విమర్శలు లెక్కచేయని చంద్రబాబు...బుడితికి మరోసారి సర్వీసు పొడిగింపు...!
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్‌కు మరోసారి ప్రభుత్వం సర్వీసును పొడిగించింది. ఆయనకు మరో ఏడాది పాటు సర్వీసును పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయశాఖకు ఎక్స్-ఆఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను ప్రభుత్వ పునర్నియామకం చేసింది. వాస్తవానికి ఆయన గత ఏడాది జనవరిలోనే రిటైర్ అయ్యారు. అప్పట్లో ఆయన సర్వీసును ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. అప్పట్లో దీనిపై విమర్శలు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం లెక్కచేయలేదు. రాజశేఖర్ జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా పనిచేశారని, ఆయన చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించారని, ముఖ్యంగా చంద్రబాబు కులానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని అప్పట్లో టిడిపి నేతలు, కార్యకర్తలు కొందరు ఆక్షేపించారు. ఆయనను మళ్లీ ఎలా నియమిస్తారని వారు టిడిపి అధినేతపై విమర్శలు గుప్పించారు. అయితే చంద్రబాబు వాటినేమీ పట్టించుకోలేదు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బుడితి రాజశేఖర్ తనకు వ్యతిరేకంగా పనిచేసినా..ఆయన అదేమీ మనస్సులో పెట్టుకోకుండా ఆయన సేవలను వాడుకున్నారు. అయితే..ఇప్పుడు మరోసారి ఆయనకు పదవీకాలం పొడిగిస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో..టిడిపి అనుకూల మీడియా, సోషల్ మీడియా ఆయనకు వ్యతిరేకంగా కథనాలను ప్రచారం చేశాయి. గతంలో ఇస్తే ఇచ్చారు కానీ..ఈసారి మళ్లీ ఆయనకు పొడిగింపు ఇవ్వవద్దని, ఆయన వ్యవసాయశాఖను బ్రష్టు పట్టించారని, ఈ ఏడాది కాలంలో వ్యవసాయశాఖ పనితీరే దానికి నిదర్శనమని వారు విమర్శలు గుప్పించారు. రైతులకు విత్తనాల కొరత, సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడం, వ్యవసాయశాఖ యూనివర్శీటిలో ఇంకా వైకాపా వారే పెత్తనం చేయడం ఇలా పలు విషయాలపై వారు ఆరోపణలు, విమర్శలు కురిపిస్తూ..ఆయనకు మరోసారి పదవీకాలం పొడిగింపు ఇవ్వవద్దని భారీగా ప్రచారం చేశారు. అయితే..టిడిపి అనుకూల మీడియా, సోషల్ మీడియా ఎంత మొత్తుకున్నా చంద్రబాబు మాత్రం ఆయనకు మరోసారి సర్వీసును పొడిగించారు. కాగా మరో ఏడాది పాటు బుడితి రాజశేఖర్ వ్యవసాయ, పట్టుపరిశ్రమ, సహకారం & మార్కెటింగ్ శాఖకు ఎక్స్-ఆఫిషియో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తారు. దీనికి ఆయనకు నెలకు రూ.3.50లక్షల జీతాన్ని(Consolidated Remuneration) ప్రభుత్వం చెల్లిస్తుంది.