ఒరిస్సా స‌క‌ల‌శాఖా మంత్రిపై సీఐడి విచార‌ణ‌-ఇక్క‌డి మాత్రం మౌన ముద్ర‌...!?

04, Jan 2026



ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న‌ప్పుడు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన వారి కంటే..వారి అనుంగు స‌హ‌చ‌రులే అధికారాన్ని ఇష్టారాజ్యంగా అనుభవిస్తారు. ముఖ్య‌మంత్రుల‌కు వీరు డిఫ్యాక్టో ముఖ్య‌మంత్రులుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌జలు ఎన్నుకున్న వారు కాకుండా వీరే అధికారం, పెత్త‌నం చెలాయిస్తారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇలానే జ‌రుగుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న‌ప్పుడు ఇటువంటి తీరు అల‌వికానీ రితీలో ఉంది. త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు శ‌శిక‌ళ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అధికారంలో ఉన్న‌ప్పుడు కెవిపి రామ‌చంద్ర‌రావు, ప‌శ్చిమ‌బెంగాల్‌లో మ‌మ‌తాబెన‌ర్జీకి ఆమె మేన‌ల్లుడు, వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సిఎంగా ఉన్న‌ప్పుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఒరిస్సాలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు వి.కె.పాండియ‌న్ డిఫ్యాక్టో సిఎంలుగా వ్య‌వ‌హ‌రించారు. ముఖ్య‌మంత్రి కంటే..వీరే అధిక అధికారాన్ని, పెత్త‌నాన్ని చెలాయించారు. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ముఖ్య‌మంత్రిని వీళ్లు కీలు బొమ్మ‌లుగా చేశార‌ని, అన్ని శాఖ‌ల‌పై పెత్త‌నం చేసి స‌క‌ల‌శాఖ‌ల మంత్రిగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు బ‌లంగా ఉన్నాయి. 

ఒరిస్సాలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు స‌హాయ‌కుడిగా ప‌నిచేసిన పాండియ‌న్ డిఫ్యాక్టో సిఎంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపించాయి. న‌వీన్‌ను కీలు బొమ్మ‌ను చేసి అధికారం మొత్తం ఆయ‌నే చెలాయించార‌ని, అవినీతికి పాల్ప‌డ్డార‌ని, ప్ర‌భుత్వ సొమ్మును దుర్వినియోగం చేశార‌ని, ప్ర‌భుత్వ హెలికాప్ట‌ర్‌ను విచ్చ‌ల‌విడిగా వాడుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అస‌లు న‌వీన్ ఓడిపోవ‌డానికి పాండియ‌నే కార‌ణ‌మ‌నే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఓడిపోయిన త‌రువాత ఇప్పుడు పాండియ‌న్‌పై బిజెపి ప్ర‌భుత్వం విచార‌ణ‌ను ప్రారంభించింది. ఆయ‌న అవినీతి, అధికార దుర్వినియోగంపై సీఐడి విచార‌ణ జ‌రిపిస్తోంది. 2000 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వి.కె. పాండియ‌న్ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి బిజా జ‌న‌తాద‌ళ్‌లో చేరారు. ఆ త‌రువాత ఆయ‌న ఒడిస్సా ముఖ్య‌మంత్రికి ప్ర‌వేట్ సెక్ర‌ట‌రీగా వ్య‌వ‌హ‌రించారు. అయితే..ఆయ‌న అధికార వ్య‌వ‌స్థ‌ను చెర‌ప‌ట్టార‌ని, అధికారం మొత్తం ఆయ‌నే చెలాయించార‌ని, ముఖ్య‌మంత్రి అనుమతి లేకుండా ఒడిస్సా అంతా హెలికాప్ట‌ర్‌లో ప్ర‌యాణించార‌ని దీని కోసం మొత్తం రూ.17.21కోట్లు ఖ‌ర్చు చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న‌పై సీఐడి విచార‌ణ జ‌రుగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన బిజెపి ప్ర‌భుత్వం పాండియ‌న్ అవినీతి, అధికార వ్య‌వ‌స్థ‌ను చెర‌ప‌ట్టిన వైనంపై క‌ఠినంగానే విచార‌ణ జ‌రుపుతోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంది. 

కాగా..ఒరిస్సాలో జ‌రిగిన‌ట్లే గ‌త వైకాపా పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. 2019-24 మ‌ధ్య వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న స్వంత ప‌త్రిక‌లో ప‌నిచేసిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. ఈయ‌న కూడా ఒరిస్సాలో పాండియ‌న్ వ‌లే స‌క‌ల‌శాఖ‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. ముఖ్య‌మంత్రితో సంబంధం లేకుండా విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు, ఉద్యోగుల‌తో స‌మావేశాలు..మంత్రుల‌పై పెత్త‌నం..ఇలా ఒక‌టా.....రెండా ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న‌దే పెత్త‌నం. జ‌గ‌న్ ఇంటికి ప‌రిమిత‌మైతే..సజ్జ‌లే ఆయ‌న త‌రుపున అన్ని వ్య‌వ‌హారాలు చ‌క్క‌పెట్టేవారు. అప్ప‌ట్లో ఆయ‌న‌ను స‌క‌ల‌శాఖ మంత్రిగా అటు ప్ర‌తిప‌క్షాలు, ఇటు స్వ‌ప‌క్షాలు పిలిచేవి. అప్ప‌ట్లో జ‌గ‌న్ అధికారం కోల్పోతే..ఆయ‌న‌పై విచార‌ణ చేయిస్తామ‌ని ఎన్‌డిఏ ప్ర‌క‌టించింది. అయితే..ఎన్‌డిఏ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై చిన్న కేసును కూడా న‌మోదు చేయ‌లేక‌పోయింది. అప్ప‌ట్లో ప్ర‌తిదానికి స‌జ్జ‌ల‌పై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసిన టిడిపి నాయ‌కులు ఇప్పుడు మౌనం వ‌హించ‌డంపై ప్ర‌జ‌ల్లో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. జ‌గ‌న్‌తో పాటు వైకాపా నాయ‌కులు అవినీతి, అరాచ‌కానికి స‌జ్జ‌ల డైరెక్ష‌నే కార‌ణ‌మ‌ని, ఆయ‌న‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ ఎందుకు విచారించ‌లేద‌నే దానిపై ప‌లు ర‌కాలైన చ‌ర్చ‌లు ప్ర‌జ‌ల్లో జ‌రుగుతున్నాయి. ఆయ‌న‌తో కూట‌మి నాయ‌కులు కుమ్మ‌క్కు అయ్యార‌ని అందుకే ఆయ‌న‌పై ఈగ కూడా వాల‌డం లేద‌ని స్వంత పార్టీ నాయ‌కులు కూడా అంత‌రంగిక చ‌ర్చ‌ల్లో వ్యాఖ్యానిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ఇదే విధంగా వ్య‌వ‌హ‌రించిన పాండియ‌న్‌పై సీఐడీ కేసు న‌మోదు అయింద‌ని, దానిని చూసి అయినా..స‌జ్జ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని టిడిపి కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. ఒక‌వేళ స‌జ్జ‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం ఎటువంటి చ‌ర్యులు తీసుకోక‌పోతే..అత‌ను ఎటువంటి అవినీతి, అక్ర‌మాల‌కు, అరాచ‌కాల‌కు పాల్ప‌డ‌లేద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో వ‌స్తుంది. ఇప్ప‌టికైనా స‌జ్జ‌ల అక్ర‌మాల‌ను, అన్యాయాలు, అరాచ‌కాల‌పై విచార‌ణ జ‌రిపించాలి.  


(1)
(0)

Comments