రాజీనామా ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సోమ‌నాధ్‌...!?

03, Jan 2026



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతరిక్ష సాంకేతికత స‌ల‌హాదారుగా ఉన్న డా. ఎస్. శ్రీధర పణిక్కర్ సోమనాథ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయ‌న ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుకు మ‌న‌స్థాపం చెందిన ఆయ‌న రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. దాదాపు తొమ్మిది నెల‌ల క్రితం ఆయ‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ అంత‌రిక్ష సాంకేతిక స‌ల‌హాదారుగా నియ‌మించింది. అయితే..ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌కు ఎలాంటి బాధ్య‌త‌ల‌ను కేటాయించ‌లేదు. క‌నీసం ఆయ‌న‌కు కార్యాలయాన్ని కానీ, ఆయ‌న చేయాల్సిన ప‌నిని కానీ..తొమ్మిది నెల‌ల నుంచి  చెప్ప‌లేద‌ట‌.  అంత‌ర్జాతీయంగా, దేశీయంగా ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న సోమ‌నాధ్‌ను స‌ల‌హాదారుగా నియ‌మించి ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ఆయ‌న తీవ్ర అసంతృప్తి,నిరుత్సాహం వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయ‌న వెంట‌ప‌డి మ‌రీ ఆయ‌న‌ను స‌ల‌హాదారుగా నియ‌మించింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ స‌ల‌హాదారుగా ఆయ‌న నియ‌మితుల‌వు తార‌ని తెలుసుకుని ముందుగానే ఆయ‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌ల‌హాదారుగా జీవో ఇచ్చింది. 

పిలిచి అవ‌మానిస్తారా..?

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న‌పై ఇంత శ్ర‌ద్ధ చూపిస్తుండ‌డంతో..రాష్ట్రానికి ఏదో చేయాల‌నే త‌లంపుతో...రాష్ట్రాన్ని అంత‌ర్జాతీయ స్పేష్ సెంట‌ర్‌గా త‌యారు చేయాల‌నే ల‌క్ష్యంతో సోమ‌నాధ్ రాష్ట్రానికి వ‌చ్చారు. అనంత‌పురం వంటి వెనుక‌బ‌డిన జిల్లాల్లో రాకెట్ త‌యారీ కేంద్రాన్ని ప్రారంభించి రాష్ట్రానికి వాణిజ్య‌ప‌రంగా లాభ‌దాయ‌కం చేయాల‌ని ఆయ‌న భావించారు. ఇక్క‌డ త‌యారైన రాకెట్లు అంత‌ర్జాతీయ మార్కెట్ సాధించి..రాష్ట్రానికి మేలు చేయాల‌ని ఆయ‌న ఆశించారు. స్పేస్ టెక్ హ‌బ్‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను స్పేస్ రీసెర్చ్ సెంట‌ర్‌గా ఆయ‌న తీర్చిదిద్దాల‌ని క‌ల‌లు క‌న్నారు. పాల‌న‌లోనూ టెక్నాల‌జీని ప్ర‌వేశ‌పెట్టాల‌ని, న‌గ‌ర ప్ర‌ణాళిక‌, శాటిలైట్ మ్యాపింగ్ వంటి వాటి ద్వారా ఆయ‌న సేవ‌లు అందించాల‌ని భావించారు.  అంత‌రిక్ష‌, సాంకేతిక రంగంలో అంత‌ర్జాతీయంగా, దేశీయంగా ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌హార‌శైలిని చూసి విసిగివేశారిపోతున్నారు. త‌న‌ను పిలిపించి అవ‌మానించార‌ని, చంద్ర‌బాబు, తాను క‌లిసి స్పేష్ టెక్నాల‌జీలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల‌ని భావిస్తే..చివ‌ర‌కు ఇలా జ‌రుగుతోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇస్రో ఛైర్మ‌న్‌గా ప‌నిచేసిన ఆయ‌న చంద్ర‌యాన్‌-3 విజ‌య‌వంతంలో  ప్ర‌ముఖ పాత్ర పోషించారు.  ప్ర‌ధాని మోడీతో సంభాషించే గ‌లిగే సామ‌ర్థ్యం ఉన్న సోమ‌నాధ్‌ను ఇలా అవ‌మానిస్తారా..? ఇదెక్క‌డి వైప‌రిత్యం...?  ఎందుకు ఈ విధ‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్య‌క్తిని ఇక్క‌డ అనామ‌కుడిలా తీసి పారేస్తారా..?  ఇప్పుడు ఆయ‌న రాజీనామా చేస్తా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట ఏమ‌వుతుంది?  నిత్యం మోడీ జ‌పం చేసే చంద్ర‌బాబు, లోకేష్‌లు ఈ విష‌యంలో మోడీకి ఏమి చెప్పుకుంటారు? 


అప్పుడు రామ‌చంద్ర‌మూర్తి-ఇప్పుడు సోమ‌నాధ్‌...!

గ‌త వైకాపా ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మితులైన ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు రామ‌చంద్ర‌మూర్తి త‌రువాత ఆ ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న‌కు ఎటువంటి ప‌ని ఇవ్వ‌లేద‌ని, ఇక స‌ల‌హాదారుగా ఉండి చేసేదేముంద‌ని ఆయ‌న త‌న రాజీనామా వ్య‌వ‌హారంపై స్పందించారు. దీంతో..అప్ప‌ట్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప‌రువు న‌డిబ‌జారులో పోయింది. అంతే కాకుండా ఈ స‌ల‌హాదార్ల వ్య‌వ‌హారం ఒక తంతుగా మారింద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో వ్య‌క్తం అయింది. ఇప్పుడు సోమ‌నాధ్ కూడా రామ‌చంద్ర‌మూర్తిలానే రాజీనామా చేస్తే..జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప‌రువు పోయిన‌ట్లే..చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ప‌రువు కూడా దేశీయంగా, అంత‌ర్జాతీయంగా పోతుంది. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిచి..స్పందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. 


(7)
(0)

Comments