తెలంగాణ ప‌రిస్థితే..ఇక్క‌డ ఉందా...!?

15, Feb 2026

మొన్న మొన్న‌టి దాకా..తెలంగాణ‌లో ఎక్క‌డ చూసినా ఒక‌టే ప్ర‌చారం..ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా రేవంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఓడిపోతుంద‌ని, ప్ర‌తిప‌క్ష బిఆర్ఎస్ బ్రహ్మాండ‌మైన మెజార్టీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని. కానీ..మొన్న జ‌రిగిన పంచాయితీ కానీ, నిన్న జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కానీ..ఆ ప్ర‌చారం ప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉంద‌ని, ఆయ‌న అన్ని ర‌కాలుగా విఫ‌ల‌మ‌య్యార‌ని, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్‌రావు పాల‌న కోసం ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఎదురుచూస్తున్నార‌నే విధంగా ప‌రిస్థితి ఉంది. ఎవ‌రిని క‌దిలించినా..ఇదే మాట వినిపించేది. ప్ర‌భుత్వ తీరు స‌రిగా లేద‌ని, ఇలా అయితే..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌భుత్వం ఓడిపోతుంద‌ని, అటు ప్ర‌తిప‌క్షంతో పాటు, ఇటు అధికారప‌క్షం వారు కూడా చెప్పేవారు. అయితే..నిన్న జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని తేలిపోయింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్ట‌మైన మెజార్టీ సాధించి  ఆ ప్ర‌చారానికి పుల్‌స్టాప్ పెట్టింది. వివిధ కార‌ణాల వ‌ల్ల రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వంపై కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉన్న మాట నిజం. ముఖ్యంగా భారీగా అమ‌లు చేస్తామ‌న్న సంక్షేమ‌ప‌థ‌కాల‌ను అనుకున్న రీతిలో అమ‌లు చేయ‌క‌పోవ‌డం, ఒట్టిపోయిన ఖ‌జానా, కాంగ్రెస్ మంత్రుల అవినీతి, నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డం, కొంద‌రు నాయ‌కులు రేవంత్‌రెడ్డిని నాయ‌కుడిగా గుర్తించ‌క‌పోవ‌డం, అధికార‌ప‌క్షంలోనే ప్ర‌తిప‌క్షం ఉండ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుకుంటుంద‌నే భావ‌న వ్య‌క్తం అయింది. అయితే..ఇవ‌న్నీ ప్ర‌తిప‌క్ష బిఆర్ఎస్‌కు లాభించేలా లేవ‌నేది నిన్న‌టి ఫ‌లితాల‌తో తేలిపోయింది. గ‌త ప‌దేళ్ల‌లో బిఆర్ఎస్ చేసిన అరాచ‌కాలు, అవినీతి, బంధుప్రీతిని, ఇత‌ర‌త్రా సాగించిన దౌష్ట్యాల‌ను ప్ర‌జ‌లు అంత తేలిక‌గా మ‌రిచిపోలేద‌ని, ఆ పార్టీకి ఇప్ప‌టికిప్పుడే అధికారాన్ని అప్ప‌గించ‌డానికి ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌ని ఈ ఫ‌లితాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతోన్నంతగా రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు అసంతృప్తి లేద‌ని, ఎంతో కొంత చేస్తున్నాడు..వాళ్ల కంటే మేలేన‌నే భావ‌న మెజార్టీ ప్ర‌జ‌ల్లో ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే..ఈ స్థానిక ఎన్నిక‌లే రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కొల‌మానం కాదు. కానీ..ప్ర‌స్తుతానికైతే ప్ర‌చారం సాగుతోన్నంతగా ప్ర‌జ‌ల్లో అసంతృప్తి మాత్రం లేద‌ని ఘంటాప‌థంగా చెప్ప‌వ‌చ్చు. 

