పుస్తక యుద్ధం...!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థలో చెప్పుకోదగ్గ మార్పులు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి, మౌళిక వసతుల కల్పన, నాణ్యమైన విద్య, సాంకేతిక విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. విద్యార్థులకు అసవరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఉచిత పుస్తకాలు, యూనిఫార్ములు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, బాలికలు,SC/ST, మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక మద్దతు, పాఠశాల భవనాల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీరు, ICT @ Schools, ఈ–లెర్నింగ్ వంటి వాటితో పాటు చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలను ఇచ్చి విద్యను ప్రోత్సహిస్తున్నారు. గత ప్రభుత్వం కుటుంబానికి ఒకరికి మాత్రమే ఇస్తే..ఈ ప్రభుత్వం కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి రూ.15వేలను ఇస్తూ వారి విద్యను ప్రోత్సహిస్తోంది. దానితో పాటు గ్రంథాలయాలను అభివృద్ధి చేసి, నూతన పుస్తకాలను వాటిలో అందుబాటులో ఉంచుతోంది.
గత ప్రభుత్వంపై దీనిపై దృష్టిపెట్టకపోవడంతో..ఈ ప్రభుత్వం ఈ ఏడాది దాదాపు రూ18 కోట్లతో గ్రంథాలయాల కోసం నూతన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు టెండర్లును ఆహ్వానించింది. అయితే..ఈ టెండర్లలో ఎంపిక చేసిన పుస్తకాల కొనుగోలుపై కొందరు పబ్లిషర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పేరెన్నికగన్న పబ్లిషర్స్ నుంచి పుస్తకాలు కొనుగోలు చేయలేదని, ఇద్దరు ముగ్గురు పబ్లిషర్స్‌కే ఎక్కువ అవకాశాలు ఇచ్చారని కొంత మంది పబ్లిషర్స్ ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ముఖ్యంగా విజయవాడకు చెందిన ఓ పబ్లిషర్ కు దాదాపు రూ.5కోట్ల విలువైన టెండర్ కేటాయించబోతున్నారని, ఇలా ఒకరికే అన్ని పుస్తకాల ఇంటెండ్ ఇస్తే ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని పబ్లిషర్స్ గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పుస్తకాలను ముద్రించిన పెద్దగా అమ్ముడు పోకపోవడంతో..వారు దివాలా అంచుకు చేరుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని, పబ్లిషర్స్‌ను ప్రభుత్వం ప్రోత్సహించా లని వారు కోరుతున్నారు. అందరీ ఒకే రీతిన చూడాలని వారు అంటున్నారు. ఒకరిద్దరికే...కోట్లలో కేటాయించి, మిగిలిన వారికి నామాత్రంగా టెండర్ ఖరారు చేస్తున్నారని ఇది తగని చెబుతున్నారు. విశాలాంధ్ర, నవతెలంగాణ, ప్రజాశక్తి, ఎమ్మెస్కో,పల్లవి, వంటి ప్రముఖ పబ్లిషర్ల పుస్తకాలను పెద్దగా కొనుగోలు చేయలేదని, దానితో పాటు, చిన్నా చితకా పబ్లిషర్స్‌ను అసలు పట్టించుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి విన్నవిస్తామని చెబుతున్నారు. మరోవైపు కొందరు పబ్లిషర్స్ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు కోర్టుకు వెళతామని చెబుతున్నారు.
కాగా..ఈ పుస్తకాల కొనుగోలు పక్రియను ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. జాతీయస్థాయిలో టెండర్లను ఆహ్వానించింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ సిఫార్సు చేసిన పబ్లిషర్స్ నుంచి పుస్తకాలను కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతోంది. వాస్తవానిని సమగ్ర శిక్ష అభియాన్ పిడి శ్రీనివాసరావుకు నిజాయితీపరుడు, మంచివ్యక్తి అనే పేరుంది. ఆయన ఆధ్వర్యంలో ఎటువంటి తప్పులు లేకుండానే పుస్తకాల కొనుగులుకు ప్రభుత్వం వెళుతోంది. అయితే..ఒకరిద్దరికి ఎక్కువ సంఖ్యలో ఇవ్వడం వెనుక కమిటీ సభ్యులు ఉన్నారని, వారు పక్షపాతంలో ఒకే వ్యక్తికి చెందిన సంస్థ నుంచి భారీగా పుస్తకాలు కొనుగోలు చేసేందుకు సిఫార్సులు చేశారని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందరి వద్దా మంచి పుస్తకాలే ఉన్నాయని, కానీ కమిటీ మాత్రం ఒకరిద్దరికి పెద్దపీట వేసిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈరోజు పబ్లిషర్ సమావేశం ఏర్పాటు చేసుకుని, ఆందోళన చేయాలా? లేక ప్రభుత్వాన్ని కలిసి వాస్తవాలు వివరించాలా..? అనేదానిపై చర్చించబోతున్నారు.
ఇది ఇలా ఉంటే నిన్న ప్రముఖ పబ్లిషర్ అయిన ఎమ్మెస్కో విజయ్‌కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు దాదాపు రూ.1.40కోట్ల విలువైన పుస్తకాలను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఇదే సందర్భంలో ఆయన పబ్లిషర్ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. కాగా ఈ మొత్తం వ్యవహారం ఎటుతిరిగి ఎటువస్తోందో అన్న ఆందోళన సమగ్రశిక్ష అభియాన్ అధికారుల్లో ఉంది. అయితే..ఇదే ఫైనల్ కాదని, మరికొన్ని పుస్తకాలను దీని తరువాత కొనుగోలు చేస్తామని వారు చెబుతున్నారు. అయితే..ఇప్పుడు కాకుండా ఎప్పుడో కొంటామంటే..ఎలా అని పబ్లిషర్స్ ప్రశ్నిస్తున్నారు. తాము ఆర్థికంగా చితికిపోయామని, ఇప్పుడే అందరి వద్దా కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ పుస్తకాల కొనుగోలు వ్యవహారం పబ్లిషర్స్‌లో ఆందోళనకు కారణమవుతోంది. ప్రభుత్వ పెద్దలు దీనిపై దృష్టిపెట్టి తమను ఆదుకోవాలని పేద పబ్లిషర్స్ కోరుతున్నారు.