విజ‌యానంద్‌కు ఇంత ప‌వ‌రా...!?

01, Mar 2026

ఆయ‌నో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. స‌హ‌జంగా అయితే..ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసి రిటైర్ అయ్యే వారికి మూడు నెల‌లు..లేదా ఆరు నెల‌ల పాటు పొడిగింపు ఇస్తుంటాయి ప్ర‌భుత్వాలు. చాలా రాష్ట్రాల్లో జ‌రిగేది ఇదే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే..ఇదో ఆన‌వాయితీగా వ‌స్తోంది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రెండు రాష్ట్రాల్లో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ దాదాపుగా స‌ర్వీసు పొడిగింపు వ‌చ్చింది. ఇటీవ‌ల కాలంలోనే. అంత‌కు ముందు..ఇంత విచ్చ‌ల విడిగా పొడిగింపులు చేసిన దాఖాలాలు లేవు. 2014-19 మ‌ధ్య చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి పొడిగింపు ఇవ్వాల‌ని కేంద్రానికి లేఖ రాస్తే..అప్ప‌ట్లో ప్ర‌ధాని మోడీ అందుకు ఒప్పుకోలేదు. పొడిగింపుల వ్యాపారం వ‌ద్ద‌ని ఆయ‌న ఖ‌రాఖండిగా చెప్పేశారు. అయితే..ఆయ‌న ఇక్క‌డో మాట‌..బిజెపి పాలిత రాష్ట్రాల‌కో విధంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే..త‌రువాత ఆంధ్రా, తెలంగాణ‌ల్లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి పొడిగింపుల‌నేవి ఒక ఆన‌వాయితీలా వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతానికి వ‌స్తే..ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న విజ‌యానంద్ కు సిఎస్‌గా స‌ర్వీసు పొడిగింపు వ‌చ్చింది. దాంతో పాటు జాక్‌పాట్‌లో మ‌రో రెండు ప‌ద‌వులు వ‌చ్చి ఆయ‌న వ‌ల్లో వాలిపోయాయి. నిన్న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రిటైర్ అయిన ఆయ‌న‌కు తేదీ మార‌కుండానే ప్ర‌భుత్వం రెండు పోస్టులు ఇచ్చేసింది. గ‌తంలో ఆయ‌న నిర్వ‌హిస్తోన్న ఇంధ‌న‌శాఖ‌ను అప్ప‌గిస్తూ ముఖ్య‌మంత్రి ఎక్స్ అఫిసియో స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీగా నియ‌మించారు. దీనితో పాటు ఇంధ‌న‌శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీగా, ఏపీ ట్రాన్స్ కో సిఎండిగా నియ‌మించారు. ఆయ‌న‌కు ఇచ్చిన పోస్టులు..రిటైర్ అయిన తేదీ మార‌కుండానే..ఆయ‌న‌కు ఇచ్చిన పోస్టులు చూసి ఐఏఎస్ వ‌ర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. విజ‌యానంద్‌కు ఇంత ప‌వ‌రా..? ఆయ‌న అంత శ‌క్తిమంతుడా..? ఆయ‌న వెనుక ఎవ‌రున్నారు..? గ‌తంలో..ఎవ‌రూ ఇంత ప‌వ‌ర్‌ను చూపించ‌లేదు..ఈయ‌నేమైనా...సూప‌ర్ ఐఏఎసా..? అంటూ ప్ర‌శ్నించుకుంటున్నారు. భార‌త‌దేశంలో ఇంత ప‌వ‌ర్‌పుల్ ఐఏఎస్ ఎవ‌రూ లేరేమో..? అంటూ..ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వుతున్నారు. సిఎం చంద్ర‌బాబుకు ఈయ‌న‌పై అంత న‌మ్మ‌కం ఏమిటో..? ఆయ‌న శ‌క్తి సామ‌ర్ధ్యాలపై అంత‌ట గురి ఏమిటో..అంటూ..గుస గుస‌లు పోతున్నారు. 


