వివేకా కేసు గురించి మాట్లాడకండి సార్...!?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి విషయాన్ని నానబెట్టి..నానబెట్టి చివరకు చిక్కులు కొనితెచ్చుకుంటారు. గత 40ఏళ్ల ఆయన రాజకీయ చరిత్రలో ఆగమేఘాలపై దేనిపైనా నిర్ణయం తీసుకోలేదు. తన వ్యూహాలు తనకు ఉన్నాయనుకున్నా..తన వ్యూహాలే పనిచేసి తనను నాలుగుసార్లు ముఖ్యమంత్రిని చేశాయనుకున్నా..కొన్ని విషయాల్లో మాత్రం ఆయన వ్యూహాలు కాని, నానబెట్టే వైఖరితో తీవ్ర సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయనపై జరుగుతోన్న విషప్రచారాన్ని అడ్డుకోవడంపై ఆయన నాన్చివేత ధోరణి, అలసత్వం వల్ల రాజకీయంగా కీలకంగా దెబ్బతిన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత రాజశేఖర్‌రెడ్డి ఆయన మందిమాగాధాలు చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగన్నారు..ఉచిత విద్యుత్ ఇస్తే..బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ ఉపయోగపడదన్నారని ఆయనపై దుష్ప్రచారాన్ని చేశారు. అప్పట్లో వై.ఎస్ చేసిన వ్యవసాయం దండగన్న ప్రచారం రైతుల్లోకి, రైతు కూలీల్లోకి బాగా వెళ్లింది. ఈ ప్రచారాన్ని వై.ఎస్. ఆయన అనుచరగణం చేస్తోన్నప్పుడు చంద్రబాబు నాన్చివేత ధోరణిని అవలంభించారు. దాంతో.. తరువాత జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘోరంగా దెబ్బతింది. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎదుర్కొనని ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అదొక్కటేనా.. తెలంగాణ విషయంలో, అమ్మకు చీర కొనివ్వని వాడు పిన్నమ్మకు బంగారుగాజులు చేయిస్తాడట..అన్నట్లు వై.ఎస్. విసిర వ్యంగ్యబాణాలు చంద్రబాబును, టిడిపిని ఘోరంగా దెబ్బతీశాయి. చంద్రబాబు ప్రత్యర్థులు ఒక అసత్యాన్ని, చంద్రబాబు అనని మాటలను ఆయన నోట్లోపెట్టి పదే పదే ప్రచారం చేసినా చంద్రబాబు చూస్తూనే ఉంటారు. దెబ్బలు తింటూనే ఉంటారు. వై.ఎస్ తరువాత కెసిఆర్, జగన్‌లు ఇదే ఎత్తును అందుకున్నారు. పదే పదే చంద్రబాబుపై దుష్ప్రచారాన్ని చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మారతారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూసినా ఆయనలో మాత్రం కొంతైనా మార్పు రాలేదు.
2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న వై.ఎస్.వివేకానందరెడ్డిని వారి బంధువులే హత్య చేస్తే..అప్పట్లో ఈ హత్యను చంద్రబాబే చేయించారని జగన్ ప్రచారం చేశారు. దీన్ని చంద్రబాబు అడ్డుకోలేకపోయారు. అప్పట్లో చంద్రబాబు ఓటమికి ఇదో కారణం. జగన్ బంధువులు వివేకానందరెడ్డిని హత్య చేయించారని, ఆ హత్య కుట్ర వెనుక పెద్దలు ఉన్నారని సీబీఐ చెబుతున్నా..ఇప్పటికీ ..అదే పాటను జగన్ పాడుతున్నా..చంద్రబాబు మాత్రం చూస్తూనే ఉన్నారు. తనపై జగన్ దుష్ప్రచారాన్ని చేయించారని ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా జరుగుతోన్న తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం లోనూ జగన్ ఎదురుదాడి చేస్తున్నారని ఆయన ఆటలు సాగవని చంద్రబాబు హెచ్చరించారు. అయితే..ఆయన వివేకా కేసు గురించి ప్రస్తావించడంతో.. అప్పట్లో..అధికారంలో ఉండీ దుష్ప్రచారాన్ని ఆపలేకపోయారు. మళ్లీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా..వివేకా కేసును తేల్చలేకపోతున్నారు. మీరే అధికారంలో ఉన్నారు కదా..వివేకా కేసును తేల్చి జగన్‌కు శిక్ష వేయించవచ్చు కదా..అనే అభిప్రాయం సాధారణ జనంలోనూ వస్తోంది. 2019 అప్పుడు అనుకుంటే..ఎన్నికల సమయం కనుక చేయలేకపోయారనుకోవచ్చు. కానీ..ఇప్పుడు బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలో కొనసాగుతున్నారు...పైగా కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వానికి తన మద్దుతే అవసరం..మరి ఇటువంటి పరిస్థితుల్లోనైనా..వివేకా కేసును తేలిస్తే..దోషులకు శిక్షపడుతుంది కదా..? సీబీఐ పరిధిలో ఉన్న కేసులో తాను చేసేదేమీ లేదని చంద్రబాబు భావిస్తే..ఇక ఆ కేసు గురించి మాట్లాడకుంటా ఉంటేనే మంచిదని కొందరు టిడిపి కార్యకర్తలు, నాయకులు అంటున్నారు. వివేకా కేసు విషయం మాట్లాడితే..మనకే దెబ్బ..మనమేమీ చేయలేం..ఇప్పుడు మా సార్..ఏ ప్రెస్ మీట్‌లోనైనా దాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయన అలా ప్రస్తావించిన ప్రతిసారీ..మనం చేతగానితనం బయటపడుతుంది తప్ప..ఒరిగేదీమీ ఉండదని..ఇప్పటికైనా మా సార్..వివేకా కేసు గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సిన్సియర్ టిడిపి కార్యకర్త అన్నారు.