విజయసాయిరెడ్డి సంకేతాలు ఎందుకో...!?
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సుధీర్ఘ విచారణ తరువాత విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన మాజీ బాస్ వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని వెనుకోసుకొచ్చారు. మద్యం కుంభకోణం జగన్‌కు తెలిసి జరగలేదని, ఆయనకు తెలిస్తే..ఆయన మద్యం కుంభకోణాన్ని జరగనివ్వడని చెప్పారు. తన మనస్సులో జగన్ ఉన్నాడని, కానీ ఆయన మనస్సులో తాను లేనని, కోటరీ వల్లే తాను బయటకు వచ్చానని అన్నారు. కోటరి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం జరిగిందని, మద్యం విషయంలో తనకూ, జగన్‌కు అసలు ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. జగన్ కోటరీ నమ్ముకుంటే మరోసారి అధికారంలోకి రావడం కల్ల అని, జగన్ ఘోర ఓటమికి కోటరీయే కారణమని ఆయన కోటరీపై విమర్శలు గుప్పించారు. కోటరీ ఆటలు ఇలాగే సాగితే జగన్ పాదయాత్ర చేసినా..ఏమి చేసినా..అధికారంలోకి రాలేడని ఆయన అన్నారు. కూటమిని విడగొడితేనే జగన్ మళ్లీ సిఎం అవుతాడని, అలా చేసేవాళ్లు కోటరీలో లేరని, వారికి రాజకీయ వ్యూహం లేదని చెప్పొకొచ్చారు. జగన్ మంచివాడేనని, కానీ ఆయన వద్ద ఉన్న కూటమి వల్లే..ఆ పార్టీ ఇలా తయారైందని విమర్శలు చేశారు. మద్యం కుంభకోణంలో జగన్ పాత్ర లేదని, తన పాత్ర లేదని, మిధున్‌రెడ్డి పాత్రలేదని, అంతా రాజ్‌కసిరెడ్డే చేశాడని ఆయన చెప్పడం ద్వారా..వైకాపాకు ఆయన కొన్ని సంకేతాలు పంపినట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈడీ విచారణలో తాను జగన్‌కు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదని, అదే సమయంలో మిధున్‌రెడ్డికి వ్యతిరేకంగా కానీ లేదా పార్టీకి ఇబ్బంది కల్గించే విధంగాకానీ తాను వ్యవహరించలేదని ఆయన జగన్‌కు సంకేతాలు పంపారనే భావన వ్యక్తం అవుతోంది. జగన్‌తో విభేదించిన తరువాత ఆయనతో ఇంత సఖ్యతగా విజయసాయిరెడ్డి మాట్లాడడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు తాను నోరువిప్పితే..అందరి చిట్టాలు బయటకు వస్తాయని హెచ్చరించిన విజయసాయిరెడ్డి జగన్‌తో మళ్లీ కలిసిపోవడానికి లేదా ఆయనకు వ్యతిరేకంగా తాను లేనని చెప్పడానికి ఈ విలేకరుల సమావేశాన్ని వాడుకున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఘాటైన విమర్శలు చేస్తూ..తాను చంద్రబాబుకు శత్రువుననే భావనను ఆయన కల్గించారు. చంద్రబాబు వల్ల తాను ఇబ్బందులు పడుతున్నానని చెప్పడం ద్వారా తాను ఆయనతో రాజీపడలేదని, తాను ఇప్పటికీ జగన్ మనిషినేనని చెప్పుకునేందుకు తంటాలు పడ్డారు. మొత్తం మీద ఈడీ విచారణ తరువాత విజయసాయిరెడ్డి మళ్లీ జగన్‌తో కలిసిపనిచేసేందుకో..లేక ఈడీ కేసులను అందరం కలిసి ఎదుర్కొవాలనే సంకేతాలను జగన్‌కు పంపించినట్లైంది.