సెల‌వులో సీనియ‌ర్ ఐఏఎస్ కాటంనేని...!?

10, Feb 2026

రాష్ట్ర ఐటిశాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తోన్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి కాటంనేని భాస్క‌ర్ ధీర్ఘ‌కాలిక సెల‌వుపై వెళుతున్న‌ట్లు తెలుస్తోంది. అత్యంత నిజాయితీ, స‌మ‌ర్థ‌త‌, ప‌నిమంతుడుగా కాటంనేని భాస్క‌ర్‌కు పేరుంది. అయితే గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న కొన్ని విష‌యాల్లో తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌నే ప్ర‌చారం ఉంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు భాస్క‌ర్‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తారు. భాస్క‌ర్ కోరుకుంటే నేరుగా సిఎంఓలోకి కూడా తీసుకుంటారు. అయితే..ప్ర‌భుత్వం త‌న‌కు అప్ప‌గించిన ప‌నిని పూర్తిచేయ‌డంలో వంద‌కు రెండు వంద‌ల శాతం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే భాస్క‌ర్ కొన్ని విష‌యాల్లో అస‌లు రాజీ ప‌డ‌రు. అవినీతి, అక్ర‌మాల‌కు ఆమ‌డ దూరంలో ఉంటారు. అటువంటి అధికారి కొన్ని విష‌యాల్లో ఇబ్బందులు ప‌డుతున్నార‌నే ప్ర‌చారం ఉంది. ప్ర‌భుత్వం తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు ఆయ‌న‌ను భాదించాయ‌ని, దీంతో..సెల‌వులో వెళ్లాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన ఓ ప్రాజెక్టు విష‌యంలో ఇప్పుడు తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. వాస్త‌వానికి ఈ ప్రాజెక్టు కానీ, ఇత‌ర ఐటి ప్రాజెక్టుల‌ను కానీ రాష్ట్రానికి తీసుకురావ‌డానికి భాస్క‌ర్ తీవ్రంగా కృషి చేశారు. ఎక్కే ప్ల‌యిట్ దిగే ప్ల‌యిట్ అన్న‌ట్లు ఆయ‌న వివిధ దేశాల‌కు, రాష్ట్రాల‌కు మ‌ధ్య ష‌టిల్ స‌ర్వీసుల్లా తిరిగారు. ఆయ‌న శాఖ ఆధ్వ‌ర్యంలోనే ఈ ఏడాదిన్న‌ర‌లో ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయంటే ఆయ‌న ప‌నితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే..ప్ర‌భుత్వం ఇప్పుడు తీసుకుంటోన్న ఓ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు విష‌యంలో ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు, భాస్క‌ర్‌కు మ‌ధ్య ఇబ్బందులు వ‌చ్చాయ‌ని, దాంతో సెల‌వులో వెళ్లాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి భాస్క‌ర్ కొన్ని నెల‌ల ముందే కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లాల‌ని భావించారు. అయితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మాత్రం ఆయ‌న స‌ర్వీసులు ఇక్క‌డ అవ‌స‌ర‌మ‌ని భావించి ఆయ‌నకు న‌చ్చ‌చెప్పి ఇక్క‌డే ఉండే విధంగా నిలువ‌రించారు. అయితే..ఇప్పుడు మాత్రం భాస్క‌ర్ సెల‌వులో వెళ్లాల‌ని నిర్ణ‌యించార‌ని, రేపు మంత్రివ‌ర్గ స‌మావేశం త‌రువాత ఆయ‌న అధికారికంగా సెల‌వు పెడ‌తార‌ని తెలుస్తోంది. 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కాటంనేని భాస్క‌ర్‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సిఆర్‌డిఏ క‌మీష‌న‌ర్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది. గ‌తంలో ఆయ‌న ప‌నితీరుచూసే సిఆర్‌డిఏకు భాస్క‌ర్ క‌మీష‌న‌ర్ అయితే..రాజ‌ధాని ప‌నులు శ‌ర‌వేగంగా పూర్తి అవుతాయ‌ని న‌మ్మి చంద్ర‌బాబు భాస్క‌ర్‌ను అక్క‌డ నియ‌మించారు. అయితే..ఇక్క‌డ మున్సిప‌ల్ మంత్రి నారాయ‌ణ‌కు భాస్క‌ర్‌కు మ‌ధ్య విభేదాలు రావ‌డం, చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు నారాయ‌ణ‌వైపే ఉండి భాస్క‌ర్‌ను సిఆర్‌డిఏ నుంచి బ‌దిలీ చేశారు. ఆయ‌న బ‌దిలీ త‌రువాత సిఆర్‌డిఏ ఎలా  అయిందో రాజ‌ధాని ప్ర‌జ‌లు ఇప్పుడు  క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటున్నారు. మంచి ప‌నితీరును క‌న‌బ‌ర్చే భాస్క‌ర్‌ను వదులుకుని చంద్ర‌బాబు రాజ‌ధాని విష‌యంలో కోలుకోలేని దెబ్బ‌తిన్నారు. అయితే.. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి వ‌చ్చిందని, అందుకే భాస్క‌ర్ సెల‌వులో వెళ్లాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. అప్పుడు నారాయ‌ణ వ‌ల్ల ఎదురైన ఇబ్బందులే ఇప్పుడూ ఎదురువుతున్నాయ‌ని ఈ ప‌రిస్థితుల్లో మౌనంగా వెళ్లిపోవ‌డ‌మే మేల‌నే అభిప్రాయానికి భాస్క‌ర్ వ‌చ్చారంటున్నారు. మొత్తం మీద‌..రేపు మంత్రివ‌ర్గ స‌మావేశం త‌రువాత ఆయ‌న ఏమి చేస్తార‌నేది తేలుతుంది. 2014-19 మ‌ధ్య కాలంలో ప‌ట్టిసీమ‌, పోల‌వ‌రం ప్రాజెక్టుల‌ను ఆగ‌మేఘాల‌పై పూర్తి చేసిన భాస్క‌ర్‌పై అప్ప‌ట్లో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. ముఖ్యంగా ప‌ట్టిసీమ కాలువ‌ల‌ను ఆయ‌న ఆరు నెల‌ల్లో పూర్తి చేయించారు. ఈ కాలువ‌ల‌ను త‌వ్వే స‌మ‌యంలో ఆయ‌న రాత్రిళ్లు కాలువ‌ గ‌ట్ల‌పైనే నిద్రించారంటే..ఆయ‌న ప‌నితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.క‌ష్ట‌ప‌డేత‌త్వం, నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసే భాస్క‌ర్ వంటి అధికారులను ఈ ప్ర‌భుత్వం స‌రిగా వాడుకోవ‌డం లేద‌నే అభిప్రాయం వివిధ వ‌ర్గాల నుంచి వ్య‌క్తం అవుతోంది. 


(24)
(3)

Comments


  • 2026-02-11 05:32:48
  • RAJENDRAKUMAR. DODDAPANENI

ధర్మోరక్షతి రక్షతిః.
ధర్మాన్ని పాటిస్తే రక్షిస్తుంది.
ఇలాంటి అధికారుల్ని కాపాడుకుంటే ప్రభుత్వాన్ని కాపాడుతారు.

(0)
(0)
  • 2026-02-11 09:48:39
  • Haranath

Sincere offeecer povatam jarigita CBN and lokash failure. This issue impact party seriously. Kutami Gov meeda nammakam potundi.

(0)
(0)