కూట‌మిపై వ్య‌తిరేక‌త ఎందుకు...!?

10, Aug 2025

ఏడాదిన్న‌ర క్రితం బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వంపై  ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త నెల‌కొందా..?  ప్ర‌జ‌లు, కూట‌మి కార్య‌క‌ర్త‌లు..ప్ర‌స్తుత పాల‌న‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారా..? ఈ ప్ర‌భుత్వం తాము అనుకున్న‌విధంగా ప‌నిచేయ‌డం లేద‌ని భావిస్తున్నారా..? అంటే ఇప్పుడే దీనిపై స్ప‌ష్ట‌మైన అభిప్రాయాన్ని చెప్ప‌లేం. అయితే కూట‌మికి ఓటేసిన‌వ‌ర్గాలు, ఉద్యోగులు, ఒక‌వ‌ర్గం ప్ర‌జ‌లు మాత్రం కూట‌మిపాల‌న‌పై అస‌హ‌నాన్ని, అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నాయి. ఒక‌వైపు కూట‌మి హామీ ఇచ్చిన‌ట్లుగానే సంక్షేమాన్ని, అభివృద్దిని స‌మాంత‌రంగా ముందుకు తీసుకెళుతోంది. దీనిపై ఎవ‌రికీ ఎటువంటి ఆక్షేప‌ణ‌లు లేవు. కూట‌మి ఇచ్చిన సంక్షేమ ప‌థ‌కాల‌ను దాదాపు ఏడాదిలోనే అమ‌లులోకి తెచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే సామాజిక పింఛ‌న్ల‌ను ఒకేసారి వెయ్యిరూపాలు పెంచి నాలుగువేలు చేశారు. వైకాపా హ‌యాంలో వెయ్యి రూపాయ‌లు పెంచ‌డానికి దాదాపు ఐదేళ్లు ప‌ట్టింది. మ‌రి అటువంటిది ఒకే రోజు వెయ్యి రూపాయ‌లు పెంచేసి..గ‌త ఏడాదిన్న‌ర‌గా అమ‌లు చేస్తూనే ఉన్నారు. మ‌రోవైపు త‌ల్లికివంద‌నం అంటూ..ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికి రూ.13వేల చొప్పున పంచేశారు. గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రైతుల‌కు రైతు సుఖీభ‌వ ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు. మ‌రోవైపు మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం 15వ తేదీ నుంచి అమ‌లులోకి వ‌స్తోంది. ఇలా సూప‌ర్ సిక్స్ కింద ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చిన‌ట్లే (ఒకే ఒక్క ప‌థ‌కం..అది..మ‌హిళ‌ల‌కు రూ.1500/- ఇంకా ప్రారంభించ‌లేదు) ఒక‌వైపు సంక్షేమం అమ‌లు చేస్తూనే మ‌రోవైపు అభివృద్ది కోసం చేయాల్సింద‌ల్లా చేస్తున్నారు. నిరుద్యోగులు ఎంత‌గానో ఎదురుచూసిన డిఎస్సీ నిర్వ‌హించి నేడో రేపో అపాయింట్‌మెంట్ లెట‌ర్లు ఇవ్వ‌బోతున్నారు. మ‌రి కొన్ని ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌డానికి నోటిఫికేషన్లు వెలువ‌రించారు. ఇక అమ‌రావ‌తి, పోల‌వ‌రం, విమానాశ్ర‌యాలు, నౌకాశ్ర‌యాలు, వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి వంటివి చ‌క‌చ‌కా చేసుకుంటూ పోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాడ‌పోయిన రోడ్ల‌న్న‌టినీ...బాగు చేసి..మ‌ళ్లీ కొత్త రోడ్లు వేస్తున్నారు. పేద‌రిక నిర్మూల‌న‌కు పి4 అంటూ కొత్త ప‌థ‌కాన్ని తెచ్చి..అమ‌లు చేయ‌బోతున్నారు. ఇలా ఎటువైపు చూసినా..అన్నీ స‌వ్యంగానే జ‌రుగుతున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. కానీ..ఏదో లోపం క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వానికి రావాల్సిన మైలేజ్ మాత్రం రావ‌డం లేదు. వేల కోట్లు గుమ్మ‌రిస్తున్నా..ఎందుకు ప్ర‌జ‌ల్లో అసంతృప్తి నెల‌కొందో...? అనే దానిపై పాల‌కుల‌కు అర్థం కావ‌డం లేదు.

