రాజ్యసభ సీట్ల పంపకాలు ఎలా...!?
రాష్ట్రంలోని అధికార కూటమిలో ఇప్పుడు రాజ్యసభ సీట్ల పంపకంపై చర్చ జరుగుతోంది. ఈ ఏడాదిలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. వైకాపా నుంచి రాజ్యసభకు ఎంపికైన అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లతో పాటు ఏడాది క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి నుంచి ఎన్నికైన సానా సతీష్ పదవీకాలం ఈ జూన్‌కు ముగుస్తోంది. దీంతో..వీరి స్థానంలో కొత్తవారిని ఎన్నుకుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైకాపాకు చెందిన పలువురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో కొందరు టిడిపిలో చేరగా మరి కొందరు బిజెపిలో చేరారు. వైకాపా నుంచి రాజ్యసభకు ఎన్నికైన తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్య బిజెపిలో చేరి మరోసారి ఎన్‌డిఏ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయనతో పాటు పార్టీ మారిన బీద మస్తాన్‌రావు టిడిపిలో చేరి మరోసారి ఎన్నిక అవగా, మరో సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తన పదవికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. ఆయన స్థానంలో టిడిపి సానా సతీష్‌ను ఎంపిక చేసింది. అదే సమయంలో వైకాపాలో నెంబర్ టూగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌సాయిరెడ్డి తన పదవికి, వైకాపాకు రాజీనామా చేయడంతో..ఆయన స్థానంలో బిజెపికి చెందిన పాకా సత్యనారాయణకు రాజ్యసభ్యత్వం వరించింది. కాగా ఇప్పుడు మరో నాలుగు స్థానాలు ఖాళీ కానుండడంతో..ఈసారి ఎవరెరికి అదృష్టం దక్కుతుందో చూడాలి.
ఏ పార్టీకి ఎన్ని...?
మొత్తం నాలుగు స్థానాలు ఖాళీలు ఉండగా అధికార ఎన్‌డిఏ కూటమి నుంచి పోటీ గట్టిగానే ఉంది. ఈసారి బిజెపికి ఇవ్వాల్సిన అవసరం లేదని టిడిపి నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. గతంలోనే వారికి రాష్ట్రంలో ఉన్న బలం కంటే ఎక్కువ సీట్లు ఇచ్చామని, ఈసారి ఖాళీ అయిన నాలుగు స్థానాల్లో మూడు స్థానాలు టిడిపికే కేటాయించాలని, ఒకటి జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పోయిన సారి బిజెపికి ఇచ్చారని, ఇప్పుడు మాత్రం మొత్తం తమకే కేటాయించాలనే వాదనను వారు తెస్తున్నారు. ప్రతిసారి బిజెపికి ఇచ్చుకుంటూ పోతే..పార్టీకి ఇబ్బందని, ఎన్నిసార్లు వారికి ఇస్తారని, ఈసారి మాత్రం మొత్తం టిడిపికి, జనసేనకే కేటాయించాలని కోరుకుంటున్నారు. అయితే..ఇది అయ్యే పని కాదని, ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై బిజెపి పెద్దలు ఒత్తిడి తెస్తారని, ఈసారి బిజెపికి ఒకటి, జనసేనకు ఒకటి, టిడిపికి రెండు స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయనే భావన రాజకీయవర్గాల్లో ఉంది. అయితే..టిడిపి రెండు దక్కితే వాటి కోసం పార్టీలో గట్టిపోటీ ఉంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్‌కు మళ్లీ కేటాయి స్తారంటున్నారు. మరో స్థానాన్ని లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్‌కు ఇస్తారనే అభిప్రాయం ఉంది. దీంతో..రెండు స్థానాలు ఇప్పటికే భర్తీ అయిపోయాయని, తమకు అవకాశాలు దక్కే అవకాశమే లేదని పార్టీలోని సీనియర్లు భావిస్తున్నారు. బీసీ, ఎస్సీ కేటగిరిలో సీనియర్ నాయకులు తమను చంద్రబాబు రాజ్యసభకు పంపుతారని ఆశిస్తున్నారు. అయితే..వారి ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. బిజెపి పెద్దల ఒత్తిడి ఢిల్లీ నుంచి మరో పారిశ్రామిక వేత్తకానీ, కేంద్ర బిజెపి నేతలు కానీ మళ్లీ దిగుమతి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు జనసేనకు ఒక స్థానం దక్కితే..అది లింగమనేని రమేష్‌కు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఈసారి బిజెపికి ఒక్కసీటు కూడా ఇవ్వదన్న కేటర్ అభిప్రాయాన్ని సమర్థిస్తారా..? ఢిల్లీ నుంచి వచ్చే ఒత్తిడి ఆయన తట్టుకుంటారా..? చూడాలి మరి..?