ఇంత‌టి శ‌క్తి ఎక్క‌డ నుంచి వ‌చ్చింది...?

వాస్త‌వానికి విజ‌యానంద్ ఇంధ‌న‌శాఖ‌ను ఉమ్మ‌డి రాష్ట్రం ఉన్న‌ప్ప‌టి నుంచీ నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌భుత్వాలు ఏవైనా..ఇంధ‌న‌శాఖ ఆయ‌న‌దే..?  ముఖ్య‌మంత్రులుగా చంద్ర‌బాబు ఉన్నా, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్నా, రోశ‌య్య ఉన్నా, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఉన్నా..రాష్ట్రం విడిపోయిన త‌రువాత మ‌ళ్లీ చంద్ర‌బాబు ఉన్నా..జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఉన్నా..మ‌ళ్లీ చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చినా ఇంధ‌న‌శాఖ ఆయ‌న‌దే...? ఈ శాఖ‌లో ఆయ‌న ప‌ట్టు చూసి సాటి ఐఏఎస్, ఆయ‌న‌తో స‌హ‌చ‌రులు విస్తుపోతున్నారు. ఇంత ప‌వ‌ర్ ఎక్క‌డ నుంచి వ‌చ్చింది ఆయ‌న‌కు  అంటూ ప్ర‌శ్న‌ల‌పై ప్ర‌శ్న‌లు వేసుకుంటున్నారు. ఇంధ‌న‌శాఖ‌లో జ‌రిగిన అవినీతిపై ఒక‌వైపు టిడిపికి మ‌ద్దతు ఇచ్చే కొంద‌రుమాజీ అధికారులు ప్ర‌శ్న‌ల‌పై ప్ర‌శ్న‌లు సంధిస్తున్నా..మీడియా క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నా...విజ‌యానంద్ ప‌వ‌ర్ మాత్రం త‌గ్గ‌డం లేదు. వేల కోట్లు అప్పులు తెస్తూ..విద్యుత్ ఛార్జీల‌తోప్ర‌జ‌లు న‌డ్డి విరుస్తున్నా..శాఖ‌లో ఆయ‌న హ‌వా మాత్రం ఇసుమం కూడా త‌గ్గ‌లేదు. పైగా రోజు రోజుకు మ‌రింత బ‌ల‌వంతుడు అవుతున్నారు. కేంద్రంలోని పెద్ద‌ల ఆశీస్సులు, ఇక్క‌డి పెద్ద‌ల ఆశీస్సులు, ఆశ్చ‌ర్య‌క‌రంగా ప్ర‌తిప‌క్ష‌నేత వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆశీస్సుల‌తోనే విజ‌యానంద్‌కు అంత శ‌క్తి వ‌చ్చింద‌ని ఆయ‌న వ్య‌తిరేకులు ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా వ్యాఖ్యానిస్తుంటారు. వీరంద‌రినీ సంతృప్తి ప‌రిచినందుకే ఆయ‌న రిటైర్ అయినా..మ‌ళ్లీ ఇన్ని పోస్టులు వ‌చ్చాయ‌నే ప్ర‌చారం స్వంత కూట‌మి పార్టీ నేత‌ల్లో ఉంది. విద్యుత్ మీట‌ర్ల‌ల్లో అవినీతి, విద్యుత్ ఒప్పందాల్లో జ‌రిగిన అవినీతిపై మాజీ ఐపిఎస్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ప‌దే ప‌దే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అయినా ప్ర‌భుత్వం ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. మొత్తం మీద‌..కేంద్ర పెద్ద‌ల ఆశీస్సులు, అధికార‌పార్టీ పెద్ద‌ల ఆశీస్సులు, ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆశీస్సులు ఉండడ‌మే విజ‌యానంద్ ప‌వ‌ర్ అని..రాజ‌కీయ‌ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌తి చిన్న విష‌యానికి నానా యాగీ చేసే సాక్షి ప‌త్రిక కూడా విజ‌యానంద్ విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం..వింత‌లో కెల్లా వింతా...? అంతా ప‌వ‌ర్ మ‌హిమ‌.



