమానుల్లో, అభివృద్దికాముకుల్లో ఉండేది. అయితే వాళ్లు అనుకున్నట్లే..రాజధానిపై ఎడతెగని దాడులు చేసిన రాజధాని వ్యతిరేకుడు జగన్ పాతాళానికి కూరుకుపోయి, అధికారపీఠం నుంచి గెంటేయబడ్డాడు. మళ్లీ లేచే పరిస్థితే లేదు. జగన్ విషయంలో వాళ్లు అనుకున్నది అనుకున్నట్లు జరిగింది. కానీ..వాళ్ల మిగతా ఆలోచనలు ఈ ఏడాదిలో జరుగుతున్నాయా...? లేవా...? కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వాళ్లు పెట్టుకున్న అంచనాలు నెరవేరుతున్నాయా..? రాజధాని అమరావతి అభివృద్ధిలో దూసుకుపోతుందా..? భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరుగుతోందా..? శరవేగంగా రాజధాని పనులు జరుగుతున్నాయా..? మన రాజధాని అని భవిష్యత్తులో గర్వంగా చెప్పుకునే విధంగా అడుగులు పడుతున్నాయా..? అంటే ఇప్పుడు చెప్పలేమన్నట్లు సమాధానాలు వస్తున్నాయి.
ఏడాది క్రితం వరకూ రాజధానిలో బిక్కుబిక్కుమంటూ..ఇక్కడ రాజధాని ఉంటుందో..లేదో...అన్న భయాలతో..ఉన్న వారికి ఇప్పుడు అటువంటి భయాలు లేకపోయినా కూటమి ప్రభుత్వం చేస్తోన్న విన్యాసాలను చూసి..అసలు వీళ్లు రాజధానిని నిర్మిస్తారా..? లేక గతంలో..వలే..కాలయాపన చేస్తారా..? అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. శరవేగంగా జరగాల్సిన రాజధాని పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో నిజాయితీపరుడు, పనిమంతుడైన ఐఏఎస్ అధికారి కాటంనేని భాస్కర్‌కు సిఆర్‌డి పనులు అప్పచెబితే.. ప్రభుత్వం రాజధానిపై సీరియస్‌గానే ఉందని, పనిమంతుడికి సరైన బాధ్యతలు అప్పచెప్పారనే భావన అన్ని వర్గాల్లో వ్యక్తం అయింది. అయితే..అదే సమయంలో..మున్సిపల్ మంత్రిగా నారాయణను నియమించడంతో..ఇక అయినట్లే..అనే ఆక్రోశం కొందరిలో వ్యక్తం అయింది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కనుక..శరవేగంగా పనులు చేస్తారనే భావన ఉండేది. అయితే..మంత్రి నారాయణ సిఆర్‌డిఎ కమీషనర్‌తో గిల్లికజ్జాలకు దిగడంతో..కేవలం గతంలో ఉన్న టెండర్లు రద్దు చేయడం, కొత్త టెండర్లు పిలవడం, కంపలు కొట్టడానికే ఏడాది సమయం హరించుకుపోయింది. ఏడాది తరువాతైనా పనులు సాగుతాయనుకుంటే..ఇప్పుడు కొత్తగా భూసేకరణ అంటూ.. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ..మళ్లీ రాజధానిపై అనుమానాలు వచ్చే పరిస్థితి సృష్టిస్తున్నారు. ఉన్న భూములను ఇప్పటికీ సరిగా వాడలేదు..కొత్త నిర్మాణాలు పూర్తి కాలేదు..కొత్త జనాభా వచ్చే పరిస్థితులు సృష్టించలేదు..అయినా..మళ్లీ భూములు కావాలంటూ నోటిఫికేషన్లు ఇవ్వడంతో..అనుమానాలపై అనుమానాలు వస్తున్నాయి.
