ల‌డ్డూ వివాదంలో బిజెపి పాత్ర ఏమిటి...!?

27, Feb 2026

వైకాపా పాల‌న‌లో క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ప‌విత్ర ప్ర‌సాదమైన ల‌డ్డూలో జంతు కొవ్వు క‌లిసింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌లు దేశంతో, ప్ర‌పంచంలోని శ్రీ‌వారి భ‌క్తుల‌ను క‌లిచివేసింది. ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేశార‌ని, చివ‌ర‌కు వేంక‌టేశ్వ‌ర‌స్వామి ప్ర‌సాదాన్ని కూడా క‌ల్తీ చేశార‌ని, ఇది అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌య‌మ‌ని శ్రీ‌వారి భ‌క్తులు ఆవేద‌న‌తో పాటు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి సాగుతోన్న ఈ వివాదంలో ఇటు టిడిపి, అటు వైకాపా త‌మ త‌మ వాద‌న‌ల‌ను వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం సిట్‌తో ద‌ర్యాప్తు చేయించాల‌ని భావిస్తే..ప్ర‌తిప‌క్ష వైకాపా సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే సుప్రీం నేరుగా తామే ద‌ర్యాప్తు ప‌ర్య‌వేక్షిస్తూ సీబీఐ విచార‌ణ‌ను చేయిస్తోంది. దీనిపై విచార‌ణ సంస్థ త‌న ఛార్జిషీట్‌ను దాఖ‌లు చేసింది. ఈ ఛార్జిషీట్‌లో ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగిన మాట నిజ‌మేన‌ని, అయితే..ప్ర‌సాదంలో జంతు కొవ్వు క‌లిసింద‌నే దానిపై నిర్ధార‌ణ చేయ‌లేదు. జంతుకొవ్వు న‌మూనాలు ఉండే అవ‌కాశాలు కొంచెం త‌క్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని, అంత‌మాత్రానా జంతు కొవ్వు క‌ల‌వ‌లేద‌ని చెప్ప‌లేమ‌ని వ్యాఖ్యానించింది. అయితే..దీన్ని ఆస‌రాగా తీసుకుని వైకాపా రెచ్చిపోయింది. శ్రీ‌వారి ప్ర‌సాదంలో జంతు కొవ్వు క‌ల‌వ‌లేద‌ని, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయ‌డు భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ తీశార‌ని, ఆయ‌న వారికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తోంది. దీనిపై అటు టిడిపి, ఇటు వైకాపా హోరా హోరిగా త‌ల‌ప‌డుతున్నాయి. ఈ విష‌యంలోనే వైకాపా నేత అంబ‌టిరాంబాబు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడును ఉద్దేశిస్తూ అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. దీనికి టిడిపి శ్రేణులు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చాయి. గుంటూరుకు చెందిన టిడిపి నేత‌లు ఆయ‌న ఇంటిపై దాడిచేసి త‌మ నిర‌స‌న‌ను తెలియ‌చేశారు. త‌రువాత ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ వివాదంపై రాష్ట్రం మొత్తం ఆందోళ‌న నెల‌కొంది. ప‌విత్ర‌మైన ల‌డ్డూలో క‌ల్తీ జ‌రిగింద‌నేది నిజమే అయినా..వైకాపా చేస్తోన్న ఎదురుదాడి అటు టిడిపితో పాటు, ఇటు ప్ర‌జ‌ల‌నూ నివ్వెర‌పోయేలా చేస్తోంది. ఇంత అరాచ‌క‌మా...? క‌ల్తీ నిజ‌మే అంటూ..అప్ప‌ట్లో టీటీడీ ఛైర్మ‌న్‌గా ప‌నిచేసిన జ‌గ‌న్ స్వంత బాబాయి వై.వి.సుబ్బారెడ్డి ఒప్పుకున్నా..వైకాపా చేస్తోన్న రాజ‌కీయం న‌భూతోన‌భ‌విష్య‌త్తు అన్న‌ట్లుంది. దీనిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లతో పాటు, క్యాబినెట్ మంత్రులు, ఇత‌ర టిడిపినాయ‌కులు ప‌దే ప‌దే వివ‌ర‌ణ‌తో పాటు, వైకాపా అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. 

