జిల్లా కలెక్టర్లుగా అభిషేక్, వర్మలు...!?
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు నూతన కలెక్టర్లుగా యువ ఐఏఎస్ అధికారులను నియమించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మార్కాపురం, పోలవరం (రంపచోడవరం కేంద్రంగా) జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ జిల్లాలకు కలెక్టర్లను నియమించలేదు. వారి స్థానంలో జాయింట్ కలెక్టర్లతో ప్రస్తుతానికి పాలన చేస్తోంది. కాగా త్వరలోనే ఈ జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటివారంలో కానీ..లేకపోతే ఆ తరువాత కానీ...ఈ జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తారంటున్నారు. దీనితో పాటు ఒకటి రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తారంటున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లా కలెక్టర్‌తో పాటు, కాకినాడ జిల్లా కలెక్టరునూ బదిలీ చేస్తారనే ప్రచారం సచివాలయం లో జోరుగా సాగుతోంది. కాగా మార్కాపురం, పోలవరం కలెక్టర్లుగా APIIC, Managing Directorగా ఉన్న Abhishikth Kishoreను,APEBD ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న సాయికాంత్ వర్మను నియమిస్తారంటున్నారు. వాస్తవానికి గతంలో జిల్లా కలెక్టర్లును భారీ స్థాయిలో బదిలీ చేసి, నూతనంగా కొందరిని జిల్లాల కలెక్టర్లుగా నియమించినప్పుడే వీరిద్దరికీ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన దావోస్ సదస్సులో వీరి సేవలు అవసరమని భావించి అది పూర్తి అయిన తరువాత వీరిని కలెక్టర్లుగా నియమిస్తామని హామీ ఇచ్చిందనే ప్రచారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దావోస్ పెట్టుబడుల సదస్సును విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో వీరికి ఇప్పుడు గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తారంటున్నారు. 2015 బ్యాచ్‌కుచెందిన సాయికాంత్ వర్మ తన తోటి వారందరికీ కలెక్టర్ పోస్టులు వచ్చాయని కానీ తనకు రాలేదనే భావంతో ఉన్నారట. జిల్లా కలెక్టర్‌గా పనిచేయడం గౌరవంతో కూడిన వ్యవహారమని ప్రతి ఐఏఎస్ జిల్లా కలెక్టర్ కావాలని ఆశిస్తారు. ఎంత ప్రతిష్టాత్మకమైన పోస్టులో పనిచేసినా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తే వచ్చే మజానే వేరు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఇద్దరు యువ ఐఏఎస్‌లు తమ కోరిక ఇప్పుడు తీరుతుందని ఆశిస్తున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.