తెలంగాణ‌లో జ‌రుగుతోన్న విధంగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కూట‌మి ప్ర‌భుత్వంపై కూడా అసంతృప్తి ప్ర‌చారం సాగుతోంది. ఇక్క‌డి ప్ర‌జ‌లు కూట‌మి పాల‌న‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని, ఎంతో ఆశ‌తో వారిని గెలిపిస్తే..చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం వారి అంచ‌నాల‌ను అందుకోవ‌డం లేద‌ని వైకాపాతో పాటు ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చే వ‌ర్గాలు ప్ర‌చారం చేస్తున్నాయి. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా వారికి టిడిపిలోని కొంద‌రు అసంతృప్తి వాదులు గొంతు క‌లుపుతున్నారు. వాస్త‌వానికి వైకాపా నేత‌లు చేసే ప్ర‌చారం కంటే టిడిపిలోని కొంద‌రు నేత‌లు, కొంద‌రు కార్య‌క‌ర్త‌లు చేస్తోన్న అతి మాత్రం ప్ర‌జ‌ల్లోకి నేరుగా వెళుతోంది. ఐదేళ్ల జ‌గ‌న్ అరాచ‌కం, అవినీతి త‌రువాత ఈ ప్ర‌భుత్వం అత‌ను చేసిన విధ్వంసాన్ని కొద్దికొద్దిగా మార్చుకుంటూ వ‌స్తోంది. అయితే ఈ పాల‌న కొంద‌రికి న‌చ్చ‌డం లేదు. ఆక‌స్మిక‌మైన మార్పులు కోరుకుంటున్న‌వారు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు నిదానంగా, నిర్మాణాత్మ‌కంగా చేస్తోన్న పాల‌న‌పై విసుగు చెందుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు కొంద‌రికి విసుగు, విర‌క్తిని తెప్పిస్తోంది. ప‌దేళ్ల‌పాటు రాజ‌ధాని అమ‌రావ‌తికి వెళ్లే క‌ర‌క‌ట్ట‌రోడ్డును విస్త‌రించ‌లేక‌పోవ‌డం, సీడ్‌యాక్సిస్ రోడ్డు కోసం భూమిని సేక‌రించ‌లేక‌పోవ‌డం వంటివి దీనికి ఉదాహ‌ర‌ణ‌లు. అదే విధంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, కార్య‌క‌ర్త‌ల‌పై పెట్టిన కేసుల‌ను ఉప‌సంహ‌రించ‌లేక‌పోవడం, గ‌తంలో టిడిపి పార్టీ సానుభూతిప‌రులంటూ తొల‌గించిన పెన్ష‌న్ల‌ను ఇంకా పున‌రుద్ధ‌రించ‌లేక‌పోవడం, ఎమ్మెల్యేల‌, మంత్రుల అవినీతి, భూముల కేటాయింపు వ్య‌వ‌హారాలు ఈ  ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో కొంత అసంతృప్తిని రేకెత్తిస్తున్న మాట నిజ‌మే కానీ..వైకాపా, టిడిపిలోని కొంద‌రు చేసేంత అసంతృప్తి అయితే లేద‌ని చెప్ప‌వ‌చ్చు. తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డిపై ఎటువంటి ప్ర‌చారం జ‌రిగిందో..ఇక్క‌డ కూడా అదే విధమైన ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే..ఇక్క‌డ మున్స‌ప‌ల్‌, స్థానిక ఎన్నిక‌ల్లో టిడిపి కూట‌మి గెలిచినా..అది సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌తిఫ‌లించ‌దు. అది రేవంత్‌రెడ్డి, చంద్ర‌బాబుకూడా వ‌ర్తిస్తుంది. ప్ర‌స్తుతానికైతే రెండు ప్ర‌భుత్వాల‌పై సాధార‌ణ‌మైన అసంతృప్తి ప్ర‌జ‌ల్లో ఉంది. అది ఇంకా గేట్ల‌ను తాక‌లేదు. అది ఉదృతం కాకుండా చూసుకోవాల్సింది ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లే. 


(0)
(0)

Comments


  • 2026-02-15 07:07:18

ap లో గ్రౌండ్ లే లెవెల్ లో అసంతృప్తి ఎక్కువ గా వుంది . ముఖ్యం గా క్రింద స్థాయి కార్యకర్తలకు బరోసా లేక ఇబ్బందులు పడుతున్నారు. సీఎం గారు లోకేష్ గారు చెబుతున్నవి అన్ని అమలు జరగడం లేదు. సొమ్ములు ఇవ్వక పోతే ఈ పని జరగని పరిస్థితి . పరిస్థితి మారాలి

(0)
(0)