ప్రభుత్వానికి అసలు సవాల్ ఇదే !

31, Jan 2026

గత కొన్ని సంవత్సరాలుగా మసకబారిన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఇప్పుడిప్పుడే కాంతులీనుతున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రమంత్రి నారా లోకేష్ లు ఏడాదిన్నర కాలంగా విరామమెరుగక చేసిన కృషి ఫలించింది. దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ వాటా 25.3 శాతంగా వున్నది. దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న 10 రాష్ట్రాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని 25.3 శాతం వాటా సాధించటం అంటే ఆషామాషీ కాదు. అందుకు చంద్రబాబు, లోకేష్ లను అభినందించాల్సిందే. 

తెలుగులో ఒక సామెత ఉంది. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లగలం. కానీ బలవంతంగా నీరు తాగించలేం కదా.  అదే తరహాలో పెట్టుబడులు, పారిశ్రామిక వేత్తలతో ఒప్పందాలు (ఎం వో యు) చేయించటం వరకు చంద్రబాబు, లోకేష్ లు సఫలీకృతులు అయ్యారు. అవన్నీ కార్యరూపం దాల్చాలంటే ముందుగా ఆయా సంస్థలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ లు జరగాలి. భూ కేటాయింపులు జరగాలి. ఇతరత్రా పాలనా పరమైన అనుమతులు లభించాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ' ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ) దే.

ఆ పెట్టుబడులను సాకారం చేయటం (పాలనా భాషలో కన్వర్షన్ చేయటం) ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అసలైన సవాల్. మనం ఏదైనా కార్యక్రమానికి వెళ్లినప్పుడు అక్కడ ముందుగా ' రిసీవ్ ' చేసుకునే వారి తీరు మనపై ప్రభావం చూపుతుంది. అంటే ఎంట్రీ లెవెల్ లో రిసెప్షన్ బాగుండాలి అన్నమాట. అప్పుడే అక్కడకు వెళ్ళిన పని సాకారం అవుతుంది. అదేవిధంగా పెట్టుబడి దారులు, పారిశ్రామిక వేత్తలకు   ఆంధ్రప్రదేశ్ లో '  ఈడీబీ 'అనేది ఎంట్రీ పాయింట్ వంటిది. అందుకే ఈడిబి లో సమర్థులైన, పారిశ్రామిక రంగంలో సుదీర్ఘ అనుభవమున్న వారిని నియమించటం ఆనవాయితీగా వస్తున్నది. 

2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈడీబీ ప్రాముఖ్యతను గుర్తించి సమర్థులైన యువ అధికారులను నియమించింది. అయితే ఏడాదిన్నర కాలంలోనే ఆ అధికారుల బదిలీ జరుగనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. బదిలీ అయిన వారి స్థానంలో  'యువ ' అనే కేటగిరీ లో మరో జూనియర్ అధికారిని నియమిస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదమున్నది. ఆ అధికారి ఎంతటి సమర్థత కలిగి ఉన్నప్పటికీ పెట్టుబడులు 'కన్వర్షన్' పై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది ఏమాత్రం వాంఛనీయం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈడీబీ లో పారిశ్రామిక రంగంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారుల సాధకబాధకాలు తెలిసిన వారికి బాధ్యతలు అప్పగిస్తే   మంచి ఫలితం కనిపిస్తుంది. అప్పుడే పెట్టుబడులు సాకారం అయి, రాష్ట్ర ఆదాయం పెరగటం తో పాటు నారా లోకేష్ చెబుతున్న విధంగా 20 లక్షల మందికి ఉత్పాదక రంగంలోనే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. లేనిపక్షంలో చంద్రబాబు, నారా లోకేష్ ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరయ్యే ప్రమాదమున్నది.


(0)
(0)

Comments