ఎందుకు అసంతృప్తి/అస‌హ‌నం...!?

గ‌త ప్ర‌భుత్వం కంటే మెరుగ్గానే సంక్షేమాన్ని అందిస్తున్నా, అభివృద్ది చేస్తున్నా..ప్ర‌స్తుత కూట‌మి పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఏర్ప‌డ‌డానికి కార‌ణం ఏమిటి..? అంటే ప్ర‌ధాన కార‌ణం.. కూట‌మి గెలుపుకు కార‌ణ‌మైన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఈ పాల‌న‌లో భాగ‌స్వామ్యం లేక‌పోవడం, వారు ఆశించిన స్థాయిలో ల‌బ్ది చేకూర‌క‌పోవ‌డ‌మే కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ఈ ప్ర‌భుత్వం మ‌న‌ది...? అని చెప్పుకునే వారికి మేలు జ‌ర‌గ‌క‌పోవ‌డం..అన్నీ ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయాచితంగా ల‌భించ‌డం కార‌ణం కావ‌చ్చు. ముఖ్యంగా సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఉన్న ల‌బ్దిదారుల‌కే మ‌ళ్లీ చేర‌డం..ప్ర‌భుత్వం తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌వ‌ల్ల మ‌ళ్లీ వాళ్లే లాభ‌ప‌డ‌డం, త‌మ‌కు ఏమీ ల‌భించ‌క‌పోవ‌డంతోనే వారు..అసంతృప్తి అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. ఏడాదిన్న‌ర నుంచి  కూట‌మికి ఓటేసిన వారికి క‌నీసం ఒక పెన్ష‌న్ కూడా ఇవ్వ‌లేక‌పోతే...వాళ్లు అసంతృప్తికి గుర‌వ‌రా..? ఇప్పుడూ వాళ్లే..అప్పుడూ వాళ్లే..మాకేమి ల‌బ్ది జ‌రిగింద‌ని వాళ్లు అంటే దానికి బాధ్యులు ఎవ‌రు..? ఒక రేష‌న్‌కార్డు ఇవ్వ‌లేరు...? ఇక కొత్త పెన్ష‌న్ మంజూరు చేయ‌లేరు..? ఒక ప‌థ‌కం ల‌బ్దిని వాళ్ల‌కు ఇప్పించ‌లేరు..? మ‌రి ఎందుకీ ప్ర‌భుత్వం...? అందేకేనా..అంత క‌ష్ట‌ప‌డి వైకాపా అరాచ‌కాలకు ఎదురొడ్డి పోరాడి ఓటేసింది..? అంటూ వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. అదే విధంగా ఒక కాంట్రాక్టు ప‌నిచేసుకోలేక‌పోతున్నాం...ఒక బిల్లు మంజూరు చేయించుకోలేక‌పోతున్నాం...ఇంకెందుకు ప్ర‌భుత్వం...అంతా మ‌ళ్లీ వైకాపా వాళ్ల  హ‌వానే..ఇందుకేనా..కూట‌మిని గెలిపించింది..అనే అసంతృప్తి వారిలో వ్య‌క్తం అవుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నెల‌కొంది.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వం ఒంటెత్తు పోక‌డ‌లు పోతోంద‌ని, వాళ్లు చేయాల‌న‌కున్న‌దే చేస్తున్నార‌నే భావ‌న‌, త‌మ‌ను భాగ‌స్వామ్యం చేయ‌క‌పోవ‌డంతో వాళ్లు నిరాశ‌, అసంతృప్తి, అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

చంద్ర‌బాబు, లోకేష్‌ల‌పై అసంతృప్తి...!

