రాజధాని అమరావతిలో తప్పని భూసేకరణ
2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఇష్టారాజ్యంగా ముక్కలు ముక్కలు చేయడం ఆంధ్రా ప్రజలను నివ్వెర పరిచింది. ఇంత అన్యాయమా...? ఇంత దగానా..? అంటూ ఆక్రోశించారు. నాడు కాంగ్రెస్ చేసిన అన్యాయానికి, అక్రమానికి ఆ పార్టీని బంగాళాగాతంలో ముంచేసి తమ ఆగ్రహాన్ని చల్లార్చుకున్నారు. కాంగ్రెస్‌నైతే ఓడించారు కానీ..రాష్ట్ర అభివృద్దిలో కీలకమైన రాజధాని విషయంలో అక్కడా...ఇక్కడా అనే మీమాంసలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి తాము ఉచితంగా భూములు ఇస్తామని అమరావతి ప్రాంత రైతులు ముందుకు రావడం...కాంగ్రెస్ చేసిన గాయాన్ని మాన్పేలా... చేసింది. తమ రాష్ట్రం కోసం..తమ పిల్లల భవిష్యత్తు కోసం అమరావతి ప్రాంత రైతులు ఎంతో అపురూపంగా చూసుకునే భూములను రూపాయి సొమ్ములు అడగకుండా ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. దాదాపు 90శాతం మంది ప్రజలు తమ భూములను స్వచ్చంధంగా ఇచ్చేశారు. అయితే..తరువాత కాలంలో మరి కొంత మంది ముందుకు వచ్చి భూములను ఇచ్చారు. కానీ..కొందరు మాత్రం రాష్ట్ర అభివృద్ధిని, రాజధాని వృద్దిని అడ్డుకునేందుకు గత 12 ఏళ్లుగా తీవ్రంగా యత్నిస్తున్నారు. రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారి..రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. వైకాపా నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి..తమ అభివృద్ధికి తామే అడ్డంపడుతున్నారు.
విజయవాడ నుంచి రాజధాని అమరావతికి వెళ్లే సీడ్ యాక్సిస్ రోడ్డు దాదాపు పూర్తి అయినా కొందరు రైతులు ఇంకా భూములు ఇవ్వకపోవడంతో..ఆ రోడ్డు పూర్తి కాక ఆ ప్రాంతంలో వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. రాజధానికి నిత్యం వెళ్లేవారికి కరకట్టరోడ్డే మార్గం. అత్యంత ఇరుకైన, ప్రమాదకరమైన ఈ రోడ్డు వల్ల జరిగిన ప్రమాదాలతో చాలా మంది గాయాలపాలయ్యారు. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకునేందుకు ఎంతో నచ్చచెప్పినా..వారు వినకపోవడంతో ప్రభుత్వ తన చేతిలో ఉన్న ఆఖరి అస్త్రాన్ని వదిలేసింది. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వని వారి భూములను ఇక ల్యాండ్ సేకరణతో తీసుకోబోతోంది. రేపే దీనిపై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసింది. దాదాపు 12 ఏళ్ల నుంచి..ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఒప్పించాలని చూసినా..వాళ్లు ఒప్పుకోకపోవడంతో..ఇక చేసేదేమీ లేక..బలవంతంపు భూసేకరణకు ప్రభుత్వం దిగుతోంది.
గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్‌డిఏ ప్రభుత్వం సీడ్ యాక్సిస్ రోడ్డుకు అవసరమైన భూమి కోసం అప్పుడే భూసేకరణకు వెళుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ప్రభుత్వం మరింతగా వేచి చూసే ధోరణిని అవలంభించింది. దాదాపు ఏడాదిన్నర ఎదురుచూసినా..ఈ రోడ్డు పూర్తి కాకపోవడంతో ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. రాజధానికి రోడ్డు నిర్మించలేని వారు...అద్భుతనగరం ఎలా కడతారనే ప్రశ్నలు పలువురి నుంచి వస్తున్నాయి. అంతే కాకుండా ఎవరైనా విదేశీయులు, దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు..రాజధానికి వచ్చే సమయంలో కరకట్ట రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో..రాజధాని అమరావతిపై చిన్నచూపు వారికి ఏర్పడుతోంది. ఇదంతా..కొద్ది మంది వల్లే జరుగుతున్నా..ప్రభుత్వం విపరీతమైన సమన్వయ్యాన్ని ప్రదర్శించింది. అయితే..ఇప్పటికీ కొందరు అదే మంకుపట్టుతో ఉండడంతో..ల్యాండ్ సేకరణకు దిగుతోంది. కాగా రాజధాని విస్తరణ కోసం అవసరమై భూముల కోసం ప్రభుత్వం రేపటి నుంచే 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్‌కు వెళుతోంది. 7 గ్రామాల్లోని రైతులు స్వచ్ఛంధంగా తమ భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. మొత్తం మీద దాదాపు ఏడాదిన్నర తరువాత రాజధాని పనులు శరవేగంగా జరుగుతూ ఉండడంతో రాజధాని ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.