భాష ఆధారిత హింసను స‌హించం: సీఎం ఫడ్నవిస్

25, Jul 2025

భాష పేరుతో జరిగే హింసను సహించబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హెచ్చరించారు. "మరాఠీ భాషపై గర్వంగా ఉండొచ్చు. కానీ మరాఠీ మాట్లాడలేదని లేదా తెలియదని ఇతరులపై దాడి చేయడాన్ని సహించం. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు," అని ఆయన స్పష్టం చేశారు.ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో (JNU) ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు మీద ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ స్టడీస్ పునాదిరాయి కార్యక్రమం, మరియు మరాఠీ భాషా అధ్యయనాల కోసం ఏర్పాటైన కుసుమాగ్రజ్ చైర్ ప్రారంభ వేడుక సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.మరాఠీ భాష ప్రాచీనమైనదని పేర్కొన్న ఫడ్నవిస్, "మరాఠీ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా రావడానికి ప్రధాని మోదీకి మా విన్నపంతోనే సాధ్యమైంది. మరాఠీపై గర్వం సహజం. కానీ దాని పేరుతో హింస అనేది అసహ్యకరమైనది. అటువంటి చర్యలు తీసుకునే వారిపై కఠినంగా చట్టపరంగా వ్యవహరిస్తాం," అని హెచ్చరించారు. భారతదేశానికి, ముఖ్యంగా నాటకరంగానికి మరాఠీ భాష చేసిన సేవలు ఎంతో గొప్పవని ఆయన పేర్కొన్నారు. "దేశవ్యాప్తంగా థియేటర్‌కి ప్రాణం పోసిన భాష ఏదైనా ఉందంటే, అది మరాఠీయే," అని అన్నారు. మరాఠీ భాషపై పరిశోధన, విద్యా అధ్యయనాలు జరిగేందుకు JNUలో ఏర్పాటు చేసిన కుసుమాగ్రజ్ చైర్ కీలకంగా నిలుస్తుందని ఫడ్నవిస్ తెలిపారు. భారతదేశంలోని ప్రతి భాషను గౌరవించడం అవసరమని కూడా ఆయన గుర్తుచేశారు. "ప్రతి పౌరుడు తన తల్లి భాషపై గర్వపడాలి. అదే సమయంలో ఇతర భారతీయ భాషలను గౌరవించడమూ మన బాధ్యత. మనం ఆంగ్లాన్ని తేలికగా స్వీకరిస్తాం, కానీ మన స్థానిక భాషలను నిర్లక్ష్యం చేస్తాం — ఇది సరైంది కాదు," అని ఫడ్నవిస్ అన్నారు.


(0)
(0)

Comments