Politics Crime Education Entertainment Health Sports
Breaking:

శరీరంలో ఆమ్ల-క్షార అసమతుల్యతను వైద్యులు గుర్తించాలిః డాక్ట‌ర్ కె. ఉద‌య్‌కుమార్‌

గుంటూరు : మన శరీరంలో ఆమ్ల-క్షార సమతుల్యతలో అనేక వ్యాధులలో అసమతుల్యత వస్తుందని, దీనిని తొలి దశలోనే గుర్తించి సత్వర చికిత్స చేయడం ద్వారా ప్రాణాపాయం నుండి రోగిని కాపాడవచ్చునని కాటూరి మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ కె. ఉదయ్ కుమార్ అన్నారు. ఐఎంఏ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ సంస్థ సహకారంతో వైద్యులకు నిర్వహించిన నిరంతర వైద్య విద్యా కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ కుమార్ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. సభకు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు  డాక్టర్ టి.సేవకుమార్ అధ్యక్షత వహించారు. డాక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ శరీరంలో ఆమ్ల-క్షార సమతుల్యతలో అసాధారణతులను గుర్తించేందుకు ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలసిస్( ఏబిజి విశ్లేషణ)పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఈ పరీక్షలో రక్తంలోని పీహెచ్ ను, ఆక్సిజన్, కార్బన్డయాక్సైడ్, బై కార్బోనేట్ పరిమాణాలను గుర్తించడం జరుగుతుందన్నారు. ఇవి యాసిడ్ బేస్ బ్యాలెన్స్ లో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. శ్వాస సంబంధ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, సెప్సిస్, డయాబెటిక్ కీటో ఎసిడోసిస్, జీర్ణాశయ వ్యాధులు, ఆస్తమా, పాయిజనింగ్ తదితర వ్యాధులలో ఆమ్ల-క్షార సమతుల్యతలో అసాధారణ మార్పులు వస్తాయని తెలిపారు. రక్త పరీక్షల ద్వారా ఈ అసాధారణ మార్పులను గుర్తించి చికిత్స చేయడం ద్వారా బాధితులను త్వరగా కోలుకునేలా చేయవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ వై.విశ్వ జ్యోతి మాట్లాడుతూ నేడు చాలా సులభంగా ఆమ్ల-క్షార అసమానతలను గుర్తించే పరీక్షలు అందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆమ్ల-క్షార అసమతుల్యతతో వచ్చిన అనేకమంది బాధితులలో కారణాలను, నిర్ధారణ పరీక్షలు, చికిత్స విధానాలపై వైద్యులతో చర్చించారు. ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ టి.సేవ కుమార్ మాట్లాడుతూ నేటి ఆధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స విధానాలను వైద్యులందరూ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఐఎంఏ ఈ నిరంతర వైద్య విద్య కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యదర్శి డాక్టర్ బి. సాయికృష్ణ మాట్లాడుతూ వైద్యులు ఆమ్ల-క్షార అసమానతల విషయంలో సంపూర్ణ అవగాహనతో ఉన్నప్పుడే రోగికి సమర్థవంతమైన చికిత్స అందించగలుగుతారన్నారు. నూతనంగా వైద్య వృత్తిలోకి ప్రవేశించే వైద్యులందరూ ఐఎంఏ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. జాతీయ ఐఎంఏ ఈ నెలాఖరి వరకు సభ్యత్వ రుసుంలో భారీగా రాయితీ ఇవ్వడం జరిగిందన్నారు. అలానే మన రాష్ట్రంలో ఐఎంఏ వైద్యులకు అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని, వాటిని కూడా వైద్యులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు ఐఎంఏ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్ నాగేళ్ల కిషోర్, డాక్టర్ బి. బి.అప్పారావు, డాక్టర్ ఆదంఖాన్ తదితరులు పాల్గొన్నారు.