Breaking-News

"Kesineni":PRP Via TDP to YSRCP

‘విజయవాడ’ ‘టిడిపి’ రాజకీయాల్లో జరగాల్సిన తంతు జరిగిపోయింది. ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం ఎన్నికలకు మూడు నెలలు ముందు పూర్తయింది. అంతా ముందు నుంచి అనుకున్న విధంగానే జరిగింది. ఎక్కడా..అంచనాలు తప్పలేదు. ఇదంతా..‘విజయవాడ‘ ‘టిడిపి’ ఎంపి ‘కేశినేని నాని’ రాజీనామా వ్యవహారం గురించే. ఆయన ‘టిడిపి’లో ఉండరని, పార్టీ మారతారని కృష్ణా జిల్లాలో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అనుకున్నట్లుగానే ఆ తంతు ఆ రోజు ముగిసిపోయింది. అయితే..టిడిపి అభిమానులు..‘నాని’ని అభిమానించే..కొందరు ‘కమ్మ’లు ఆయన టిడిపికి దూరం అయినా..ఏ ‘బిజెపి’కో లేకుంటే..‘ఇండిపెండెంట్‌’గానో ఉంటారని ఆశించారు. అయితే..‘నాని’ టిడిపికి రాజీనామా చేసిన వెంటనే వారి ఆశలపై నీళ్లు జల్లుతూ...వైకాపాలోకి వెళ్లిపోయారు. ఆయన టిడిపి నుంచి వైకాపాలోకి వెళ్లడంతో..నిన్న మొన్నటి దాకా..ఆయన పట్ల సానుభూతితో ఉన్నవారు కూడా ఇప్పుడు నోరెత్తడం లేదు. తనతో పాటు..ఎన్టీఆర్‌ జిల్లాలో ఉన్న టిడిపిలోని 60శాతం కార్యకర్తలు, నాయకులు తన వెంట వస్తారని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే..అది జరిగే సూచనలు మాత్రం కానరావడం లేదు. ఆయన టిడిపికి రాజీనామా చేసిన తరువాత..పేరున్న ఒక్కనేత కూడా..ఆయనకు మద్దతుగా టిడిపికి రాజీనామా చేయలేదు. దీంతో..‘కేశినేని’ ఒంటరిగానే..వైకాపాలో చేరాల్సివస్తుంది. 

వ్యవహారశైలే కారణం:

