శ్రీ‌ల‌క్ష్మిని తెచ్చిందెవ‌రు భూమ‌నా...!?

26, Aug 2025

వైకాపా సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఓ ఐఏఎస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా, అధికార‌ప‌రంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. తాము అధికారంలో ఉన్న‌ప్పుడు ఓ మ‌హిళా ఐఏఎస్ అధికారి అవినీతిలో అన‌కొండ‌లా కూరుకుపోయింద‌ని, ఆమె వ‌ల్ల తాము చాలా ఇబ్బందులు ప‌డ్డామ‌ని ప‌రోక్షంగా ఐఏఎస్ అధికారి శ్రీ‌ల‌క్ష్మిని ఉద్దేశించి ఆయ‌న ప‌రుష వ్యాఖ్య‌లు చేశారు. అప్ప‌ట్లో మంత్రులంద‌రినీ పూచికపుల్లాతా తీసేసింద‌ని, త‌న‌శాఖ‌కు చెందిన మంత్రుల‌ను అస‌లు లెక్క‌చేయ‌లేద‌ని, ఆమెకు సొమ్ములు సంపాదించ‌డం త‌ప్ప‌..నైతిక విలువ‌లు లేని వ్య‌క్తి అని దుమ్మెత్తిపోశారు. ఆమె తాట‌కిలాంటి వ్య‌క్తి అని, రోజుకు ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల చీర ధ‌రిస్తుంద‌ని, రూ.50ల‌క్ష‌ల రూపాయిల విలువైన విగ్గులు పెట్టుకుంటుంద‌ని, ఆమె వ‌ద్ద అటువంటివి 12 విగ్గులు ఉన్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు కురిపించారు. గ‌త 30 సంవ‌త్స‌రాలుగా ఆమె తీవ్ర‌స్థాయిలో అవినీతికి పాల్ప‌డింద‌ని, వంద‌ల‌కోట్ల సొమ్ములు సంపాదించింద‌ని, ఆమె అవినీతికి గురించి అత్యున్న న్యాయ‌స్థానం కూడా ఆక్షేపించింద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.  ఒక మ‌హిళా అధికారి గురించి ఇంత నీచంగా భూమ‌న క‌రుణ‌కార్‌రెడ్డి వ్యాఖ్యానించ‌డం రాజ‌కీయంగా, అధికార‌ప‌రంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఆమెపై ఇంత‌లా దండెత్త‌డానికి ప్రధాన కార‌ణం..వైకాపా అధికారంలో ఉన్న‌ప్పుడు విడుద‌ల చేసిన టిడిఆర్ బాండ్ల విష‌యంలో అవినీతి జ‌రిగింద‌ని, ఈ అవినీతికి ప్రధాన కార‌ణం భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అని ఆమె టిడిపి నేత‌ల‌కు చెప్ప‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. దాదాపు రెండువేల కోట్ల రూపాయ‌లు టిడిఆర్ బాండ్ల రూపంలో క‌రుణాక‌ర్‌రెడ్డి దోచుకున్నార‌ని టిడిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. వాస్త‌వానికి ఈ టిడిఆర్ బాండ్ల విష‌యంలో వైకాపా నేత‌లు ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని త‌ణుకు ప‌ట్ట‌ణంలో కూడా భారీ ఎత్తున టిడిఆర్ బాండ్ల కుంభ‌కోణం జ‌రిగింది. దీనిపై ఇప్ప‌టికే విచార‌ణ సాగుతోంది. తిరుప‌తిలో జ‌రిగిన దానిపై కూడా విచార‌ణ జ‌రుగుతుండ‌డం...దానికి ఐఏఎస్ అధికారిణి శ్రీ‌ల‌క్ష్మి త‌గిన స‌మాచారాన్ని టిడిపికి ఇవ్వ‌డంతో..క‌రుణాక‌ర్‌రెడ్డి ఆమెపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఒక మ‌హిళ‌పై ఎంత ధ్వేషం ఉన్నా ఈ ర‌క‌మైన భాష మాట్లాడ‌డం వైకాపా నేత‌ల‌కు చెల్లింది. 

శ్రీ‌ల‌క్ష్మి అవినీతికి కొమ్ముకాసింది..వై.ఎస్ కుటుంబ‌మే..!?

