మంత్రి నారాయ‌ణ‌ను ప‌క్క‌న పెట్ట‌నున్న సిఎం

27, Jan 2026

అమ‌రావ‌తి రైతుల స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు ప‌ర్య‌వేక్ష‌ణ‌

సిఆర్డిఏ అధికారుల వ్య‌వ‌హారంపైనా నిఘా

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాజ‌ధాని అమ‌రావ‌తి శ‌ర‌వేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుంటుంద‌ని, రాజ‌ధాని రైతులు తాము చేసిన త్యాగాల‌కు గుర్తింపు ల‌భిస్తుంద‌ని ఆశిస్తే..వివిధ కార‌ణాల వ‌ల్ల వారి ఆశ‌లు నెర‌వేర‌లేదు. ఐదేళ్ల జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అరాచ‌కం త‌రువాత చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రి అయితే త‌మ స‌మ‌స్య‌లు చిటికెలో ప‌రిష్కారం అవుతాయ‌ని భావించిన రైతుల‌కు గ‌త ఏడాదిన్న‌ర జ‌రుగుతున్న ప‌రిణామాలు రుచించ‌డం లేదు. త‌మ‌కు కేటాయించాల్సిన ప్లాట్స్ కేటాయించ‌క‌పోవ‌డం, కేటాయించినా..స‌మ‌స్య‌లు ఉన్న చోట ఇవ్వడం కొంద‌రికి అస‌లు ఇవ్వ‌క‌పోవ‌డం, రాజ‌ధాని నిర్మాణ‌ప‌నులు వేగ‌వంతం కాక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో రాజ‌ధాని రైతుల్లో కొంత అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఘోరంగా ఓడిపోయిన త‌రువాత రాజ‌ధాని ప్రాంతం శ‌ర‌వేగంగా నిర్మాణం సాగుతుంద‌ని వారు ఆశించిన మాట నిజం. అయితే..వారు అనుకున్న స్థాయిలో ప‌నులు జ‌ర‌గ‌క‌పోవ‌డం, మంత్రి నారాయ‌ణ త‌గురీతిలో స్పందించ‌క‌పోవ‌డం, సిఆర్‌డిఏ అధికారుల నిరంకుశ వైఖ‌రి, అవినీతి వంటి కార‌ణాల‌తో రైతులు ప్ర‌భుత్వంపై నిర్వేదంగా స్పందిస్తున్నారు. తాము చేసిన త్యాగాల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌నే బాధ వారిలో క‌నిపిస్తోంది. దీన్ని ఆస‌రాగా తీసుకుని వైకాపా నాయ‌కులు దుష్ప్ర‌చారం ప్రారంభించారు. రాజ‌ధాని అమ‌రావ‌తిని చంపేందుకు అనేక కుఠిల ఎత్తులకు పాల్ప‌డిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కూడా ఇప్పుడు రాజ‌ధాని రైతుల గురించి మాట్లాడుతున్నారంటే కూట‌మి ప్ర‌భుత్వం ఎక్క‌డ విఫ‌లం అయిందో అర్థం కావ‌డం లేదు. రాజ‌ధాని భూస‌మీక‌ర‌ణ వ్య‌వ‌హారం ఇప్పుడో అంతుచిక్క‌ని వ్య‌వ‌హారంలా ఉంది. కొంత మంది రైతులు ఎందుకు భూ స‌మీక‌ర‌ణ‌కు అడ్డుప‌డుతున్నారో..?  వారిని ప్రేరేపిస్తోన్న శ‌క్తులు ఏమిటో..ఎవ‌రికీ తెలియ‌దు.


రాజ‌ధాని ప్రాంతంలో అసంతృప్తి ర‌గ‌ల‌డానికి ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న వారి వ్య‌వ‌హార‌శైలే కార‌ణ‌మ‌నే భావ‌న ఉంది. సిఆర్‌డిఏలో కీల‌కంగా ప‌నిచేసే అధికారులు, సిఆర్‌డిఏను స్వంత సంస్థ‌లా భావిస్తోన్న వ్య‌క్తే దీనికి కార‌ణ‌మ‌ని, వీళ్లంద‌రూ ఇక్క‌డ ఉన్న‌న్నాళ్లూ రాజ‌ధాని ప్రాంతంలో అసంతృప్తి త‌గ్గ‌ద‌నే భావ‌న ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో వ్యక్తం అవుతోంది. అయితే..ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ఉండే ఇబ్బందుల‌తో వారిని ఇప్ప‌టికిప్పుడు త‌ప్పించే ప‌రిస్థితి లేదు. దాంతో..తానే స్వ‌యంగా రంగంలోకి దిగాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక మీద‌ట రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త అంతా చంద్ర‌బాబే స్వ‌యంగా చూసుకోవాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న నేరుగా రంగంలోకి దిగితే పెట్టుబ‌డులు పెట్టేవారు ముందుకు వ‌స్తార‌ని, ఆయ‌న బ్రాండ్‌తో రాజ‌ధాని శ‌ర‌వేగంగా పూర్తి అవుతుంద‌నే భావ‌న ఉంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు క‌నుక రాజ‌ధాని నిర్మాణాన్ని నేరుగా ప‌ర్య‌వేక్షిస్తే..రాజ‌ధాని రైతులు సంతోషంతో భూములు ఇస్తార‌ని, ఇవ్వ‌ని వారు కూడా ముందుకు వ‌స్తార‌ని, ఇప్పుడు చేస్తోన్న భూ స‌మీక‌ర‌ణ కూడా త్వ‌ర‌గా పూర్తి అవుతుంద‌ని కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. గ‌తంలో భూస‌మీక‌ర‌ణ‌కు దూరంగా ఉన్న‌వాళ్లు కూడా చంద్ర‌బాబు ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తే..వాళ్లు కూడా త‌మ భూములు ఇస్తార‌ని, దానితో స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కారం అవుతాయ‌ని చెబుతున్నారు. మొత్తం మీద‌..చంద్ర‌బాబు రంగంలోకి దిగితేకానీ రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌, రాజ‌ధాని నిర్మాణం శ‌రవేగంగా పూర్తికాద‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. అయితే..ఆయ‌న ఎప్పుడు రంగంలోకి వ‌స్తారో..చూడాలి మ‌రి?


(1)
(0)

Comments