‘దత్తపుత్రుడి’పై ‘మోడీ’కి ప్రేమ తగ్గలేదు...!
టిడిపి,జనసేన, బిజెపి కూటమి ప్రతిష్టాత్మకంగా ‘చిలకలూరిపేట’లో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభ విజయవంతమైంది. భారత ప్రధాని ‘నరేంద్రమోడీ’ ముఖ్య అతథిగా హాజరైన ఈ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. అయితే..ఈ సభలో ప్రధాని ‘మోడీ’ చేసిన ప్రసంగం సభకు హాజరైన వారిని పెద్దగా ఆకట్టుకోలేదు. స్థానిక అంశాలను ప్రస్తావించకుండా, ‘జగన్’ పాలనపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా సాగిన ప్రసంగం కూటమి అభిమానులకు రుచించలేదు. ఐదేళ్ల ‘జగన్’ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైనా, ప్రధాని దాని గురించి ప్రస్తావించలేదు. కేవలం రాష్ట్రంలోని మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని మాత్రమే ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద అవినీతిపరుడిగా ప్రచారం జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్ గురించి నేరుగా ప్రస్తావించకుండా ఆయనపై తనకు ఇంకా ప్రేమ తగ్గలేదని ‘మోడీ’ ఈ సభ ద్వారా చాటి చెప్పారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం ఉందని, దాన్ని పెకలించి వేయాలని మాత్రమే ఆయన అన్నారు. నేరుగా ‘జగన్’ పాలనపై వ్యాఖ్యలు చేయకపోవడం ద్వారా..తనకు ‘జగన్’ ఎంతటి సన్నిహితుడో..మరోసారి ‘మోడీ’ రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పారు. తమ బంధం రాజకీయాలకు అతీతమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గతంలో చెప్పిన మాటనే ‘మోడీ’ రుజువు చేశారు. మొత్తం మీద ‘మోడీ’ ‘జగన్’ పాలనను దుయ్యబడతారని, ఆయనపై నేరుగా విమర్శలు చేస్తారని ఆశించిన ‘టిడిపి, జనసే’ నాయకులు, కార్యకర్తల ఆశలను ఆయన ఆడియాస చేశారు.
కేంద్రంలో మరోసారి తాము అధికారంలోకి వస్తామని, రాష్ట్రంలో ఎన్‌డిఎను గెలిపిస్తే డబుల్‌ఇంజిన్ సర్కార్ వస్తుందని ఆయన అన్నారు. అదే విధంగా రాష్ట్రానికి గతంలో తాము ఇచ్చిన సంస్థల గురించి ప్రస్తావించారు. అయితే..రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన రాజధాని ‘అమరావతి’ గురించి కానీ, పోలవరం గురించి కానీ ఆయన కనీసం ప్రస్తావించలేదు. మూడు రాజధానులంటూ ‘జగన్’ ఆడుతున్న వికృత క్రీడను గురించి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ పాలన గురించి కానీ ఆయన మాట మాత్రంగానైనా చెప్పలేదు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజధాని ‘అమరావతి’ని అభివృద్ధిచేస్తామని చెప్పి ఉన్నా బాగుండేది. రాజధాని కోసం భూములు ఇచ్చిర రైతుల గురించి కూడా పట్టించుకోలేదు. మొత్తం మీద ‘జగన్’ పాలనపై, ఆయన అవినీతిపై ఏదో చెబుతారుకున్న వారికి ఈ సభ నిరాశపరిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. భారీగా హాజరైన ప్రజలు పదే పదే వేదిక వద్దకు తోచుకురావడంతో మైక్‌లు పలుసార్లు మొరాయించి ‘ప్రధాని’ ప్రసంగానికి అంతరాయం కలిగింది.