Breaking-News

‘కృష్ణా’లో ‘గన్నవరం’తో ‘టిడిపి’ బోణీ...!

సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలలు సమయం ఉండడంతో..ఎన్నికల సర్వేలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి, జనసేన హవా ఉంటుందని ఎక్కువ సర్వేలు చెబుతున్నాయి. ఇరు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ఆ కూటమికి దాదాపు 140 నుంచి 150 సీట్లు వస్తాయని తేలుతోంది. అయితే..వారి కూటమిని విచ్ఛనం చేసేందుకు ‘వైకాపా’ ఆఖరి యత్నాలు చేస్తోంది. అయితే..వైకాపా ఎత్తులను కూటమి అగ్రనేతలు చిత్తుచేస్తూ వస్తున్నారు. వారి బుట్టలో వారు పడే అవకాశం లేదు. అనుకున్నట్లు కూటమి ఎన్నికలకు కలిసి వెళితే..ఆ పార్టీలు ఘనవిజయం సాధించడం ఖాయం. కాగా..ఉమ్మడి కృష్ణా జిల్లాలో వార్తల్లో ఉండే ‘గన్నవరం’ నియోజకవర్గం పొత్తులతో సంబంధం లేకుండానే సునాయాసంగా విజయతీరాలకు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా టిడిపికి పెట్టనికోట అయిన ‘గన్నవరం’ నియోజకవర్గంలో గత నాలుగేళ్లగా టిడిపి బలహీనపడిరది. అందుకు ఆ పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేనే కారణం. గత ఎన్నికల్లో టిడిపి తరుపున స్వల్ప మెజార్టీతో గెలిచిన ‘వల్లభనేని వంశీ’ తరువాత వైకాపాలో చేరిపోయారు. బలమైన ‘వంశీ’ పార్టీ ఫిరాయించడంతో..ఇక్కడ టిడిపికి అభ్యర్థి సమస్య తలెత్తింది. అయితే..గత ఎన్నికల్లో ‘వంశీ’పై పోటీ చేసి ఓడిపోయిన ‘యార్లగడ్డ వెంకట్రావు’ టిడిపిలో చేరడం, ఆ వెంటనే ఆయనకు టిడిపి ఇన్‌ఛార్జి పదవి అప్పగించడం చకచకా జరిగిపోయాయి. ‘యార్లగడ్డ’ నియామకంతో టిడిపి ఒక్కసారిగా పుంజుకుంది. ఎప్పుడైతే ‘యార్లగడ్డ’ వైకాపాను వీడి ‘టిడిపి’లో చేరారో..అప్పటి వరకూ ఆయన వెంట ఉన్న వైకాపాకు చెందిన శ్రేణులన్నీ ఆయన వెంట టిడిపిలోకి వచ్చాయి. అంతే కాకుండా..టిడిపి క్యాడర్‌ మొత్తం ‘యార్లగడ్డ’ రాకను ఆహ్వానించడం..వైకాపా నుంచి వచ్చిన వారిని టిడిపితో సమన్వయం చేసుకుంటూ ‘యార్లగడ్డ’ దూసుకుపోతున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే..టిడిపి నుంచి వైకాపాలో చేరిన ‘వంశీ’ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఆయనను ఇంకా వైకాపా అధిష్టానం ‘గన్నవరం’ అభ్యర్థిగా ప్రకటించలేదు. అంతే కాకుండా వైకాపాలో ఉన్న నియోజకవర్గ స్థాయి నేతలు ఆయనకు సహకరించడంలేదు.‘వంశీ’కి సీటు ఇస్తే తామంతా కాంగ్రెస్‌కు వెళతామని వారు..అధిష్టానానికి ఆల్టిమేటం ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో..వైకాపా కార్యకర్తలకు అర్థం కావడం లేదు. తన టిక్కెట్‌పై స్పష్టత రాకపోవడం, మరోవైపు ద్వితీయ శ్రేణి నేతలంతా ‘యార్లగడ్డ’ వైపుకు వెళ్లడంతో..‘వంశీ’ అయోమయానికి గురవుతున్నారు. దూకుడుగా రాజకీయాలు చేసే ‘వంశీ’ ప్రస్తుతం ఆత్మరక్షణలో పడ్డారని, పార్టీ మారి తప్పుచేశాననే భావన ఆయనలో ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రాజధాని విషయంలో వైకాపా వ్యహరించిన తీరు, గన్నవరం విమానాశ్రయం భూముల వ్యవహారం, ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, జగన్‌ వ్యహారశైలితో విసుగు చెందిన ప్రజలు రాబోయే ఎన్నికల్లో టిడిపి వైపుకు ఏకపక్షంగా ఓటు వేయడానికి సిద్ధం అవుతున్నారు. మొన్నటి వరకు బలమైన ‘వంశీ’తో విజయం సాధించవచ్చుననుకుంటే..ఇప్పుడా ‘వంశీ’ పరిస్థితి తలకిందులు కావడంతో..ఇక్కడ టిడిపి ఏకపక్ష విజయం సాధిస్తుందని, కృష్ణా జిల్లాలో టిడిపి గెలిచే మొదటి సీటు ‘గన్నవరమే’నని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు.

  • (0)
  • -
  • (0)