బిజెపిలోకి దూకే టైమొచ్చింది...!?
మద్యం కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ఒక పద్దతి ప్రకారం అరెస్టు చేసుకుంటూ వస్తోంది. చివరకు ఇప్పుడు అసలు బాస్ దగ్గరకు వచ్చేసింది. దీంతో..ఇన్నాళ్లూ ఈ కేసులో ఏమీ కాదని, తమను ఏవరూ ఏమీ చేయలేరని ధీమాగా ఉన్న వైకాపా నేతల గుండెల్లో గుబులు రేగుతోంది. మద్యం కేసు అంటూ కూటమి ప్రభుత్వం హడావుడి చేస్తోంది తప్ప..వాళ్లు ఏమీ చేయలేరని, ఎవరినీ అరెస్టులు చేయలేరని వారు భావించారు. అయితే..అప్పటి ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని, పిఎస్‌గా చేసిన వ్యక్తిని అరెస్టు చేయడంతో కొద్దిగా కేసులో కదలిక వచ్చింది. అయితే దీనికి కూడా వారేమీ బెదిరిపోలేదు. తమ బాస్ తమను కాపాడతాడని, ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చి కేసును ముందుకు వెళ్లనీయరని నమ్మకంతో ఉన్నారు. అయితే ఇప్పుడా నమ్మకం సడలుతోంది. నిన్న ఈ కేసులో రాజంపేట ఎంపి, వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిధున్‌రెడ్డిని సిట్ అరెస్టు చేయడం వైకాపా నేతల్లో కలవరాన్ని కల్గించింది. జగన్మోహన్‌రెడ్డికి ఎంతో సన్నిహితుడైన మిధున్‌రెడ్డిని అరెస్టు చేయరని, బిజెపి పెద్దలతో జగన్ మాట్లాడి ఉంటారని, ఆయనను ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయనీయరని, వారు అంచనా వేశారు. నిన్న సిట్ ముందు హాజరైన మిధున్‌రెడ్డి, ఆయన అనుచరుల్లో కూడా ఇదే విధమైన ధీమా ఉంది. కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్ మిధున్‌రెడ్డిని అరెస్టు చేయరని, చంద్రబాబుకు సత్తా లేదని, ఆయన మిధున్‌రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమ్మక్కు అయ్యారంటూ..ఒకటే వార్తలు చదివాయి. కుమ్మక్కు రాజకీయాలంటూ..యూట్యూబ్ ఛానెల్స్ ఒకటే ఘోషించాయి. అయితే..వాళ్లనుకున్నదేమీ జరగలేదు. సిట్ తమ పద్దతి ప్రకారం మిధున్‌రెడ్డిని అరెస్టు చేసింది. దీంతో..ఒక్కసారిగా వైకాపా నేతలతో పాటు, ఇతర వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. తన కుడిభుజమైన మిధున్‌రెడ్డి అరెస్టును జగన్ ఆపలేకపోయాడని, ఆయనకు ఢిల్లీలో పరపతి లేదని దీనితో తేలిపోయిందనే అభిప్రాయాలను వారు ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ జగన్ తమను రక్షిస్తాడని, ఈ కేసుల్లో ఏమీ కాదనే భరోసాతో ఉన్నవైకాపా నాయకులంతా ఇప్పుడు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లూ వాళ్లు జగన్‌ను నమ్ముకుని కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా స్థిమితంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మిధున్‌రెడ్డి అరెస్టుతో జగన్ తమను అరెస్టుల నుంచి, కేసుల నుంచి కాపాడలేరనే అంచనాకు వచ్చారు.
వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైకాపా నుంచి పెద్ద ఎత్తున నాయకులు ఇతర పార్టీలకు వలసవెళ్లారు. అయితే కొంత మంది మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అయితే ఈ ఏడాదిలో కూటమి అంత దూకుడుగా వెళ్లకపోవడంతో చంద్రబాబు, లోకేష్‌లు తమను ఏమీ చేయరని, ఒకవేళ్ ఏదైనా జరిగినా..జగన్ చూసుకుంటారనే భావనతో ఉండేవారు. ఇప్పుడు అది వమ్ము అవడంతో..తమను రక్షించేది ఒక్క బిజెపినే అని..ఇప్పుడా పార్టీ వంక చూస్తున్నారు. ఇందులో ముందు వరసలో ఉంది చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే. వైకాపా చిత్తుగా ఓడిపోయిన తరువాత ఆయన బిజెపిలోకి వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లు ఆగుదాం..అప్పటికీ ఇక్కడ పరిస్థితులు మారకపోతే..పోదామనే ఆలోచనతో ఆగిపోయారు. అయితే..ఇప్పుడు తన స్వంత కొడుకు అరెస్టు కావడంతో..ఇక ఆయనకు వేరే దారి లేదు. జగన్‌తో ఉంటే ఇబ్బందులు తప్పవని, కేసులు, జైళ్లు తప్పవనే భావనతో ఇప్పుడు బిజెపిలో దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తననూ నేడో..రేపో అరెస్టు చేస్తారనే భయంతో ఆయన బిజెపి మంత్రం పఠిస్తున్నారు. ఈయనొక్కరే కాదు..వైకాపా పాలనాకాలంలో అక్రమంగా, అన్యాయంగా దోపిడీకి పాల్పడిన వైకాపా నేతలంతా ఇప్పుడు బిజెపి వైపు క్యూ కట్టబోతున్నారు. మద్యం కేసులో జగన్ కనుక అరెస్టు అయితే ఈ క్యూ మరింత పెరిగిపోతుంది. మొత్తం మీద...మద్యం కేసు వల్ల మిధున్‌రెడ్డి కుటుంబం వైకాపాను వీడి బిజెపిలోకి జంప్ కానుంది. రాయలసీమలో బలపడాలని ఎన్నాళ్లగానో యత్నిస్తోన్న బిజెపికి ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబంతో సాధ్యం కాబోతోంది. ఇన్నాళ్లూ టిడిపి బలహీనపడితే..ఆ ప్లేస్‌లోకి రావాలనుకున్న బిజెపి ఇప్పుడు రూట్ మార్చి వైకాపాను బలహీనం చేసి..ఆ ప్లేస్‌లోకి రావాలనే ఆలోచన చేస్తోందని సంకేతాలు వెలువడుతున్నాయి.