మంత్రి పార్థసారధి రాజీనామా చేస్తారా..!?
గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి కూటమి ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమల లడ్డూ విషయం గురించి మాట్లాడుతూ జగన్ హయాంలో తయారైన లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేశారని ఆరోపించారు. దీంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. దేవదేవుడి ప్రసాదాన్ని కూడా జగన్ అండ్ కో కల్తీ చేశారా..? అంటూ దేశంలోని తిరుమల భక్తులు ఆగ్రావేశాలు వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం దీనిపై సిట్‌ను ఏర్పాటు చేయగా, ఆ సిట్‌పై తమకు నమ్మకం లేదని జగన్ అండ్ కో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీం దీనిపై తన ఆధ్వర్యంలో ఒక సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడా సిట్ తన రిపోర్టును కోర్టుకు సమర్పించింది. తిరుమల లడ్డూను ఒక్కచుక్క కూడా పాలు లేకుండా తయారు చేశారని, ఇది భారీస్థాయి కల్తీ వ్యవహారమని తేల్చింది. అయితే అదే సమయంలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని భావించడం లేదని చెప్పింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ రగడ రేగుతోంది. లడ్డూలో జంతువుల కొవ్వు అవశేషాలు లేవని సిట్ తేల్చిందని, దీంతో తాము నిర్దోషులమని చంద్రబాబే కావాలని తమపై నిందలు వేసి పాపం మూటకట్టుకున్నాడని వైకాపా వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీనిపై వారు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబే దోషన్నట్లు ప్రచారం చేస్తున్నారు. అసలు కల్తీ జరిగిందా...లేదా అన్నదాన్ని పక్కన పెట్టి...జంతువుల కొవ్వు లేదని చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు. వైకాపాకు ఉన్న సోషల్ మీడియా బలంతో..ఆ పార్టీ చెప్పేది ప్రజల్లోకి వెళుతోంది. అయితే..ఇక్కడే కీలకమైన ప్రశ్నను వారు దాటవేస్తున్నారు. జగన్ హయాంలో కల్తీ జరిగిందా..? లేదా అనేది చెప్పకుండా..తాము పట్టుకున్న జంతువుల కొవ్వు లేదంటూ..దబాయిస్తున్నారు. వారు చేస్తోన్న దాడితో కూటమి ప్రభుత్వం కూడా వెనకంజ వేసినట్లు కనిపిస్తోంది. జగన్ చేస్తోన్న ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడమే దీనికి కారణం.
ఇది ఇలా ఉంటే..ఇప్పుడు దేవదేవుడి ప్రసాదం కల్తీ వ్యవహారంలో ఒక్కొక్కరిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముందుగా అప్పట్లో టిటిడి ఇఓగా ఉన్న అనిల్‌కుమార్ సింఘాలపై బదిలీ వేటు వేసింది. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన మరి కొందరిపై కూడా వేటు వేయడానికి సిద్ధపడుతోంది. ముఖ్యంగా వైకాపా రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి. అప్పట్లో టిటిడి ఛైర్మన్‌గా ఉన్న కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అప్పుడు టిటిడి ఈఓగా ఉన్న ధర్మారెడ్డిలపై ఏ క్షణంలోనైనా చర్యలు ఉండవచ్చు. అయితే..ఇప్పుడు ఈ కల్తీ వ్యవహారంలో టిడిపికి చెందిన ఇద్దరు నేతల వ్యవహారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో వైకాపాలో ఉన్న ప్రస్తుత సమాచారశాఖ మంత్రి కొలుసుపార్థసారధి, కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్‌రెడ్డిలు అప్పట్లో టిటిడిలో పర్చేజ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యి, ఇతర దినిసులు కొనుగోలు చేస్తారు. ఇప్పుడు ఈ కమిటీలో పనిచేసిన వారందరిపై కూడా చర్యలు ఉంటాయని నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన అన్నట్లు చర్యలు తీసుకుంటే ముందుగా రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధిపై చర్యులు ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆయన ముందుగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. నిన్న జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తనకు తెలియకుండానే అప్పట్లో భూమన కరుణాకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు నిర్ణయం తీసుకున్నారని, తనకు దీనితో సంబంధం లేదన్నట్లు మాట్లాడారు. అయితే..కొనుగోలు కమిటీ సభ్యుల సంతకాలు లేకుండా ఉంటాయా..? అప్పట్లో మినిట్స్‌లో ఏమి రాశారు..? ఒక వేళ అప్పట్లో పార్థసారధి వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే..అవి రికార్డు అయి ఉంటాయి. అలా ఉంటే..ఆయన తప్పు లేనట్లే..అయితే..అలాజరగలేదని, అప్పట్లో జగన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే ధైర్యం ఆయనకు లేదని, దాంతో..వాళ్లు నిర్ణయం తీసుకున్నా..ఈయన మమ అని ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఈ కేసులో ఆయన కూడా నిందితుడు అవుతాడనే వాదన వినిపిస్తోంది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో సీరియస్‌గా వ్యవహరిస్తే..ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయకతప్పదు. మరోవైపు నెల్లూరు జిల్లాలో కీలకమైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్య ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ఏమి చర్యలు ఉంటాయో..అనే సందేహాలు ఉన్నాయి. నెల్లూరు టిడిపికి పునర్వైభం తెచ్చిన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్యపై చర్యలు తీసుకుంటే..ఆ జిల్లాలో టిడిపి వ్యవహారాలు మరింత వేడెక్కుతాయి. వేమిరెడ్డి టిడిపిలో చేరతానంటే చంద్రబాబే స్వయంగా నెల్లూరు వెళ్లి ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు అంత విలువ ఇచ్చే చంద్రబాబు ఇప్పుడు ఆయన భార్యపై చర్యలు తీసుకునే సాహసం చేస్తారా..? మొత్తం మీద కల్తీ లడ్డూ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి చికాకులు సృష్టిస్తున్నట్లుంది. ఇలా చికాకులకు కారణం కూడా టిడిపినే. దీనికి ఎవరినీ నిందించడానికి వీలు లేదు. ప్రత్యర్థులు దుమ్మెత్తిపోస్తుంటే..ఏ ఒక్కనాయకుడు ముందుకువచ్చి ఖండించకుండా..మౌనం వత్రం పాటిస్తే..అసత్యాలే నిజాలవుతాయి.