వాస్తవానికి..‘కేశినేని నాని’ విజ‌య‌వాడ‌లో బాగానే ప‌నిచేశార‌నే మంచి పేరు ఉంది. ఆయ‌న విజ‌య‌వాడ ఎంపిగా ఎన్నికైన ద‌గ్గ‌ర నుంచి ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న క‌న‌క‌దుర్గ‌మ్మ వార‌ధిని పూర్తి చేయించ‌గ‌లిగారు. త‌రువాత బెంజ్ స‌ర్కిల్ ప్లైఓర్‌ను నిర్మించ‌డం, టాటా వారితో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేయించ‌డంతో..ప‌నిచేసే రాజ‌కీయ నాయ‌కునిగా ఆయ‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. అయితే..ఆ మంచి పేరు ఆయ‌న వ్య‌వ‌హార‌శైలితో నాశ‌న‌మైపోయింది.  2019 ఎన్నికల్లో టిడిపి ఘోర ఓటమి తరువాతే..ఆయన వ్యవహారశైలిలో తీవ్రమైన మార్పు వచ్చింది. టిడిపి అంతా ఘోరంగా ఓడినా..తాను గెలిచానంటే..అది పార్టీ వల్ల కాదని, తన స్వంత ఇమేజ్‌ వల్లే తాను గెలిచాననే అహంభావం ఆయనలో నిలువెల్లా పాకిపోయింది. దీంతో ఆయన దృష్టిలో ‘టిడిపి’ ఆప్ట్రాల్‌ పార్టీగా మారిపోయింది. తన గెలుపుకు తానే కారణమని, పార్టీ మొత్తం ఓడిపోవడానికి పార్టీ, చంద్రబాబే కారణమని, ఇక పార్టీ బతకదని ఆయన భావించారు. అందుకే..పార్టీని, పార్టీ అధ్యక్షుణ్ణి తేలిగ్గా తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, అధినేతకు తగిన గౌరవం ఇవ్వకుండా..తనంతటి వాడు లేడన్నట్లు..తన వల్లే పార్టీ బతికి బట్టకడుతుందన్న భావన ఆయన వ్యవహారశైలిలో కనిపించసాగింది. ‘విజయవాడ’ పార్లమెంట్‌ పరిధిలోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్లాల్లో తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలనే విధంగా ఆయన అధిష్టానాన్ని బెదిరించసాగారు. సీనియర్‌ నేతలకు వ్యతిరేకంగా అసంతృప్తులను ఎగదోయడం, బీసీ నేతలను చిన్న బుచ్చడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అదే విధంగా..పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘మహానాడు’కు డుమ్మాకొట్టడం, అధినేతపై విసుర్లు విసరడం వంటి చర్యలను అదే పనిగా కొనసాగించారు. అయితే..పార్టీ అధిష్టానం అప్పటి పరిస్థితుల్లో..ఆయన చేస్తోన్న చేష్టలు, వ్యాఖ్యలను చూసీ చూడనట్లు వదిలేసింది. పలుసార్లు అధినేత ‘చంద్రబాబు’ బుజ్జగించినా..ఆయన వ్యవహారశైలి మారలేదు. అధినేతను పలువురి ముందు చిన్నచూపు చూడడం..పరోక్షంగా ఆయనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం, ఇతరత్రా పార్టీలోని అసంతృప్తులను ప్రోత్సహించడం వంటివి చేసినా..అధిష్టానం..అప్పట్లో చేసేదేమీ లేక మౌనంగా,గుంభనంగా వ్యవహరించింది. అయితే..‘కేశినేని’ కుటుంబంలో చెలరేగిన కలహాలతో..‘నాని’ తమ్ముడు ‘చిన్ని’ బయటకు రావడం, టిడిపి అధినేత ‘చంద్రబాబు’ను..ఆయన కుమారుడి వద్దకు రావడంతో..‘టిడిపి’ అధిష్టానం ‘నాని’పై కొరడా ఝ‌ళిపించడం మొదలెట్టింది. ముందుగా..‘చిన్ని’కి ‘విజయవాడ’ పార్లమెంట్‌ బాధ్యతలు అప్పగించి..‘నాని’కి చెక్‌ పెట్టింది. దీంతో ‘నాని’ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకవలే అయింది. అయితే ఆయన కూడా గుంభనంగా కొన్నాళ్లు వ్యవహారాలను  ముందుకు నడిపించారు. అధిష్టానం తనను వదలుకోదనే భరోసాతో ఉన్నారు. అయితే..ఎన్నికలు దగ్గరపడుతుండడంతో..టిడిపి అధిష్టానం ‘నాని’కి టిక్కెట్‌ ఇవ్వడం లేదని, ‘చిన్ని’కి బాధ్యతలు ఇస్తున్నామని, టిడిపి సభకు రావాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టింది. దీంతో..‘నాని’ ‘టిడిపి’ నుంచి నిష్క్రమించక తప్పలేదు. 

వైకాపా నుంచి గెలుస్తారా..?

