ఆ మంత్రుల పేషీలు అవినీతిమయం...!?
ఏడాదిన్నర క్రితం బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆశలే పెట్టుకున్నారు. వారి ఆశల్లో కొన్నింటిని ప్రభుత్వం నెరవేరుస్తోంది. గత ప్రభుత్వం కంటే..ఈ ప్రభుత్వ పాలన బెటర్‌గా ఉంటుందనే ప్రజలు వారికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ప్రభుత్వం పాలన నిర్వహిస్తోంది. దీనిపై ఎవరికీ పెద్దగా ఫిర్యాదులు లేవు. అయితే..అవినీతి విషయంలో మాత్రం ప్రజల నుంచి, అధికార పార్టీ కార్యకర్తల నుంచి బహిరంగంగానే ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల అవినీతిపై ప్రజల్లో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు బరితెగిస్తున్నారని, రేపన్నదే లేదన్నట్లు దోపిడీకి పాల్పడుతున్నారని, మరి కొందరు అసాంఘిక, అనైతిక వ్యవహారాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. వీరు ఇలా ఉంటే..మంత్రులుగా వెలగబెడుతోన్న కొందరు మంత్రులు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రుల వద్ద ఓఎస్డీలుగా, పిఎస్‌లుగా, పిఆర్ ఓలుగా పనిచేసిన వారే ఇప్పుడూ ఆయా మంత్రుల వద్ద మళ్లీ చేరి..ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు మంత్రుల పేషీలు అవినీతికి చిరునామాగా మారిపోయాయనే విమర్శలు ఉన్నాయి. గతంలో వైకాపాలో ఉండి, ఆఖరు నిమిషంలో టిడిపిలో చేరి మంత్రులుగా పనిచేస్తోన్న మంత్రుల పేషీపై పదే పదే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.
రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న మంత్రి పేషీలో అవినీతి తాండవిస్తోంది. సదరు మంత్రిగారి పేషీలో ఓఎస్టీగా ఉన్న వ్యక్తి అవినీతికి మారుపేరుగా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఆయన చరిత్ర అంతా అవినీతిమయమే. అయినా సదరు మంత్రి ఆయనను ఏరికోరి తెచ్చుకుని పేషీని అప్పచెప్పారు. అయితే..సదరు ఓఎస్టీ ఇష్టారాజ్యంగా ప్రతి పనికి లెక్క గట్టి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు మంత్రి సౌమ్యుడు, నెమ్మదస్తుడనే పేరు ఉన్నా సదరు ఓఎస్టీ వల్ల ఆయనకు చెడ్డపేరు వస్తోంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే సదరు మంత్రి పదవి పోవడం ఖాయమని, దీనికి సదరు ఓఎస్టీనే కారణమవుతారనే చర్చ సచివాలయంలో జరుగుతోంది. ఇది ఇలా ఉండే ఇప్పుడు నెల్లూరు లేడీ విషయంలో జరుగుతోన్న రచ్చ అంతా ఇంతా కాదు. సదరు మంత్రి పేషీ వ్యవహారాలు కూడా అంత బాగాలేవు. రాజకీయంగా సదరు మంత్రి హుషారుగా ఉన్నా..పాలన విషయంలో మాత్రం అంతంతమాత్రమేనని, మంత్రి పేషీ మాత్రం అవినీతిలో మునిగిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ శాఖకు సంబంధించి రెండు మూడు సార్లు వివాదాలు జరిగినా..ఆ పేషీ తీరు మాత్రం మారలేదు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రి పేషీ అవినీతి గురించి ప్రధాన పత్రికల్లో తాడికాయంత అక్షరాలతో వార్తలు వచ్చాయి. అయితే..సదరు మంత్రి దాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా..ఎవరు నీతిమంతులు అన్నట్లు లోకేష్‌ను, చంద్రబాబును ఉద్దేశించి వ్యగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక వైకాపా నుంచి టిడిపిలో చేరి మంత్రి అయిన సీనియర్ మంత్రి వ్యక్తిగతంగా మంచివారనే పేరుంది. అయితే ఆయన పేషీలోని అధికారి మాత్రం ఇష్టారాజ్యంగా అవినీతి చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణకుచెందిన ఆయనను ఇక్కడకు తీసుకువచ్చి పేషీ అప్పచెప్పారని, ఇక ఆయన తనకు ఎదురులేదన్నట్లు వ్యవహరిస్తున్నారంటున్నారు. రాయలసీమకు చెందిన ఇద్దరు మంత్రుల పేషీలు కూడా ఇలానే తయారయ్యాయి. మరో మహిళా మంత్రి పేషీ కూడా అవినీతి తాండవిస్తోంది. మొత్తం మీద...మెజార్టీ మంత్రుల పేషీల్లో వ్యవహారాలు అంత బాగా లేవని, ఇంటిలిజెన్స్ ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించిందనే వార్తలు వస్తున్నాయి. అయితే..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో..వారు..మరింతగా బరితెగించారని, తమను అడ్డుకునేవారు లేరన్నట్లు వ్యవహరిస్తున్నారంటున్నారు. జగన్ ప్రభుత్వంలో కూడా ఇంత బరితెగింపులేదని అంటున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తగు చర్యలు తీసుకోకపోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు.