ఉగాదికి మంత్రివర్గ విస్తరణ....!
కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం కూటమి నేతల్లో ఉంది. అధికారికంగా దీనిపై ఎటువంటి వార్తలు లేకపోయినా...సోషల్ మీడియాలో, రాజకీయవర్గాల్లో ఈ చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపిలు కలసి బ్రహ్మాండమైన మెజార్టీతో అప్పట్లో బలంగా ఉన్న వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించాయి. కూటమి నేతలైన చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్‌లు ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారితో పాటు, జనసేనకు చెందిన ఇద్దరు, బిజెపి నుంచి ఒకరు, మిగతా వాళ్లు టిడిపి నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ మంత్రివర్గంలో ఎటువంటి మార్పులు చేయలేదు. కొందరు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు కూడా మంత్రి పదవిని పొందరు. అయితే..దాదాపు రెండేళ్లు కావస్తున్నా..కొందరు మంత్రులు అనుకున్న విధంగా పనిచేయడం లేదని, మరి కొందరు అవినీతి, అసమర్థతతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు మంత్రుల పనితీరు నాసిరకంగా, అసమర్థంగా, అవినీతి వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నరీతిలో దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎవరెవరిపై వేటు....!
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో అవినీతి ఆరోపణలు కొంతమందిపై ఉన్నా, మరి కొందరిపై మాత్రం అసమర్థత ముద్ర పడింది. దీంతో..అవినీతి, అసమర్థత ఉన్న మంత్రులను తొలగిస్తారనే ప్రచారం ఉంది. అయితే..ఎవరెవరిపై వేటు పడుతుందో ఇప్పటికిప్పుడే తెలియదు. ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ..కొందరినైతే మంత్రివర్గ విస్తరణలో తొలగిస్తారనే ప్రచారం ఉంది. భారీగా మంత్రివర్గంలో మార్పులు ఉంటాయంటున్నారు. దాదాపు 10 మందిని మంత్రివర్గం నుంచి తొలగిస్తారని అంటున్నారు. వీరిలో జనసేన నుంచి ఒకరు ఉంటారని, మిగతా వారంతా టిడిపికి చెందిన వారనే ప్రచారం ఉంది. కులాల లెక్కలను వేసుకుని కొందరు అసమర్థులు, అవినీతి మచ్చ పడిన వారు ఉన్నా..వారిని కొనసాగిస్తారంటున్నారు. ముఖ్యంగా రాయలసీమకు చెందిన మంత్రుల్లో ఒకరిని ఖచ్చితంగా తొలగిస్తారంటున్నారు. అదే విధంగా అదే ప్రాంతానికి చెందిన మహిళా మంత్రిని కూడా తొలగిస్తారనే ప్రచారం ఉంది. ఇక మైనార్టీ వర్గానికి చెందిన మంత్రిని కూడా తొలగిస్తారని, ఆయన స్థానంలో యువ మైనార్టీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం ఉంది. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందిన మరో సీనియర్ నేతను తొలగిస్తారని, ఆయన స్థానంలో యువ మహిళా నేతకు అవకాశం వస్తోందంటున్నారు. మరోవైపు రాజకీయచైతన్యానికి మారుపేరైన అమరావతి ప్రాంతంలోని ఇద్దరు బీసీ మంత్రులను తొలగిస్తారంటున్నారు. వీరిలో ఒకరిపై అవినీతి, మరొకరిపై అసమర్థత అనే ముద్రపడింది. దీంతో ఈ ప్రాంతంలో ఈ ఇద్దరిని తీస్తే..అదే సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తారా..? లేక టిడిపికి అనాదిగా అండగా ఉంటోన్న సామాజికవర్గానికి మంత్రి పదవి ఇస్తారా..? చూడాలి. అదే విధంగా గోదావరి జిల్లాలకు చెందిన యువ మంత్రితో పాటు, ఉత్తరాంధ్రాకు చెందిన మరో యువ మంత్రిని కూడా తొలగిస్తారంటున్నారు. అయితే..ఉత్తరాంధ్ర యువ మంత్రిని అంత తేలిగ్గా తొలగించరని, ఆయనపై ఎటువంటి ఆరోపణలు లేవని, అయితే...ఆయన దూకుడుగా వెళ్లడం లేదనే భావన ఉంది. ఇటీవల కాలంలో ఆయన కొంత వరకూ సరిదిద్దుకున్నారని, ఈ పరిస్థితుల్లో ఆయనను తొలగించరంటున్నారు. కాగా..ఉత్తరాంధ్రకు చెందిన మరో సీనియర్‌ను తొలగిస్తారంటున్నారు. అది నిజంగా జరిగితే..సంచలనమే. కాగా మరో మహిళా మంత్రిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆమెను తొలగిస్తారనే ప్రచారం ఉంది. అయితే.. కులాలను లెక్కలోకి తీసుకుంటే..ఆమెను తొలగించరని అంటున్నారు. వీరు కాకుండా మరి కొందరు మంత్రుల శాఖలను మారుస్తారనే ప్రచారం ఉంది.
నూతనంగా ఎవరెవరికి చోటు....!
కాగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరిగితే..ఎవరెవరికి అవకాశాలు ఉంటాయనే దానిపై రసవత్తరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గంలో కడప నుంచి ఓ మహిళకు అవకాశం ఉంటుందంటున్నారు. అదే నిజమైతే..నెల్లూరుకు చెందిన మహిళా ఎమ్మెల్యేకు అవకాశాలు లేనట్లే. అయితే..నెల్లూరు జిల్లా మహిళా ఎమ్మెల్యే మంత్రి లోకేష్ టీమ్‌లో కీలకంగా ఉంటున్నారు. నెల్లూరు మొత్తాన్ని రాజకీయంగా శాసించే ఆ కుటుంబానికే అవకాశం ఉంటుందంటున్నారు. కాగా..టిడిపిని ఆది నుంచి బలపరిచే సామాజికవర్గానికి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదు. కాగా...రాజధాని ప్రాంతంలో మరోసారి బీసీలకు పెద్దపీట వేస్తారంటున్నారు. గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గానికి చెందిన వారికి మరొకరికి అవకాశం దక్కవచ్చు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలో చాలా మంది మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు టిడిపికి అనాదిగా అండగా ఉంటోన్న సామాజికవర్గంలో మంత్రి పదవి కోసం పోటీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఆ సామాజికవర్గంలో మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే..ఇప్పటికే..ఈ జిల్లాల నుంచి మంత్రి లోకేష్, నాదెండ్ల మనోహర్ ఉండడంతో..మరొకరికి అవకాశాలు దక్కే సూచనలు కనిపించడం లేదు. మొత్తం మీద.. మంత్రివర్గ విస్తరణ జరిగితే భారీగా జరుగుతుందా..? లేక చిన్న చిన్న మార్పులు జరుగుతాయా..? అనేది చూడాలి. రెండేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ అంటే.. భారీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో?