గ్రౌండ్స్‌మ‌న్‌తో గంభీర్ వాగ్వాదం....!

29, Jul 2025

ఓవల్ వేదికగా జరిగే చివరి టెస్ట్‌కు ముందు భారత జట్టు సిద్ధంగా ఉండే వేళ, కోచ్ గౌతమ్ గంభీర్ స్థానిక గ్రౌండ్స్‌మన్ లీ ఫార్టిస్‌తో తీవ్ర వాగ్వాదంలో తలపడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం జరిగిన ఐచ్చిక ప్రాక్టీస్ సమయంలో జరిగింది. సాధారణంగా జరిగే సాధన శిబిరం ఓ ఉద్విగ్న మలుపు తీసుకుంది. ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్న ప్రకారం, గంభీర్ ఫార్టిస్‌పై వేలిచూపుతూ గట్టిగా వాదిస్తున్నట్లు కనిపించాడని తెలిపారు. ఈ వాగ్వాదం ప్రధానంగా భారత్ జట్టు ప్రాక్టీస్ కోసం మైదానంలోని ప్రధాన పిచ్ చుట్టూ వినియోగంపై అభ్యంతరాల నుంచి ప్రారంభమైంది. పిచ్‌లను రక్షించడంలో గ్రౌండ్స్‌మన్లు సాధారణంగా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పైగా సెప్టెంబరు ప్రారంభం వరకు ఈ మైదానంలో డొమెస్టిక్ మ్యాచులు జరగనుండడంతో ఫార్టిస్ పిచ్ చుట్టూ ట్రాఫిక్ తగ్గించాలను కున్నట్లు సమాచారం. భారత అసిస్టెంట్ కోచ్ సితాంశు కోటక్ ఈ ఘటనపై స్పందిస్తూ మైదానంలో ఉద్రిక్తత నెలకొందని చెప్పారు. “మేమంతా స్పైక్స్ కూడా లేకుండా జాగర్త‌తో ఉన్నాం. అయినా పిచ్ దగ్గరకు 2.5 మీటర్ల దూరం ఉండాలని చెప్పారు. అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది,” అని అన్నారు. కోటక్ గంభీర్-ఫార్టిస్ వాగ్వాదంపై నేరుగా స్పందించకపోయినా, జట్టు ప్రవర్తనను సమర్థించారు. “మేము కేవలం వికెట్‌ను పరిశీలించాం, రబ్బర్ స్పైక్స్‌తో ఉన్నాం. అందులో తప్పేముంది? క్యూబేటర్లు కూడా మాట్లాడే ముందు వాళ్లెవరో తెలుసుకోవాలి. వాళ్లు అత్యంత నిపుణులైనవారు,” అని అన్నారు. అలాగే, ఈ ఘర్షణకు కారణం సంభాషణ తీరులోనే ఉందేమో అని ఆయన సూచించారు. “మీరు పిచ్‌ను సంరక్షించవచ్చు. కానీ చివరికి ఇది క్రికెట్ పిచ్‌గానే ఉంటది, పురావస్తు వస్తువు కాదు. రబ్బర్ స్పైక్స్‌తో మేము అక్కడ నిల్చున్నాం. రేపే మ్యాచ్. బ్యాట్స్‌మెన్ డైవ్ చేస్తారు, బౌలర్లు బాల్‌ను ఆపేందుకు జారుతారు. ఆయన చెబుతున్నదంతా మేము తక్కువ గడ్డి ఉన్న పిచ్‌కు గడ్డి పెంచేందుకు ప్రయత్నిస్తున్నామా అని అనిపిస్తుంది. ఒకరోజులో ఎంత గడ్డి పెరుగుతుంది?” అని వ్యాఖ్యానించారు. మ్యాన్చెస్టర్‌లో అద్భుతమైన డ్రా తర్వాత భారత్ ఉత్సాహంగా లండన్ చేరింది. కానీ ఈ సంఘటన, జట్టు చివరి టెస్ట్‌కి ముందు దృష్టిని మరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో ఉంది. నిర్ణాయక టెస్ట్ జూలై 31న ది ఓవల్‌ వేదికగా ప్రారంభం కానుంది.


(0)
(0)

Comments