తాను ఎవరినీ టిక్కెట్‌ అడగలేదని, అడగనని సిఎం జగన్మోహన్‌రెడ్డి కలిసిన అనంతరం చెప్పుకున్న ‘కేశినేని’ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా..? చేసినా..గెలుస్తారా..? టిడిపిలో ఉన్నట్లుగా వైకాపాలో ఉండదనేది జగమెరిగిన సత్యమే. ‘తాడేపల్లి’ ప్యాలెస్‌ ముందు రాబోయే రోజుల్లో టిక్కెట్‌ కోసం దేబిరించాల్సిందే. అత్యంత సన్నిహితులు, బంధువులనే మెడపట్టుకుని బయటకు నెడుతోన్న ‘జగన్‌’ ‘కేశినేని’కి విలువిస్తారా..? టిడిపిలో ఆత్మగౌరవానికి భంగం కలిగిందన్న ‘నాని’కి ఇక ‘తాడేపల్లి’లో జరిగేదేమిటో..తెలియదా..? అయినా..టిడిపి అధినేత ‘చంద్రబాబు’పై, ‘లోకేష్‌’పై తిట్లదండకం చదివితే..సీటు రావడం గ్యారెంటీ కనుక..అది మొదటి రోజే ప్రారంభించారు కనుక..సీటు వస్తుందేమో..అయితే..గెలుపెలా..? రాజధాన్ని మూడుముక్కలు చేసి ఆడుకుంటోన్న ‘జగన్‌’ ‘విజయవాడ’ తనకు ప్రాణం అంటోన్న ‘నాని’ మొర ఆలకిస్తారా..? టిడిపి హయంలో బ్రహ్మాండంగా ‘విజయవాడ’ను అభివృద్ది చేస్తే..నాటి అభివృద్ధిని పక్కన పెట్టి..రాజధాన్ని ముంచిన ‘జగన్‌’ను ఈ ప్రాంత ప్రజలు ఆదరిస్తారా..? తన స్వంత ఇమేజ్‌తో గెలుస్తాననే భ్రమతో ఉన్న ‘నాని’ ‘జగన్‌’ అహం ముందు నిలబడతారా..? ఐదేళ్ల పాలన ‘జగన్‌’ పాలనలో..రాష్ట్రం అధోగతి పాలైందనే భావన రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో ‘నాని’ గెలుపు సాధ్యమయ్యే పనేనా..? 

ఆది నుంచీ వివాదాస్పదమే...!

‘కేశినేని నాని’ వ్యవహారశైలి ఆది నుంచే వివాదాస్పదం. ఆయన రాజకీయజీవితం సినీనటుడు ‘చిరంజీవి’ స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీ నుంచి మొదలైంది. ప్రజారాజ్యం స్థాపన సందర్భంలో ఎంతో అట్టహాసంగా వ్యవహరించిన ‘నాని’ ఎన్నికల ముందు ‘చిరంజీవి’తో విభేదించి ఆ పార్టీ నుంచి పోటీ చేయకుండానే..బయటకు వచ్చేశారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో ‘టిడిపి’లో చేరి టిడిపి హవాలో ‘ఎంపి’గా గెలుపొందారు. ‘విజయవాడ’ ఎంపిగా కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే..అప్పట్లో ‘ఆర్టీఓ’ వివాదంతో వార్తల్లో నిలిచారు. టిడిపిలోని ఓ వర్గానికి ‘కేశినేని’ పొగసకపోవడంతో..తన రవాణా వ్యాపారాన్ని మూసేశారు. 2019 ఎన్నికల తరువాత మరింతగా ‘కేశినేని’ వివాదాల్లో నిలిచారు. మున్సిపల్‌ ఎన్నికల్లో..తన కుమార్తెను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించడం..తరువాత టిడిపి ఓడిపోవడంతో..నెపమంతా..‘బుద్ధా వెంకన్న’పై నెట్టేశారు. వారి వల్లే టిడిపి ఓడిపోయిందని, వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో..ఆయన పార్టీలో ఒంటరయ్యారు. ‘ప్రజారాజ్యం’పార్టీతో మొదలైన ఆయన రాజకీయ జీవితం వయా టిడిపితో కొనసాగి ఇప్పుడు ‘వైకాపా’ వద్దకు చేరింది. దీంతో..ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుందని, ఆయనకు అభిమానులైన వారు ఆవేదన చెందుతున్నారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా నిజాయితీ పరునిగా పేరు  తెచ్చుకున్న ‘నాని’ చివరకు దేశంలోనే అత్యంత అవినీతిపరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పార్టీలో చేరడం నిజంగా విధివైచిత్రినే..! 

  • (0)
  • -
  • (0)