స‌ర్వ‌సైన్యంతో ప్ర‌తిదాడి...!?

05, Feb 2026



ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వ్య‌వ‌హార‌మంతా చేతులు కాలాక, ఆకులు ప‌ట్టుకున్న‌ట్లే ఉంటుంది. క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ప్ర‌సాదం విష‌యంలో..ఒక వ్యూహం, ప‌ద్ద‌తి, తెలివిలేకుండా వ్య‌వ‌హ‌రించి..ప్ర‌త్య‌ర్థికి పైచేయి సాధించే అవ‌కాశాన్ని ఇచ్చారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత గ‌త వైకాపా పాల‌న‌లో తిరుమ‌ల ప్ర‌సాదంలో జంతు కొవ్వు క‌లిసింద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. దీనిపై దేశ వ్యాప్తంగా, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వెంక‌న్న భ‌క్తుల‌లో తీవ్ర ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం అయింది. అయితే..త‌రువాత ప‌రిణామాల్లో సుప్రీంకోర్టు జోక్యంతో సిట్ ఏర్పాటు కావ‌డం, అది త‌న నివేదిక ఇవ్వ‌డం జ‌రిగిపోయింది. తిరుమ‌ల ప్ర‌సాదాన్ని ఒక్క చుక్క పాలు లేకుండా త‌యారు చేశార‌ని, దీనిలో క‌ల్తీ జ‌రిగింద‌ని ఆ రిపోర్టులో ఉంది. వాస్త‌వానికి ఈ రిపోర్టుతో వైకాపాకు అధికార పార్టీ చుక్క‌లు చూపించాలి. కానీ..ఆశ్చ‌ర్య‌క‌రంగా..ఈ విష‌యంలో వైకాపానే పైచేయి సాధించింది. త‌ప్పు చేసి కూడా జ‌గ‌న్ అండ్ కో ద‌బాయింపుతో, ఎదురుదాడితో..అధికార‌పార్టీని నిశ్చేష్టుల‌ని చేసింది. తిరుమ‌ల ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని, జంతుకొవ్వు విష‌యంలో ఎటూ చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంద‌ని నివేద‌క రావ‌డంతో..ఇక వైకాపా రెచ్చిపోయింది. చంద్ర‌బాబు తిరుమ‌ల వెంక‌న్న భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆడుకున్నార‌ని, ఆయ‌న‌కు తిరుప‌తి దేవుడిపై విశ్వాసం లేద‌ని, హిందువులను మోసం చేశార‌ని, చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాలంటూ వైకాపా నేత‌లు వీరంగాలు వేశారు. వాస్త‌వానికి తిరుమ‌ల ప్ర‌సాదంలో ఘోర‌మైన క‌ల్తీ ఉంద‌ని, వాడ‌కూడ‌ని ప‌దార్థాలు వాడార‌ని, అదంతా అప్ప‌టి వైకాపా పెద్ద‌ల ఆశీస్సుల‌తోనే జ‌రిగింద‌నేది తెలిసినా..వైకాపా ద‌బాయింపుల‌తో ల‌డ్డూ రాజ‌కీయాన్ని పీక్‌కు తీసుకుపోయింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంతో ఘోర‌మైన త‌ప్పులు చేసిన వైకాపా రాజ‌కీయంగా చంద్ర‌బాబును ఇర‌కాటంలో పెట్ట‌డంతో కూట‌మి ఇప్పుడు స‌ర్వ‌సైన్యంతో ఎదురుదాడి చేయాల్సి వ‌చ్చింది. ఇటువంటి ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చిందో చంద్ర‌బాబు ఆయ‌న కుమారుడు ఆలోచించుకోవాలి. 


