కాటంనేని...సారబ్ గౌర్...యువరాజ్...!?
రాష్ట్ర ఐటిశాఖలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, టిడిపి భావి ఆశాకిరణం లోకేష్ నిర్వహిస్తోన్న ఐటి శాఖలో ప్రస్తుతం జరుగుతోన్న పరిస్థితులు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఐటి శాఖ మంత్రిగా నారా లోకేష్ లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తెస్తున్నారని ప్రపంచ ఐటి రంగం మొత్తం ఆంధ్రావైపు చూస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే...ఇది కొంత వరకూ నిజమే. లోకేష్ ఐటి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రముఖ ఐటి కంపెనీలు ఆంధ్రాకు వచ్చాయి. గూగుల్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, ఇన్పోసిస్, Zoho Corporation, ఫిన్‌టెక్ వంటి సంస్థలు ఆంధ్రాలో తమ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ను దాదాపు లక్ష కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయబోతోంది. అదే విధంగా వివిధ ప్రాంతాల్లో ప్రముఖ ఐటి సంస్థలు తమ సంస్థల ఏర్పాటుకు అంతా సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే..ఇప్పుడు హఠాత్తుగా ఐటిశాఖలో ఒకరకమైన వాతావరణం నెలకొంది.
ఐటి శాఖ కార్యదర్శిగా ఉన్న కాటంనేని భాస్కర్ నిన్న సెలవుపై వెళ్లారు. ఆయన సెలవుపై వెళ్లడానికి పేరుకు ఆరోగ్య కారణాలు చెప్పినా అసలు విషయం వేరే ఉందని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. నిజాయితీ,నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా భాస్కర్‌కు పేరుంది. ఆయన ఎక్కడ పనిచేసినా..ఆ శాఖకు వన్నె తెస్తారు. అయితే..ఇప్పుడు ఆయన ఒకరకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని, కొన్ని ఒత్తిళ్ల వల్ల ఆయన ఐటి కార్యదర్శిగా పనిచేయలేకపోతున్నారని అందుకే అనారోగ్యం సాకుతో సెలవులో వెళ్లారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ప్రముఖ సంస్థ ఏర్పాటు చేయబోతోన్న సంస్థ వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆ ఒత్తిడిని భరించలేకే ఆయన వెళ్లిపోయారంటున్నారు. ఈ నెలాఖరు దాకా ఆయన సెలవులో ఉంటారు. అయితే..తరువాత ఆయన మళ్లీ వస్తారా..? లేక ఆ సెలవును మరింతగా పొడిగించుకుంటారా..? అనే దానిపై స్పష్టత లేదు. ఇది ఇలా ఉండగా...నిన్న భాస్కర్ సెలవు తరువాత ఆయన స్థానంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి సారభ్‌గౌర్‌ను ఇన్‌ఛార్జిగా ప్రభుత్వం నియమించింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో సారబ్‌గౌర్ విద్యాశాఖ కార్యదర్శిగా ఉండేవారు. అయితే..లోకేష్ వద్ద ఉంటూ ఆయన హఠాత్తుగా సెలవుపై వెళ్లిపోయారు. తరువాత ఆయన వచ్చినా..ఆయన అక్కడ కొనసాగలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయననే లోకేష్ వద్ద ఇన్‌ఛార్జిగా నియమించడం, అంతలోనే మళ్లీ తొలగించడంతో..అసలేమి జరుగుతుందో అర్థం కావడం లేదు. నిన్న ఇచ్చిన ఉత్తర్వుల్లో గౌర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. ఇంతలోనే ఈ రోజు మరో జీవో ఇస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న యువరాజ్‌ను ఐటి శాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా నియమించారు. దీంతో..అంతా గందరగోళం నెలకొంది. మొత్తం మీద ఐటిశాఖలో ఏమి జరుగుతుందో..అన్న అనుమానాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. కీలమైన ఐటిశాఖలో ఐటి కార్యదర్శి పదవి ఖోఖో పోటీలా ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి.