అమ్మో .. ఆ ఓఎస్డీ నా..!?

31, Jan 2026

కీలక మంత్రి పేషీలో చక్రం తిప్పుతున్న ఓఎస్డీ 

అన్ని రంగాలలో ఆధిపత్యం వైపుకు దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ కు గుండెకాయవంటి సచివాలయం అది. ప్రపంచంలోనే దార్శనికునిగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయనకు చేదోడు వాదోడుగా అనుక్షణం రాష్ట్ర భవిష్యత్ కోసం పరితపిస్తున్న మంత్రి నారా లోకేష్ తో పాటు రాష్ట్ర భవిష్యత్ నిర్దేశనలో భాగస్వాములయ్యే అమాత్యులందరూ కొలువు దీరేది అక్కడే. ఆ అమాత్యుల లో ఒకానొక యువ మంత్రివర్యులకు ఒక ప్రత్యేకత ఉన్నది. మొదటిసారే అమాత్య పదవి చేపట్టినప్పటికీ ఆ యువ మంత్రికి ఎంతో కీలకమైన శాఖను అప్పగించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించటంతో పాటు లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలంటే ఆ శాఖ నిర్ణయాలే కీలకం. 

అందరిలాగానే ఆ శాఖ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ' యువ ' అమాత్యులు కూడా ఒక ఓఎస్డీని నియమించుకున్నారు. ఆ ఓఎస్డీ సదరు అమాత్యునికి  అనుంగు స్నేహితుడు. ఆ అమాత్యుని సామాజిక వర్గానికే చెందటం ఆ ఓఎస్డీ కి వున్న అదనపు అర్హత. ఇంతవరకు బాగానే ఉన్నది. ఓఎస్డీ గా ఎవరినైనా నియమించుకునే హక్కు ఆ  అమాత్యుని కి వున్నది. దానిలో తప్పుబట్టాల్సింది ఏమీ లేదు. అయితే ఆ ఓఎస్డీ తన పరిధులకు మించి వ్యవహరిస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెడుతున్నది. సీనియర్ ఐఎఎస్ అధికారులు సైతం ఆ ఓఎస్డీ వ్యవహారశైలి పట్ల నొచ్చుకుంటునట్టు సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆ శాఖతో సంబంధం ఉన్న సీనియర్ ఐఎఎస్ అధికారి ఒకరు సదరు ఓఎస్డీ కి సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయినా ఆ ఓఎస్డీ వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు వచ్చిన సూచనలు కానరావడం లేదు. 

సహజంగా ఆన్లైన్ లో వచ్చే ఈ ఫైళ్ళ ను కింది స్థాయి నుంచి మంత్రి వరకు వాటితో సంబంధం ఉన్న వారు ఎవరైనా చూడవచ్చు. దానిలో ఏవైనా మార్పులు, చేర్పులు అవసరమైతే అందుకు సంబంధించి సలహాలు, సూచనలు సదరు అమాత్యుని కి ఇచ్చే  వెసులుబాటు మాత్రమే ఓఎస్డీ కి వుంటుంది. అంతేగానీ ఆ ఫైల్ ను వెనక్కు తిప్పి పంపించే అధికారం ఓఎస్డీ కి ఎంతమాత్రం ఉండదు. దీన్ని గుర్తెరగకుండా సదరు ఓఎస్డీ పలువురు పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన ఫైళ్ళ ను అర్థం పర్ధం లేని కొర్రీలు వేస్తూ వెనక్కు తిప్పి పంపుతున్నట్టు సచివాలయం లో ప్రచారం జరుగుతున్నది. తనను సంతృప్తి పరచటం అనేది ఒక్కటే ఆ ఓఎస్డీ ప్రాతిపదికగా తీసుకొని ఫైళ్ళను అమాత్యుని ఆమోదానికి పంపుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీనివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు ఇరువురూ అపనిందలు మోయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయింది. నజరానాలు సమర్పించుకుని ఫైళ్ళు ఆమోదం పొందిన వారు, సమర్పించుకోలేక తిరస్కరణకు గురైన వారు ఇరువురూ ప్రభుత్వం పైనే అసంతృప్తిని వెళ్లగక్కుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అంటే తనకు స్నేహితుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన అమాత్య వర్యులు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగ పరుచుకుంటూ సర్వం తానే అని వ్యవహరిస్తున్న ఆ ఓఎస్డీ తలబిరుసు తనానికి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తున్నదన్న మాట. ముతక భాషలో చెప్పాలంటే డబ్బు ఒకరికయితే, గబ్బు ఇంకొకరికి అన్నమాట. కుల మతాలు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అమాత్యులు, ఏదో ఒక సాకుతో అర్హత లేని వ్యక్తికి అపరిమిత అధికారాలు కట్టబెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్ ను ఆ వ్యక్తికి ఫణంగా పెట్టడమే!


(2)
(3)

Comments


  • 2026-01-31 07:54:26
  • Chinta sobhanbabu

SUPER sir CBN sir

(0)
(0)
  • 2026-01-31 07:53:58

Super CBN sir

(0)
(0)