క‌ల్తీ వ్య‌వ‌హారంలో వైకాపా చేస్తోన్న ఎదురుదాడిని మొద‌ట్లోనే టిడిపిపెద్ద‌లు ఆప‌లేక‌పోయారు. వారిని త‌క్కువ‌గా అంచ‌నా వేశారు. వైకాపాకు ఉన్న సోష‌ల్ మీడియా బ‌లంతో..అది దూసుకుపోయింది. పైగా త‌మ నాయ‌కుల‌తో ఎక్క‌డిక‌క్క‌డ త‌మ‌కు ఈ విష‌యంలో క్లీన్ చిట్ వ‌చ్చింద‌ని ర్యాలీలు చేయించింది. అంతేనా ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంలో పీక‌ల‌లోతు కూరుకుపోయిన భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి వంటి నేత‌లు సంప్రోష‌ణ దీక్ష‌లు, పాప‌ప‌రిహార దీక్ష‌లు చేశారు. వారెవ్వా...ఏమి నాట‌కం..ఎంత అభూత క‌ల్ప‌న దొంగే..ఇత‌రుల‌ను దొంగ‌న‌ట్లు..వైకాపా చేసిన రాజ‌కీయం న‌భూతో..న‌భ‌విష్య‌త్తు అన‌డంలో సందేహం లేదు. ఇంత జ‌రుగుతున్నా..టిడిపిపెద్ద‌లు దావోస్ స‌ద‌స్సు, ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు, అభివృద్ది, క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులంటూ..ఇంకా ఏమేమో చేసుకుంటూ పోయింది కానీ..వైకాపా చేస్తోన్న విష ప్ర‌చారంపై ఏమీ చేయ‌లేక‌పోయింది. కూట‌మి నేత‌ల్లో క‌నీసం ఒక్క పెద్ద నాయ‌కుడైనా సిట్ ఏమి రిపోర్ట్ ఇచ్చిందో..చ‌దివారా....? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. వైకాపా దూకుడు త‌రువాత జ‌రుగుతోన్న న‌ష్టాన్ని గుర్తించి అప్ప‌టిక‌ప్పుడు ప్లెక్సీలు పెట్టి కొంద‌రు నేత‌లు హ‌డావుడి చేశారు. అయితే..ఎప్పుడు అవ‌కాశం దొరుకుతుందా..అని ఎదురుచూసిన వైకాపానేత‌లు ఈ విష‌యంలోనూ రాద్ధాంతాలు చేశారు. గుంటూరులో జ‌రిగిన రాద్ధాంతం ఇలాంటిదే. ల‌డ్డూ విష‌యంలో మొద‌టి నుంచి కూట‌మి నేత‌లు..త‌ప్పులు చేసుకుంటూనే వ‌స్తున్నారు. ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంలో ప్ర‌ధాన పాత్ర ఉంటుంద‌ని భావించిన అనిల్‌కుమార్ సింఘాల్‌ను ఎందుకు మ‌ళ్లీ టిటిడి ఇఓగా నియ‌మించారు. అప్ప‌ట్లో ఆయ‌నేమీ చేశారో కూట‌మి పెద్ద‌ల‌కు తెలియ‌దా..? ఎవ‌రి ఒత్తిడిల‌కు త‌లొగ్గి ఆయ‌న‌ను అక్క‌డ నియ‌మించారు. అంతేనా అప్ప‌టి టిటిడి ఇఓ ధ‌ర్మారెడ్డి, అప్ప‌టి ఛైర్మ‌న్లు వై.వి.సుబ్బారెడ్డి, క‌రుణాక‌ర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి చేసిన అక్ర‌మాలు తెలియ‌వా..?  వారిపై ఎందుకు గురిపెట్ట‌లేదు. ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లే. అయితే..మొద‌ట నుంచి అనుకున్న‌ట్లు ఇప్పుడు చేతులు కాలాక‌..స‌ర్వ‌సైన్యాన్ని దించి చంద్ర‌బాబు ప్ర‌తిదాడి చేస్తున్నారు. ఈ రోజు కూట‌మి నేత‌లు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు మాధ‌వ్‌, బిజెపికే చెందిన మంత్రి స‌త్య‌కుమార్‌, టిడిపికి చెందిన మంత్రులు లోకేష్‌, ప‌య్యావుల కేశ‌వ్‌,ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి, పార్థ‌సార‌ధి, టిడిపి రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస్ వంటి మ‌హామ‌హులు క‌లిసి వైకాపా చేస్తోన్న ప్ర‌చారాన్ని అడ్డుకోవాల‌ని తీర్మానించారు. త‌రువాత మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి   ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. వైకాపా అంతు తేలుస్తామ‌ని ఎప్ప‌టిలాగానే హెచ్చ‌రిక‌లు చేశారు. ఇవ‌న్నీ ఉట్టిట్టి బెదిరింపులేన‌ని, వైకాపా విష‌ప్ర‌చారాన్ని వీళ్లు అడ్డుకోలేర‌నే భావ‌న టిడిపినేత‌ల్లో, కార్య‌క‌ర్త‌ల్లో వ్య‌క్తం అవుతోంది. స‌ర్వ‌సైన్యాన్ని మొహ‌రించారంటేనే..కూట‌మి ఎంత వెన‌కబ‌డిపోయిందో..అర్థం చేసుకోవ‌చ్చు. 


(1)
(0)

Comments