వై.శ్రీ‌ల‌క్ష్మి తాట‌కి, రాక్ష‌సి, లంకిణి, అవినీతిప‌రురాలు అంటూ భూమ‌న ఏమిటేమిటో చెబుతున్నారు. మ‌రి అలాంటి అధికారిని తెచ్చిందెవ‌రు భూమ‌నా..?  మీ నాయ‌కుడు కాదా..? ఆమెను పెంచి పోషించిదెవ‌రు..?  మీకు ఆరాధ్య‌దైవ‌మైన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కాదా..? ఆయ‌న హ‌యాంలోనే క‌దా.. ఓబులాపురం గ‌నుల‌ను ఈమె ద్వారా త‌న స‌న్నిహితుడు గాలి జ‌నార్థ‌న్‌రెడ్డికి క‌ట్ట‌బెట్టింది..? అప్ప‌టి దాకా అత్యంత నిజాయితీప‌రురాలైన ఆమెను అవినీతిప‌రురాలు చేసింది..వై.ఎస్‌. ఆయ‌న కుమారుడు కాదా..? 21 ఏళ్ల‌కే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐఏఎస్ స‌ర్వీసును సాధించి కెరీర్‌లో రిమార్కు లేకుండా ప‌నిచేస్తోన్నా ఆమెను అవినీతి బాట ప‌ట్టించింది..ఈ తండ్రీ కొడుకులే క‌దా..భూమానా..? ఈ కేసులోనే ఆమె జైలు జీవితం గ‌డిపి..చివ‌ర‌కు బ‌తుకుజీవుడా అంటూ జైలునుంచి బ‌య‌ట‌ప‌డింది...?  జైలు జీవితం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత అయినా..ఆమెను మీ అధినేత వ‌దిలేశాడా..?  తెలంగాణ స‌ర్వీసులో ఉన్న ఆమెను ఆంధ్రాకు తెచ్చింది జ‌గ‌నే క‌దా..? ఆమె స‌ర్వీసును తెలంగాణ నుంచి ఆంధ్రాకు మార్పించ‌డానికి కేంద్రం వ‌ద్ద  జ‌గ‌న్ ఎంత పోరాటం చేశాడో..మీకు తెలియ‌దా..? అప్ప‌ట్లో ఆమె కోసం..ప్ర‌తిసారి ఆమెను వెంట‌బెట్టుకుని ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని మోడీ, హోంమంత్రి అమితాషాల‌ను ఒప్పించి రాష్ట్రానికి తెచ్చుకున్న‌దెందుకు..? ఆమెతో అవినీతి చేయించి..ప్యాలెస్‌ను నింపుకోవ‌డానికేగా..?  కీల‌క‌మైన మున్సిప‌ల్ శాఖ‌ను ఆమెకు క‌ట్ట‌బెట్టి...రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ చేసి...వేల కోట్లు మింగిన సంగ‌తి నీకు తెలియ‌దా..? ఆమెను అడ్డుపెట్టుకుని జ‌గ‌న్‌, బొత్స‌లు మీ పార్టీ నాయ‌కులు చేసిన అవినీతి ఇప్పుడు పుట్ట‌ప‌గిలిన‌ట్లు ప‌గులుతుంటే..ఏమి చేయాలో తెలియ‌క‌.. ఇప్పుడు ఆమెను దోషి చేస్తారా..?  కూట‌మి ప్ర‌భుత్వానికి ద‌మ్ముంటే..ఇప్ప‌టికే మీలాంటి వాళ్లంద‌రూ శ్రీ‌కృష్ణ జ‌న్మ‌స్థానానికి ఎప్పుడో వెళ్లేవాళ్లు.  ఏమి చేస్తాం..అవినీతిప‌రుల భ‌ర‌తం ప‌ట్టండి అని ప్ర‌జ‌లు అఖండ మెజార్టీ ఇస్తే..ఇంకా మీన‌మేషాలు లెక్క‌పెడుతూ మీ పాపాల‌ను భ‌రిస్తోన్న చంద్ర‌బాబును ఆయ‌న కుమారుడిని అనాలి. ఏది ఏమైనా..మీ పాపాల లెక్క‌లు ఇంకా బ‌య‌ట‌కు వ‌స్తాయి..వీట‌న్నింటిని అధికారుల‌పై తోయ‌డానికి ఇంకా ఏమేమి దారులు ఉన్నాయో...వెతుక్కోండి భూమ‌నా..?


(6)
(0)

Comments