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డానికి ప్ర‌ధాన‌కార‌ణ‌మైన వ‌ర్గాలు చంద్ర‌బాబు, లోకేష్‌ల‌పై తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అవిచేస్తాం..ఇవి చేస్తామ‌ని బీరాలు ప‌లికి చివ‌రికి తుస్సు మంటున్నార‌నే అసంతృప్తి వారిలో రోజు రోజుకు పెరిగిపోతోంది. క‌నీసం త‌మ‌ను క‌ల‌వ‌డానికి కూడా వారు ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం, కార్పొరేట్ శ‌క్తుల‌కే ప్రాధాన్య‌త ఇస్తూ జెండా మోసిన వారిని ప‌క్క‌న పెట్ట‌డ‌మే ఈ అసంతృప్తికి ప్ర‌ధాన కార‌ణం. గెల‌వ‌క ముందు ఒక మాట‌..గెలిచిన త‌రువాత ఒక మాట అన్న‌ట్లుంది వారి వ్య‌వ‌హార‌శైలి. వీరికి తోడు మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి, అరాచ‌క వ్య‌వ‌హారాలు స్వంత పార్టీ నేత‌ల‌నే దోచుకుంటోన్న వైనాలు...మ‌రో కార‌ణం. నియోజ‌క‌వ‌ర్గస్థాయిలో ఎమ్మెల్యేల వ్య‌వ‌హారాలు స్వంత పార్టీ నేత‌ల‌నే ఇబ్బందులు పెడుతున్నాయి. 

ఉద్యోగుల్లో పెరుగుతోన్న అస‌హ‌నం...!

గ‌త వైకాపా పాల‌న‌లో తీవ్ర‌మైన అవ‌మానాల‌కు గురైన ఉద్యోగుల్లో ఇప్పుడిప్పుడే ఈ ప్ర‌భుత్వంపై కూడా అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. జీతాలు మొద‌టి తారీఖునే ఇస్తున్నార‌నే ఒకే ఒక్కటి త‌ప్ప మిగ‌తా స‌మ‌స్య‌ల‌న్నీ అలానే ఉన్నాయంటున్నారు. అప్పుడూ జీతాలు ఏదో ఒక తేదీన ఇచ్చారు..ఇప్పుడు కూడా ఇస్తున్నారు..కానీ మా స‌మ‌స్య‌ల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే అసంతృప్తి వారిలో ఉంది. ఇవ్వాల్సిన బ‌కాయిలు పేర‌పెడుతున్నారు త‌ప్ప ఒక్క‌టీ ఇవ్వ‌లేదంటున్నారు.  ఎవ‌రికి వారు నిస్తేజంగా ప‌నిచేస్తున్నారు త‌ప్ప‌..ఇది మ‌న ప్ర‌భుత్వం..మ‌ళ్లీ మ‌నం గెల‌వాల‌నే క‌సితో మాత్రం ప‌నిచేయ‌డం లేదు. ఎవరూ జ‌వాబుదారులు లేరు..ఎవ‌రూ ఏదీ ప‌ట్టించుకోరు..గ‌తంలో ప‌నిచేసిన వారిదే ఇప్పుడూ పెత్త‌నం..చేస్తున్నారు..ఎన్నిసార్లు మొర‌పెట్టినా ప‌ట్టించుకునే నాధుడు లేడు.మొత్తం మీద‌..ప్ర‌జ‌లకు అన్నిర‌కాలు సంక్షేమ‌ప‌థ‌కాలు అమ‌లుచేస్తున్నా..అభివృద్ది చేస్తున్నా..ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌లేక‌పోతున్నారు. ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కూ.. ప్ర‌జ‌ల‌కూ మ‌ధ్య నెల‌కొన్న దూరం...రోజు రోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా త‌మ ఓటు బ్యాంక్‌గా ఉన్న‌వారి అసంతృప్తిని దూరం చేయ‌క‌పోతే..రాబోయే రోజుల్లో దానికి పెద్ద ప‌రిహారం చెల్లించాల్సి వ‌స్తుంది.


(3)
(0)

Comments