వీరి మ‌ధ్య ఇలాంటి పోరు జ‌రుగుతుంటే..హిందూత్వానికి తామే ప్ర‌తినిధుల‌మ‌ని చెప్పుకునే బిజెపి నేత‌లు మాత్రం ఎక్క‌డా నోరెత్తడం లేదు. రాష్ట్ర బిజెపి నేత‌లు కానీ, కేంద్ర బిజెపి నేత‌లు కానీ ఈ విష‌యంలో పెద్ద‌గా జోక్యం చేసుకోవ‌డం లేదు. హిందూత్వ దేశ కోసం, అఖండ భార‌తం కోసం ఏమైనా చేస్తామ‌ని చెప్పుకునే బిజెపి పెద్ద‌లు ఎందుకో శ్రీ‌వారి ల‌డ్డూ క‌ల్తీ విష‌యంలో క‌ప్ప‌దాటు వైఖ‌రిని అవ‌లంభిస్తున్నారు. ఇదంతా త‌మకు స‌న్నిహితుడైన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని కాపాడుకునేందుకే అన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కూట‌మిలో అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎందుకు బిజెపి ఈ విష‌యంలో మౌనంగా ఉంటోంది..? అదే విధంగా అప్ప‌ట్లో క‌ల్తీకి కార‌ణ‌మైన కొంద‌రు అధికారుల‌ను ర‌క్షిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా..స్పందించ‌డం లేదు. అప్ప‌ట్లో టీటీడీ ఈఓలుగా ప‌నిచేసిన ధ‌ర్మారెడ్డి, అనిల్‌కుమార్ సింఘాల్‌ను బిజెపి పెద్ద‌లే కాపాడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. క‌ల్తీ జ‌రుగుతుంటే చోద్యం చూసిన అనిల్‌కుమార్ సింఘాల్‌కు మ‌ళ్లీ టీటీడీ ఈఓ పోస్టును బిజెపి పెద్ద‌లే సిఫార్సు చేశార‌నే విమ‌ర్శ‌లూ ఉన్నాయి. అయితే..సుప్రీంకోర్టు జోక్యంతో ఆయ‌నను ఇటీవ‌లే రాష్ట్ర ప్ర‌భుత్వం అక్క‌డి నుంచి త‌ప్పించింది. ఒక‌వైపు ఈ విష‌యంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిని కాపాడుతోంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నా..మ‌రోవైపు క‌ల్తీ ల‌డ్డూ వ్య‌వ‌హారంలో వైకాపాపై ఎటువంటి దాడి చేయ‌డం లేదు. ఆ విష‌యంతో త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. అంతా టిడిపి, వైకాపాల అంత‌ర్గ‌త విష‌య‌మ‌న్న‌ట్లు బిజెపి వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాష్ట్ర బిజెపి నాయ‌కుల్లో కీల‌క‌మైన నాయ‌కులు కూడా ఈ విష‌యంలో అంటీ ముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాష్ట్ర బిజెపి అధ్య‌క్షుడు మాధ‌వ్ ముఖ్య‌మంత్రి నిర్వ‌హించిన స‌మావేశానికి హాజ‌రై మ‌మ అనిపించారు. బిజెపిలో కీల‌కంగా చెప్పుకునే ఏ నాయ‌కుడూ ఈ విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. బిజెపికి అన‌బందంగా ఉంటే ఆర్ఎస్ఎస్‌, ఇత‌ర హిందూ సంస్థ‌లు, స్వామీజీలు, మ‌ఠాలు, ఇత‌ర ముఖ్య‌మైన సంస్థ‌లూ పెద్ద‌గా స్పందించ‌డం లేదు. ఏదో నామ్‌కే వాస్తేగా..ఒక‌టి రెండు ఖండ‌న‌లు ఇచ్చి చేతులు దులిపేసుకుంటు న్నాయి. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే..బిజెపి నాయ‌కుడిగా చెప్పుకునే సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఆశ్చ‌ర్య‌క‌రంగా వైకాపాను స‌మ‌ర్థిస్తూ సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారు. ఈయ‌న బిజెపి నాయ‌కుడా..కాదా..అనేది ప‌క్క‌న పెడితే..శ్రీ‌వారి ప‌విత్ర‌మైన ల‌డ్డూ విష‌యంలో..ఆయ‌న చేస్తోన్న అతి శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. జ‌గ‌న్‌ను ర‌క్షించ‌డానికి ఆయ‌న ఎంత దూర‌మైనా వెళ‌తార‌ని, గ‌తంలో కూడా ఆయ‌న అలానే వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తం మీద‌..ల‌డ్డూ క‌ల్తీ వివాదంలో బిజెపి అంటీ ముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు శ్రీ‌వారి భ‌క్తుల‌తో పాటు, సామాన్య ప్ర‌జ‌ల్లోనూ వ్య‌క్తం అవుతున్నాయి.  


(1)
(0)

Comments