I&PR మంత్రి పేషీకి సొమ్ములు కొట్టు-పోస్టింగ్ పట్టు...!?
వైకాపా సానుభూతిపరులకు మళ్లీ పోస్టింగ్‌లా..?
లక్షలు వసూళ్లు చేసి పోస్టింగ్‌లు ఇస్తున్నారనే ఆరోపణలు
మంత్రి కార్యాలయ అధికారి వ్యవహారంపై విమర్శలు...!
వివాదాస్పద అధికారి పోస్టింగ్ కోసం శరవేగంగా దస్త్రాల కదలిక..?
మంత్రి పార్థసారధికి తెలిసే.. ఈ వ్యవహారం సాగుతోందా..?
దస్త్రం పంపించాలంటూ... సమాచారశాఖ అధికారులకు పదే పదే ఫోన్లు...!
గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సమాచారశాఖలోని కొందరు అధికారులు అవినీతికి కొమ్ముకాశారని, అవినీతిలో భాగస్వాములయ్యారని, అనేక అవినీతి, అక్రమాలకు, అరాచకాల్లో వారి పాత్ర ఉందని ఏడాది క్రితం వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఏడాదిగా ఏసీబీ, విజిలెన్స్ వారి అవినీతి, అక్రమాలపై విచారణ చేస్తూనే ఉంది. నిబంధనలకు వ్యతిరేకంగా సాక్షి పత్రికకు ప్రకటనలు కట్టబెట్టడంలోనూ, అక్రిడిటేషన్లు అమ్ముకోవడంలోనూ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకోవడంలోనూ, యాడ్ ఏజెన్సీల నుంచి సొమ్ములు దండుకోవడంలోనూ, ఇతరత్రా అవినీతి వ్యవహారాల్లో వీరి భాగముందని ఏసీబీ, విజిలెన్స్ నిర్ధారించింది. వీరి అవినీతికి ఆధారాలు ఉన్నాయని తమ ప్రాథమిక నివేదికలో ఏసీబీ, విజిలెన్స్ పేర్కొంది. దీనిపై అప్పటి సమాచారశాఖ కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డితో పాటు మరో ఆరుగురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేసు నమోదు తరువాత తనను అరెస్టు చేయవద్దంటూ మాజీ కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే..అక్కడ ఆయనకేమీ రిలీఫ్ రాలేదు. మరి స్పష్టమైన ఆధారాలు ఉన్నా ఏసీబీ ఎందుకో ఆయనను అరెస్టు చేయలేదు. దీంతో..బయటే ఉన్న ఆయన గతంలో తాను చేసిన అవినీతి, అక్రమాలను ఆధారాలను ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి గతంలో ఆయనతో కలిమెలిసి పనిచేసిన అధికారుల సహకారం ఆయన తీసుకుంటున్నారట. దీనిలో భాగంగా గతంలో జిఎడికి అటాచ్ చేసిన అధికారులకు మళ్లీ పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారట.
అరాచకశక్తికి మళ్లీ అక్కడే పోస్టింగా...!?
దీనిలో భాగంగా ముందుగా ఇంజనీరింగ్ అధికారికి పోస్టింగ్ తెచ్చుకున్న సదరు అధికారులు ఇప్పుడో జాయింట్ డైరెక్టర్‌కు పోస్టింగ్ ఇప్పించుకోవడానికి చేయాల్సిందంతా చేస్తున్నారట. లక్షలాది రూపాయిలను ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి పేషీలోని అధికారికి లక్షలు ముట్టచెప్పారనే ప్రచారం సాగుతోంది. లక్షలు పుచ్చుకున్న సదరు అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు జాయింట్ డైరెక్టర్‌కు పోస్టింగ్ ఇచ్చేందుకు శరవేగంగా దస్త్రాన్ని కదిలించారు. వాస్తవానికి యోగా డే రోజునే పోస్టింగ్ ఇవ్వడానికి అధికారులు దస్త్రాన్ని కదిలించారు. అయితే.. అప్పుడు కుదరకపోవడంతో..ఇప్పుడుమరోసారి దస్త్రాన్ని ముందుకు జరుపుతున్నారు. వాస్తవానికి గత పదేళ్ల నుంచి సదరు జాయింట్ డైరెక్టర్ సమాచారశాఖ రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదేళ్లు పనిచేసిన వారిని అక్కడ నుంచి బదిలీ చేయాలి. కానీ సదరు అధికారి తనకున్న ధనబలం, వైకాపా పార్టీ బలంతో మళ్లీ అక్కడే తిష్టవేయడానికి యత్నిస్తున్నారు. దీనికి మంత్రి కార్యాలయం వంత పాడుతోంది. అవినీతి అధికారులను శిక్షిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మంత్రి పార్థసారధి ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు మళ్లీ కీలకపోస్టులు ఎందుకు ఇస్తున్నారు..? దీనిలో ఆయనకు ఉన్న లాభం ఏమిటి..? అదే విధంగా వివాదాస్పద అధికారి అయిన జాయింట్ డైరెక్టర్‌కు పోస్టింగ్ ఇవ్వడానికి మంత్రి కార్యాలయం ఎందుకు అత్యుత్సాహం చూపిస్తోంది. ఎందుకు మంత్రి కార్యాలయం పదే పదే సమాచారశాఖ అధికారులకు ఫోన్లు చేసి..సదరు అధికారి పోస్టింగ్ ఫైల్‌ను పంపించాలని ఒత్తిడి తెస్తున్నారో..తెలియడం లేదు. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ములు చేతులు మారియానే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ అవినీతి అధికారికి పోస్టింగ్ ఇప్పించడంలో గుంటూరు జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే అండకూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాజధాని ప్రాంతంలోని సదరు ఎమ్మెల్యే తన సామాజికవర్గానికి చెందిన ఈ అధికారికి పోస్టింగ్ ఇప్పించడానికి భారీగా సొమ్ములు తీసుకున్నారని తెలుస్తోంది.