మౌనంగా నిష్క్ర‌మించిన ర‌విచంద్ర‌...!

చాలా ఆశ్చ‌ర్య‌క‌రంగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి ర‌విచంద్ర‌ను త‌ప్పించేశారు. ఆయ‌న‌ను అక్క‌డ నుంచి త‌ప్పిస్తార‌ని చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్నా..అది నిన్న‌టికి వాస్త‌వరూపం దాల్చింది. వాస్త‌వానికి కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ర‌విచంద్ర‌ను త‌న కార్యాల‌య ఇన్‌ఛార్జిగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు నియ‌మించుకున్నారు. ర‌విచంద్ర నియామ‌కంపై అప్ప‌ట్లో అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అయితే..రాను రాను..ఆయ‌న‌పై ఓ మీడియా సంస్థ,కొన్ని వ‌ర్గాలు వ్య‌తిరేకత‌ను వ్య‌క్తం చేస్తూ వ‌చ్చాయి. ఓ మీడియా సంస్థ అయితే..మొద‌టి పేజీలో వ్య‌తిరేక వార్త‌ను ప్ర‌చురించింది. అప్ప‌ట్లో ఆ వార్త వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న‌ను చంద్ర‌బాబు త‌ప్పిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగినా..అది నిజం కాలేదు. అయితే..త‌రువాత కాలంలో మాత్రం ప‌దే ప‌దే ఆయ‌న‌ను త‌ప్పిస్తార‌ని మీడియా వ‌ర్గాలు ప్ర‌చారం చేశాయి.అధికార కూట‌మిలో ప్ర‌ధాన భాగ‌స్వామి అయిన సామాజిక‌వ‌ర్గానికి ఆయ‌న వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. దీంతో..ఆయ‌న‌ను త‌ప్పిస్తార‌ని అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన సోష‌ల్ మీడియా సంస్థ‌లు ప్ర‌చారం చేశాయి. అయితే...ఆచితూచి వ్య‌వ‌హ‌రించే చంద్ర‌బాబు దాదాపు ఏడాది త‌రువాత ఆయ‌న‌ను ముందు టీటీడీ ఇన్‌ఛార్జిగా నియ‌మించి, త‌రువాత సిఎంఓ నుంచి త‌ప్పించారు. బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ర‌విచంద్ర‌ను ఆయ‌నే పిలిపించుకుని..ప‌ద‌వి అప్ప‌గించి..ఇప్పుడు త‌ప్పించిన వైనంపై ఎక్క‌డా ఎటువంటి నిర‌స‌న‌లు వ్య‌క్తం కావ‌డం లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌ల్గిస్తోంది. మొత్తం మీద‌..సిఎంఓ నుంచి ర‌విచంద్ర మౌనంగా నిష్క్ర‌మించ‌డం ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు విస్మ‌యాన్ని క‌ల్గిస్తోంది. వాస్త‌వానికి ఆయ‌న‌ను అక్క‌డ నుంచి త‌ప్పిస్తే..బీసీ వ‌ర్గాలు ఉద్య‌మిస్తాయోమో అనే భావ‌న వారిలో ఉండేది. అయితే..వారి నుంచి ఎటువంటి స్పంద‌న రాలేదు. కాగా..త‌న‌ను ఎక్క‌డ నియ‌మించినా..త‌న ప‌ని తాను చేసుకుంటాన‌ని ర‌విచంద్ర త‌న స‌న్నిహితుల‌తో గ‌తంలోనే వ్యాఖ్యానించారు. అందుకే..ఈ మౌన నిష్క్ర‌మ‌న కాబోలు. 


(0)
(0)

Comments