లోకేష్ టీమ్‌లో మార్పులు...!?
కూటమి ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తోన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టీమ్‌లో మార్పులు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన అత్యంత కీలకమైన విద్యాశాఖతో పాటు, ఐటిశాఖకు మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విద్యావ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో సవాళ్లతో కూడుకున్న విద్యాశాఖను ఆయన చేపట్టారు. ఒకవైపు విద్యాశాఖను ఛాలెంజ్‌గా తీసుకున్న ఆయన మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికి ఐటి శాఖను కూడా ఎంచుకున్నారు. ఈ రెండు కఠినమైన మంత్రిత్వశాఖలను తీసుకుని ఆయన ఇప్పటికే అద్భుతమైన ఫలితాలను సాధించారు. విద్యాశాఖలో చాలా వరకూ మార్పులు తీసుకురాగలిగారు. అదే సమయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీ అయిన మెగా డిఎస్సీని ఎటువంటి వివాదాలు లేకుండా ఏడాదిన్నరలోనే పూర్తిచేసి నిరుద్యోగులను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మార్చేశారు. గతంలో ఎప్పుడూ ఇంత త్వరగా డీఎస్సీ పూర్తి అయిన సందర్భం లేదు. ఇదో రికార్డుగా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్లోఇదొకటని ఘనంగా ఆ పార్టీ వారు ప్రచారం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే..ఆయన ఎంచుకున్న మరోశాఖ ఐటిలో కూడా ప్రభంజనం సృష్టించారు. ఇతర రాష్ట్రాలు ఈర్ష్య పడే రీతిలో ఆయన రాష్ట్రంలో ఐటి రంగానికి పెట్టుబడులు సాధిస్తున్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతోన్న గూగూల్ డేటా సెంటర్ ఆయన పనితనానికి మచ్చుతునక. లక్ష కోట్ల గూగూల్ డేటా సెంటర్ ఆంధ్రాకు రావడం ఇతర రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. అసలు ఆంధ్రాలో ఏముందని ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు ఐటి కంపెనీలు ఆంధ్రాకు వరస కడుతున్నాయి. లక్షలాది కోట్ల పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ఇలా తాను ఎంపిక చేసుకున్న రెండుశాఖల్లోనూ ఆయన రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే..ఇలా రికార్డులు సృష్టించడంలో.. ఆయన కృషి, పట్టుదలతో పాటు..ఆయన ఎంపిక చేసుకున్న అధికారుల పాత్ర కూడా ఉందని చెప్పవచ్చు.
ఆయన టీమ్‌లో పనిచేస్తోన్న పలువురు ఐఏఎస్ అధికారులు..ఆయనతో పాటు..పరుగులు తీసున్నారు. లోకేష్ మనస్సు తెలుసుకుని, ఆయన పడుతోన్నకష్టాన్ని చూసి..వాళ్లు కూడా ఆయనతో పాటు రాష్ట్ర అభివృద్ధికై కష్టపడి పనిచేస్తున్నారు. ఇలా చేస్తోన్న అధికారుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది లోకేష్ టీమ్‌లో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి కాటమనేని భాస్కర్. ఐటిశాఖ కార్యదర్శిగా పనిచేస్తోన్న భాస్కర్ అత్యంత నిజాయితీపరుడు, సమర్థుడు, కష్టపడేతత్వం ఉన్నవ్యక్తి. రాష్ట్రానికి ఐటి రంగంలో లక్షల కోట్లు పెట్టుబడులు రావడం వెనుక లోకేష్‌తో పాటు భాస్కర్ కష్టం కూడా ఉంది. వేల కోట్లు పెట్టుబడులు అగ్రిమెంట్లు జరగడానికి, ఆయా కంపెనీల సిఇఓలతో నిత్యం సంప్రదింపుల జరపడానికి భాస్కర్ దిగే ప్లయిట్..ఎక్కే ప్లయిట్ అన్నట్లు పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీలోని జెఎన్‌టియులో ఉన్నతాభ్యాసం చేసిన ఈ ఉన్నతాధికారి తనకు అప్పగించిన పని పూర్తి చేసిన తరువాతే ఇతర విషయాలు చూస్తారు. తనతో పాటు తన వద్ద పనిచేసే అధికారులను, ఉద్యోగులను పరుగులు పెట్టిస్తారు. ఈ క్రమంలో ఉద్యోగులతో దురుసుగా వ్యవహరిస్తారనే పేరు వచ్చినా ఆయన లెక్కచేయరు. అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడని ఈ అధికారి..