రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా లోకేష్ జన్మదినవేడుకలు
రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఈ వేడుకల్లో భారీగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. పేదలకు, రోగులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. టిడిపి కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ యువనేత జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా, అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతోన్న లోకేష్ రెండో జన్మదినోత్సవం ఇది. గత ఏడాది ఇంత హడావుడి కనిపించలేదు కానీ..ఈసారి మాత్రం పార్టీ, ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవ సందర్భంగా కేక్‌లు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడిగానే కాకుండా లోకేష్ వ్యక్తిగతంగా పార్టీ నాయకులతో మమేకం కావడం, ఎక్కడైనా సమస్య ఉంటే..తక్షణమే స్పందించడం, పార్టీ కార్యకర్తలు,నాయకులకు ఆపద వస్తే లోకేష్‌కు చెప్పుకుంటే క్షణాల్లో తీరిపోతుందనే భరోసా రావడంతోనే పార్టీ కార్యకర్తలు,నాయకులు ఆయన జన్మదినాన్ని తమ స్వంత జన్మదినంగా భావించారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా పేరుగాంచిన లోకేష్ నేడో రేపో ముఖ్యమంత్రి అవుతారనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆయన దృష్టిలో పడడానికి చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడీ మరీ ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపారు. చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా..అన్ని చోట్లా ఆయన జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. తన జన్మదినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన పార్టీ కార్యకర్తలకు,నాయకులకు లోకేష్ కృతజ్ఙతలు తెలియచేశారు.