లేటెస్ట్

‘చంద్ర‌బాబు’ ‘గుడివాడ‌’ను వ‌దిలేశారా...!?

అధికారం కోల్పోయి రెండేళ్లు దాటుతున్నా టిడిపి  అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పార్టీ ప‌ట్ల నిస్తేజంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు పార్టీ వ‌ర్గాల నుంచి వ‌స్తున్నాయి. అప్పుడు అధికారంలో ఉండి పార్టీని ప‌ట్టించుకోకుండా రోజూ టెలీకాన్ఫ‌రెన్స్ లు, వీడియో కాన్ఫ‌రెన్స్ లు, క‌లెక్ట‌ర్ల‌తో న‌మావేశాలు త‌దిత‌రాలు నిర్వ‌హించి ఎన్నిక‌ల్లో చావుదెబ్బ తిన్నారు. అప్ప‌ట్లో విభ‌జిత రాష్ట్రం క‌నుక అధికార కార్య‌క్ర‌మాల్లో ఎక్కువ స‌మయం కేటాయించాల్సి వ‌చ్చింద‌ని అందుకే పార్టీని ప‌ట్టించుకోవ‌డానికి స‌మ‌యం లేద‌ని చెప్పుకున్నారు. స‌రే..అప్ప‌డు జ‌రిగిందేదో..జ‌రిగిపోయింది. ఇప్పుడు అధికారం కోల్పోయి రెండున్న‌రేళ్లు కావ‌స్తున్నా ఆయ‌న పార్టీని స‌రిదిద్ద‌డం లేద‌నే మాట పార్టీ వ‌ర్గాల ద్వారా వినిపిస్తోంది. దాదాపు ఏడాదిన్న‌ర నుంచి క‌రోనా వ‌ల్ల కావాల్సినంత స‌మయం దొరికినా..పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న వివిధ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఆయ‌న దృష్టి సారించ‌లేదు. 


టిడిపికి గ‌ట్టి ప‌ట్టున్న కృష్ణా జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో ఘోర‌మైన ప‌రాభ‌వం ఎదురైంది. 16 అసెంబ్లీ స్ధానాలు ఉన్న ఈ జిల్లాలో టిడిపి కేవ‌లం రెండు చోట్ల మాత్ర‌మే విజ‌యం సాధించింది. గ‌న్న‌వ‌రం, విజ‌య‌వాడ తూర్పుల్లో టిడిపి విజ‌యం సాధించింది. గ‌న్న‌వ‌రం నుంచి గెలిచిన వ‌ల్ల‌భ‌నేని వంశీ వైకాపాలోకి వెళ్లారు. దీంతో జిల్లా టిడిపి ఒకే ఒక స్ధానానికి ప‌రిమిత‌మైంది. అంటే జిల్లాలో టిడిపి ఇప్పుడు దాదాపుగా శూన్య‌స్థితిలో ఉంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని బ‌ల‌ప‌రుచుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అధినేత అనుకున్నంత వేగంగా చర్య‌లు తీసుకోవ‌డం లేదంటున్నారు. ముఖ్యంగా త‌న‌ను, త‌న కుమారుడైన లోకేష్ ను నిత్యం దూషిస్తూ, విమ‌ర్శ‌లు చేస్తోన్న గుడివాడ ఎమ్మెల్యే, పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మంత్రి కొడాలి నాని నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి బాగా బ‌ల‌హీన‌ప‌డింది. గ‌తంలో టిడిపికి ఎంతో ప‌ట్టున్న ఈ నియోజ‌క‌వ‌ర్గం కొడాలి చేతుల్లోకి పోయింది. 


టిడిపి స్థాపించిన‌ప్ప‌టి నుంచి ఇక్క‌డ 11సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా, మొత్తం 8సార్లు టిడిపి అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడైన ఎన్టీఆర్ ఈ స్థానం నుంచి రెండుసార్లు విజ‌యం సాధించ‌గా, రావి శోభ‌నాద్రి చౌద‌రి కుటుంబం నాలుగుసార్లు విజ‌యం సాధించింది. కాగా ప్ర‌స్తుత మంత్రి ‘కొడాలి నాని’ రెండుసార్లు టిడిపి త‌రుపున‌, రెండుసార్లు వైకాపా త‌రుపున విజ‌యం సాధించారు. టిడిపి కంచుకోట అయిన ఈ స్థానంలో ఇప్పుడు వైకాపా పాగా వేసింది. నాలుగుసార్లు వ‌రుస‌గా ఇక్క‌డ నుంచి గెలిచి, గ‌ట్టి ప‌ట్టును సాధించిన టిడిపి ఆయ‌న‌పై విజ‌యం సాధించ‌డానికి స‌రైన అభ్య‌ర్థిని ఇంత వ‌ర‌కు త‌యారు చేసుకోలేద‌నే మాట నియోజ‌క‌వ‌ర్గ టిడిపి వ‌ర్గాల నుంచి వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ‘కొడాలి’కి గ‌ట్టిపోటీ ఇస్తార‌ని విజ‌య‌వాడ నుంచి దేవినేని అవినాష్ ను తీసుకెళ్లి కొడాలిపై పోటీ పెట్టారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో దేవినేని ఘోరంగా ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో క‌న్నా ‘కొడాలి’కి డ‌బుల్ మెజార్టీ వ‌చ్చింది. త‌రువాత దేవినేని వైకాపాలో చేరిపోయారు. దాంతో టిడిపి రావి వెంక‌టేశ్వ‌ర రావును ఇన్ ఛార్జిగా పెట్టింది. అయితే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అందుబాటులో ఉండ‌కుండా హైద‌రాబాద్ లో ఉంటున్న‌ర‌ని కార్య‌క‌ర్త‌ల‌కు, అభిమానులు అంటున్నారు. కొడాలి లాంటి బ‌ల‌మైన నేత‌ను ఓడించాలంటే అంత‌కంటే బ‌ల‌మైన నేత‌ను ఎంపిక చేయాల‌ని అలా అయితేనే రాబోయే ఎన్నిక‌ల్లో కొడాలిని ఓడించ‌గ‌లుగుతార‌ని, కానీ అధిష్టానం ఇంకా రావినే ప‌ట్టుకుని వేలాడుతుంద‌ని, ఇప్ప‌టికైనా ఈ నియోజ‌క‌వ‌ర్గం గురించి అధినేత ప‌ట్టించుకోవాల‌ని వారు కోరుతున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