లేటెస్ట్

పరిగెత్తుతోన్న వాళ్ల కాళ్లలో ‘కట్టె’ పెట్టిన ‘బిజెపి’..!

వేగంగా పరిగెత్తుతున్న వాళ్ల కాళ్లలో ‘కట్టె’పెడితే ఏమవుతుంది..! బొక్క‌బోర్లా ప‌డ‌తారు..అచ్చం అలానే ఉంది టిడిపి,జ‌న‌సేన పార్టీల ప‌రిస్థితి. ఎన్నిక‌ల ప‌రుగుపందెంలో...ప్ర‌త్య‌ర్థికి అంద‌కుండా..విజ‌య‌తీరాల‌ను అందుకోవ‌డానికి..ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప‌రుగెడుతోన్న వారి కాళ్ల‌లో కట్టె పెట్టి వినోదాన్ని చూస్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పెద్ద‌లు.  ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తుపెట్టుకుని..వారి ఓటమికి తెరవెనుక..తెరముందు చేయాల్సిన పనులన్నీచేస్తోంది. ఒక రాజకీయ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీ ఇలా చేస్తుందా..? అసలు ఇలా కూడా జరుగుతుందా..అన్న ప్ర‌శ్న‌ల‌కు..అవున‌నే బిజెపి పెద్ద‌లు స‌మాధానం ఇస్తున్నారు. త‌మ‌కు న‌చ్చిన‌వారిని గెలిపించ‌డానికి, త‌మ‌కు న‌చ్చ‌న‌వారిని ఓడించ‌డానికి ఎన్ని మార్గాలు ఉంటే..అన్ని మార్గాల‌ను వారు వాడుకుంటున్నారు. ఇది నైతికంగా స‌రైన‌దా..కాదా..అనే దాన్ని ప‌క్క‌న పెట్టి త‌మ ద‌త్త‌పుత్రుడికి మేలు చేసే ప‌నులు చేస్తున్నారు.  ఎన్నికల వేళ వేగంగా ముందుకెళుతోన్న ‘టిడిపి,జనసేన’పార్టీలతో బలవంతంగా పొత్తు కుదుర్చుకుని, ఆ పొత్తుతో ప్రత్యర్థికి మేలు చేసేలా బిజెపి పెద్దలు పావులు కదుపుతున్నారు. ‘టిడిపి’ అధినేత ‘చంద్రబాబు’ను, జనసేన అధినేత ‘పవన్‌కళ్యాణ్‌’ను నట్టేముంచడానికి ప్రధానిమోడీ, హోంమంత్రి అమిత్‌షా చేస్తోన్న ప్రయత్నాలు టిడిపి,జనసేన నేతలు,కార్యకర్తల్లో ఆగ్ర‌హాన్ని,నిర్వేదాన్ని, నిరాశ‌ను క‌ల్గిస్తున్నాయి.. అసలు బిజెపితో పొత్తు ఎందుకు పెట్టుకున్నాంరా..? అనే బాధ వారిలో వ్యక్తం అవుతోంది. తమ దత్తపుత్రుడిని గెలిపించేందుకు తెరవెనుక, వ్యూహాత్మక ఎత్తులతో, రాష్ట్రంలో ‘బిజెపి’ వేస్తోన్న ఎత్తులు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.

వాస్తవానికి టిడిపి,జనసేన, బిజెపి పొత్తు కుదిరిన వెంటనే జరిగిన ‘చిలకలూరిపేట’ సభ సాక్షిగానే ‘ప్రధాని మోడీ’ వ్యవహారం, ఆయన చీకటి రాజకీయాలు టిడిపి, జనసేన పెద్దలకు అర్థం అయ్యాయి. కానీ చేసేదేమీ లేక దింగమింగుకుని, ప్రజలను నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. పొత్తులో ఉన్న పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించకపోయినా..తమకు ఏ విధంగా సహకరించకపోయినా, ప్రత్యర్థికి పరోక్షంగా సహకరించినా..వారు ఏమీ చేయలేక మౌనంగా అవమానాలను భరిస్తున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకుంటే..ఎన్నికల్లో ‘జగన్‌’ చేస్తోన్న అక్రమాలకు అడ్డుకట్టపడుతుందన్న భావనతో కార్యకర్తలకు, నాయకులకు పొత్తు ఇష్టం లేకపోయినా..‘చంద్రబాబు’ వారితో పొత్తుకు అంగీకరించారు. అయితే..పొత్తు తరువాత..బిజెపి వ్యవహరిస్తోన్న తీరు..చేదు ఫలితాలకు దారి తీస్తాయా..? అనే అనుమానాలు పార్టీ నేతలతో పాటు, పరిశీలకులు కూడా వస్తున్నాయి. ‘చిలకలూరిపేట’ సభలో ఏదో జరిగిందిలే అని సరిపెట్టుకుంటే..ఆ తరువాత జరిగుతోన్న పరిణామాలు టిడిపి, జనసేనను ఇంకా ఇరకాటంలోపడేస్తున్నాయి.