ఏసీబీ దర్యాప్తుపై ప్రభావం...!
గత వైకాపా ప్రభుత్వంలో సమాచారశాఖను అంతా తానై నడిపించిన సదరు జాయింట్ డైరెక్టర్ కోట్లాది రూపాయలు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్ములతో ఇప్పుడు సమాచారశాఖ మంత్రి కార్యాలయాన్ని కొనేశారనే మాట వినిపిస్తోంది. లక్షల రూపాయలను యధేచ్చగా జల్లేస్తున్నారని, పైస్థాయి నుంచి కింది స్థాయి వరకూ అందరినీ కొనేశామని సదరు అధికారి చెప్పుకుంటున్నారు. తనకు పోస్టింగ్ ఇవ్వకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని, తన సత్తా ఏమిటో చూద్దురు ..అంటూ సవాళ్లు విసురుతున్నారట. ఈ మొత్తం వ్యవహారంలో సమాచారశాఖ మంత్రి కార్యాలయంపై భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు ఆ కార్యాలయానికి అంత అత్యుత్సాహం...? సదరు జాయింట్ డైరెక్టర్ నిర్దోషా..? ఎటువంటి ఆరోపణలు, అవినీతి లేదా..? ఏసీబీ, విచారణ జరుగుతుండగా..ఏమిటీ హడావుడి..? అంటే..మంత్రి పేషీ అధికారికి ఎంత ముట్టిందో..అన్న అనుమానాలు సాక్షాత్తూ శాఖలోని అధికారులే చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు సమాచారశాఖ మొత్తాన్నితన గుప్పెట్లో పెట్టుకుని, కార్యాలయాన్ని వైకాపా ఆఫీస్‌గా మార్చేసిన సదరు అధికారికి ఇప్పుడు మళ్లీ అక్కడే పోస్టింగ్ ఇస్తే..జరుగుతున్న దర్యాప్తుపై ప్రభావం చూపదా..? ఇప్పటికే సమాచారశాఖ అవినీతిపై విచారణ అంతంత మాత్రమే జరుగుతోందన్న అనుమానాలు జర్నలిస్టు వర్గాల్లో ఉంది. ఇప్పుడు మళ్లీ అదే అధికారికి అక్కడే పోస్టింగ్ ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటి? వైకాపాకు అంకితభావంతో పనిచేసే సదరు అధికారిని మళ్లీ అక్కడే నియమిస్తే..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని సదరు అధికారి వైకాపా పెద్దలకు అందించకుండా ఉంటుందా..? జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన విజయ్‌కుమార్‌రెడ్డి శిష్యులకు కూటమి ప్రభుత్వం మళ్లీ కీలక బాధ్యతలు అప్పజెప్పడం ఏమిటి..? దీని వెనుక మంత్రి కార్యాలయం ఉద్దేశ్యం ఏమిటో..? మంత్రి కార్యాలయ అధికారి..సదరు అధికారి సమాజికవర్గం కావడమే దీనికి కారణమా..? లేక మంత్రి కార్యాలయ అధికారి కూడా వైకాపా సానుభూతిపరుడా..? మళ్లీ వైకాపాను అధికారంలోకి తేవడానికి వీళ్లు కృషి చేస్తున్నారా..? అత్యంత సున్నితమైన సమాచారాన్ని తమ వైకాపా బాసులకు అందించడం కోసమే సదరు అధికారిని ఇక్కడకు తెస్తున్నారా..? ఏది ఏమైనా..సమాచారశాఖ మంత్రి కార్యాలయం వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా తయారైందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి. జర్నలిస్టులతో నిత్యం గొడవలు పెట్టుకునే సదరు అధికారిని మళ్లీ శాఖలోనికి ఎందుకు తెస్తున్నారనే ప్రశ్న వివిధ జర్నలిస్టు సంఘాల నుంచి వస్తున్నాయి. మొత్తం మీద సమాచారశాఖ మంత్రి తన కార్యాలయ అధికారిని అదుపులో పెట్టుకోకపోతే..రాజకీయంగా మంత్రికి ఎదురు దెబ్బలు తప్పవు. ఇప్పటికైనా వివాదాస్పద అధికారి పోస్టింగ్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి.