మరో ముగ్గురు సలహాదార్లు...!
ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వడానికే నానా కష్టాలు పడుతోన్నరాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును దుబారా, వృధాగా ఖర్చు చేస్తోందోన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఉత్పాదకత లేనిదానిపై ఖర్చు చేస్తోందని, అనవసరమైన పదవులు, స్టేజ్ షోలు చేస్తూ లక్షల రూపాయిల ప్రజల సొమ్మును తగలేస్తోందని, గతంలోని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి పెద్ద తేడాలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా సలహాదార్లును నియమించి ప్రజల సొమ్మును తన పార్టీ వారికి, తనకు అయిన వారికి దోచిపెట్టింది. వాళ్లు ప్రభుత్వానికి ఏమి సలహాలు ఇచ్చారో..తెలియదు కానీ..అప్పట్లో ఈ సలహాదార్ల నియామకంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే అప్పట్లో 151 మదంతో ఉన్న జగన్మోహన్‌రెడ్డి దీన్ని గమనించలేదు. ఒక వేళ గమనించినా..మనల్ని ఎవడేం చేస్తాడన్నట్లు వ్యవహరించారు. ఇప్పుడు ఆయన దారిలోనే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం నడుస్తోంది. ఇటీవల కాలంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రజల సొమ్మును దుబారా చేస్తున్నారనే అభిప్రాయాలు, విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. మొన్నా మధ్య కానిస్టేబుల్స్‌గా ఎంపికైన వారి కోసమంటూ..గ్రీన్‌మ్నాట్‌లు వేసి..ఒక స్టేజ్ షో చేశారు. అప్పట్లోనే దీనిపై విమర్శలు వచ్చాయి. అంతేనా..వీరిద్దరూ ప్రత్యేక హెలీకాప్టర్‌లు వాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అయిన దానికి కానీ దానికి భారీగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సలహాదార్లు అంటూ కొంత మందిని నియమించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. తాజాగా యోగా-న్యాచురోపతి సలహాదారుగా మంతెన సత్యనారాయణను, మాస్ కమ్యూనికేషన్ సలహాదారుగా ఈనాడులో సుధీర్ఘంగా కార్డూనిస్టుగా పనిచేసిన శ్రీధర్‌ను, దేవాదాయశాఖ సలహాదారుగా చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. అయితే ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత మంది సలహాదారులు అవసరమా..? అనే ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. సుధీర్ఘ రాజకీయ, అధికార అనుభవం ఉన్న చంద్రబాబునాయుడుకు ఇంత మంది సలహాదార్లు కావాలా..? ఎందుకు ప్రజల సొమ్మును ఇలా వృదా, దుబారా చేస్తున్నారనే ప్రశ్న సామాన్య ప్రజల నుంచి వస్తోంది. మొదట్లో సాగునీటి ప్రాజెక్టుల సలహాదారుగా ఎన్.కన్నయ్యనాయుడు, తరువాత విద్యార్థుల్లో నైతికతను పెంపొందించేందుకు ప్రముఖ ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావును నియమించినప్పుడు ప్రజల్లో మంచి స్పందనే వచ్చింది. అయితే...తరువాత కాలంలో నియమించిన సలహాదారులపై ప్రజల నుంచి పెదవి విరుపులే వస్తున్నాయి. మొత్తం మీద..జగన్ బాటలోనే చంద్రబాబు ప్రభుత్వం నడుస్తోందనే మాట వినిపిస్తోంది.
కొసమెరుపుః అయితే జగన్మోహన్‌రెడ్డి హయాంలో సలహాదారుగా నియమించబడ్డవాళ్లు ఏ రంగంలో నిష్టాతులో తెలియదు. తనకు వ్యక్తిగతంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరినీ ఆయన సలహాదారుగా నియమించుకున్నారు. అయితే..ఇప్పుడు చంద్రబాబు నియమిస్తోన్న సలహాదార్లు వారి వారి రంగాల్లో నిష్టాతులు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చాగంటి కోటేశ్వరరావు, కన్నయ్యనాయుడు, సతీష్‌రెడ్డి, కెపిసి గాంధీ, సుచిత్ర ఎల్లా తదిరుల ఎంపికపై ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ..రాష్ట్రం తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న సమయంలో..ఇంత మంది సలహాదారులను నియమించడమే అభ్యంతరకరం.