అప్పగించిన పనిచేయకపోతే...మాత్రం దులిపేస్తారు...ఇదే కారణంతో చాలా మంది ఉద్యోగులు ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఎప్పుడు బదిలీ అవుతారని..ఎదురు చూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే..విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తోన్న కోన శశిధర్ మంత్రి నారా లోకేష్‌కు తలలో నాలుకగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ ఇచ్చిన లక్ష్యాలను ఆగమేఘాలపై పూర్తి చేసి ఆయనతో ప్రశంసలు పొందుతున్నారు. సమర్థవంతంగా పనిచేసే అధికారిగా కోన శశిధర్‌కు మంచిపేరు ఉంది. గతంలో ఆయన అనంతపురం కలెక్టర్‌గా పనిచేసినప్పుడు కియా పరిశ్రమకు నీటి సదుపాయాన్ని రికార్డు సమయంలో కల్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు అందుకున్నారు. ఆయన కృషిని చూసే..అప్పట్లో కీలకమైన గుంటూరు జిల్లాకు ఆయనను చంద్రబాబు కలెక్టర్‌గా నియమించారు. కాగా సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు కూడా లోకేష్ టీమ్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మంత్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన పనిచేస్తున్నారు. అయితే..ఈ అధికారి ఉన్నతమైన సంస్కారవంతుడని ఆయన వద్ద పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు. ఆయన దేవుడులాంటి వారని ఇటువంటి అధికారిని తాము ఎప్పుడూ చూడలేదని విజయవాడలోని కేంద్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చెబుతున్నారు. మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని, పేదలు, విద్యార్థులు, మహిళల ఉద్యోగులు సమస్యలపై ఆయన వెంటనే స్పందిస్తారని, ఈ క్రమంలోనే మంత్రి లోకేష్‌కు, విద్యాశాఖకు ఆయన మంచిపేరు తెచ్చిపెడుతున్నారని వారు అంటున్నారు. కాగా మరో అధికారి రామరాజు కూడా కీలకంగా పనిచేస్తున్నారు. డిఎస్సీ నిర్వహణ, ఇతర విషయాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఇలా సమర్థవంతమైన టీమ్‌ను నిర్మించుకుని ఏడాదిన్నర నుంచి లోకేష్ అద్భుత ఫలితాలను రాబడుతున్నారు. అయితే..ఇప్పుడా టీమ్‌లో మార్పులు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ముందుగా ఐటిశాఖ కార్యదర్శిగా ఉన్న కాటంనేని భాస్కర్ కేంద్ర సర్వీసులకు వెళుతున్నారని ప్రచారం సాగుతోంది. లోకేష్ టీమ్‌లో అత్యంత కీలకమైన ఈయన ఢిల్లీకి వెళితే..ఆయన స్థానాన్ని భర్తీచేసే అధికారి ఎవరో..? అటువంటి అధికారిని వెతుక్కోవడం లోకేష్‌కు కత్తిమీదసామే. అయితే..ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లకపోవచ్చనే ప్రచారం కూడా ఉంది. అయితే..తాను కేంద్ర సర్వీసులకు వెళుతున్నానని కొందరి వద్ద భాస్కర్ వ్యాఖ్యానించారని ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే..భాస్కర్ కేంద్ర సర్వీసులకు వెళితే..ఆస్థానంలో ఇప్పుడు విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న కోన శశిధర్ ఐటిశాఖకు వస్తారని తెలుస్తోంది. మరి ఆయన నిర్వహిస్తోన్న విద్యాశాఖను ఎవరికి కేటాయిస్తోరో చూడాలి. అదే సమయంలో లోకేష్ టీమ్‌లో ఉన్న మరో అధికారిని కూడా బదిలీ చేస్తారంటున్నారు. మొత్తం మీద ఏడాదిన్నర నుంచి లోకేష్‌ను అంటిపెట్టుకుని, ఆయన వెంట పరుగులుతీస్తోన్న ఈ బృందంలో మార్పులు-చేర్పులు ఉంటాయనే ప్రచారం జోరుగా ఉంది. డిసెంబర్‌లో ఈ మార్పులు ఉంటాయంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో..?