ఈ రోజు జరిగిన ‘మెనిఫెస్టో’ విడుదల కార్యక్రమంలో ‘బిజెపి’ మరో ముసుగుదెబ్బతో కూటమిని దెబ్బతీసింది. ముందుగా టిడిపి, జనసేన, బిజెపి పార్టీల ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని ప్రచారం సాగింది. మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టో విడుదల చేస్తారని, దాని కోసం అందరూ వేచి చూస్తున్న సమయంలో బిజెపి అడ్డుపుల్ల వేసింది. టిడిపి, జనసేన మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని, తమ పేరును మేనిఫెస్టో నుంచి తొలగించాలి ఆర్డర్‌ వేసింది. హఠాత్తుగా బిజెపి పెట్టిన అడ్డంకుతో..అప్పటికప్పుడు ‘టిడిపి,జనసేన’ మేనిఫెస్టోను మరోసారి ముద్రించుకుని తీసుకురావాల్సి వచ్చింది. టిడిపి, జనసేన ఇచ్చిన హామీలతో తమకు సంబంధం లేదని బిజెపి చెబుతోంది. తద్వారా..కూటమి అధికారంలోకి వచ్చినా..వారు ఇచ్చిన హామీల అమలులో తమకు భాగం లేదని పరోక్షంగా తెలియచేసింది. దీని ద్వారా..టిడిపి, జనసేన హామీలపై ప్రజలకు విశ్వాసం లేకుండా చేయడమే వారి ఉద్ధేశ్యం. ఇప్పటికే టిడిపి,జనసేన ఇస్తోన్న హామీల అమలుకు సొమ్ములు ఎక్కడ నుంచి తెస్తారని వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు హామీలతో ‘బిజెపి’కి సంబంధం లేదని చెపితే..ఇంకెలా అమలు చేస్తారని వారు ప్రశ్నిస్తారు. అంతే కాదు..దీనిపై ప్రజల్లో విషప్రచారం చేస్తారు. టిడిపి,జనసేన హామీలు బూటకమని, కేంద్రంలో అధికారంలోకి రాబోయే పార్టీ మద్దతు లేకుండా హామీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించే అవకాశాన్ని ‘బిజెపి’ వారికి కల్పించింది. తెరవెనుక వ్యూహంలో భాగంగానే...బిజెపి ఇలా వ్యవహరించిందనే అనుమానాలు ఉన్నాయి. జ‌న‌సేన గుర్తును ఇండిపెండెంట్ల‌కు కేటాయించ‌డంలో వైకాపా, బిజెపి పెద్ద‌ల కుట్ర ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది వారి అవ‌గాహ‌న‌లో భాగ‌మేన‌ని, జ‌న‌సేన పోటీలో లేని స్థానాల్లో జ‌న‌సేన ఓట్ల‌ను చీల్చి టిడిపిని దెబ్బ‌తీయ‌డానికే ఇలా చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఒక రిజిస్ట‌ర్ పార్టీకి కేటాయించిన గుర్తును ఇండిపెండెంట్ల‌కు ఇవ్వ‌డం ఏమిటి..? ఇదంతా ఒక కుట్ర ప్ర‌కార‌మే చేస్తున్నారు.

ఇప్పటికే..అడ్డగోలుగా వ్యవహరిస్తోన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్‌బాస్‌లను బదిలీ చేయాలన్న ప్రతిపక్షపార్టీల విన్నపాన్ని పక్కనపెట్టింది. పొత్తులో ఉన్న పార్టీల విన్నపాలను పట్టించుకోని బిజెపి పెద్దలు..తమ దత్తపుత్రుడు అడిగిన ఏ పనైనా..వెంటనే చేసేస్తున్నారు. తిరుమల ఇవోగా ఉన్న ‘ధర్మారెడ్డి’ పదవీ కాలం పొడిరగింపును ‘జగన్‌’ అడిగిన మరుక్షణమే చేశారు. అంటే..వారి మనస్సు ఎటువైపు ఉందో అర్థం అవడం లేదా...? రఘురామరాజు వ్యవహారం కానీ, బలం లేకున్నా బలవంతంగా సీట్లు తీసుకున్న వ్యవహారం కానీ...విషయం ఏదైనా..పొత్తు వికటించాలనేదే ‘బిజెపి’ పెద్దల అంతరంగమనే విషయం ఈ రోజు జరిగిన సంఘటనతో మరోసారి ప్రజలకు అవగతం అవుతోంది. బిజెపి కొడుతోన్న కముకు దెబ్బలను కాసుకుంటూ..చంద్రబాబు, పవన్‌లు తమ పని తాము చేసుకుంటూ ముందుకుపోతున్నారు. వారు ప్రజలనే నమ్ముకుని..ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ‘జగన్‌’పై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిపైనే వారు ఆధారపడుతున్నారు. రాబోయే 13 రోజులు కీలకం కనుక బిజెపి పెద్దలు కాళ్లలో ఎన్ని కట్టెలు పెట్టినా..వాటిని దాటుకుని...విజయతీరాలకు చేరడానికి యత్నిస్తున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