అసలు రాజధానిలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలని ఆ ప్రాంతానికి రావాలంటే కనీసం సరైన రోడ్డే లేదు. జగన్ పాలనను పక్కన పెట్టినా..ఈఏడాదిని కలుపుకుంటే..చంద్రబాబు ముఖ్యమంత్రిగా అమరావతిలో నాలుగేళ్లుగా ఉంటున్నారు. ఈ నాలుగేళ్లలో కనీసం కరకట్ట రోడ్డును నిర్మించలేకపోయారు. గతాన్ని తీసివేసినా..ఏడాదిలో కరకట్ట రోడ్డెందుకు వేయలేకపోయారు...? రాజధానికి ముఖద్వారంగా ఉన్న రోడ్డుపైకి ఎవరైనా పారిశ్రామికవేత్తలను తీసుకువస్తే..ఇక్కడా రాజధాని అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేం ప్రాంతం..? అంటూ..ప్రశ్నలపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. నాలుగైదు కిలోమీటర్లు రోడ్లు వేయలేని వీళ్లు ప్రపంచం ఆశ్చర్యచకితులయ్యే రాజధానిని నిర్మిస్తారా...? అంటూ ఎకసక్కాలు ఆడుతున్నారు. అప్పుడే ఏడాది పూర్తి అయి..రెండో ఏడాదిలోకి ప్రవేశించారు..? ఎన్నికల ఏడాదిని తీసివేస్తే..ప్రభుత్వానికి ఉండేది ఇక కేవలం మూడేళ్లు మాత్రమే..ఈ మూడేళ్లలో ఏమి అద్భుతాలు చేస్తారు.. ప్రజలకు ఏమి చూపిస్తారు..? గతంలో..ఇదే విధమైన నిర్లక్ష్యం, నిర్లిప్తత, ఊహాగానాలతో ప్రజలతో ఛీత్కారాలు పొందారు. గతంలో చేసిన తప్పులను చూసైనా..ప్రభుత్వం..కళ్లు తెరవాలి. బ్రహ్మాండాన్ని తరువాతైనా బద్దలు కొట్టవచ్చు. ఇప్పుడున్న భూముల్లో ఒక క్రమపద్దతిలో నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేసి..దీనిని వాడుకుంటుంటే..మిగతా భూములను రైతులు ఎప్పుడైనా ఇస్తారు.. దానిపై ఇప్పుడే అంత శ్రద్ధ అవసరం లేదు. వివిధ వర్గాలకు ప్రభుత్వం రాజధానిలో చోటు కల్పించి, వారు అక్కడే నివసించే అవకాశాలు కల్పించాలి. రాజధానిలో నివసించాలంటే..ఇక్కడ బతికే అవకాశాలు ఉండాలి. ఎక్కడో శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం వాళ్లు ఇక్కడకు రావాలంటే..వాళ్లకు..ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉండాలి. కానీ..ఇప్పుడు ఇక్కడా పరిస్థితులు లేవు. ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టకుండా మరిన్ని భూములు తీసుకుంటాం..అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మిస్తాం..క్వాంటమ్‌వాలీని సృష్టిస్తాం..అంటూ..పేదలకు అర్థం కాని భాష మాట్లాడితే.. వచ్చే ఎన్నికల్లో ఇదే పేదలు తమ సత్తా చూపిస్తారు. పెద్ద పెద్ద విమానాశ్రమాలు అవసరమే..కానీ..దాన్ని వాడుకునే స్థానిక పరిస్థితులు ఇక్కడ ఉండాలి కదా..? క్రమానుగత నిర్మాణాలు చేసుకుంటూ, జనాభాను పెంచుకుంటూపోతేనే రాజధాని వల్ల ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా బ్రహ్మాండమైన ఆలోచనలు, అంచనాలతో..ఏవేవో.. చేసుకుంటూ పోతే..చివరకు ఏమీ చేయకుండానే పదవీ కాలం పూర్తివుతుంది. పాలకులు ఈ నిజాన్ని గుర్తించాలి.