Janam Online

"నారాయ‌ణ‌"తో ఆరో కృష్ణుడు...!

ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను గాడిలో పెడ‌తార‌ని, రాష్ట్రానికి ఢిల్లీని మించి రాజ‌ధానిని నిర్మిస్తార‌నే భావ‌నతో రాష్ట్ర ప్ర‌జ‌లు 2014 ఎన్నిక‌ల్లో టిడిపి, బిజెపి, జ‌న‌సేన కూట‌మికి అధికారం అప్ప‌గించారు. కాంగ్రెస్ వంచ‌న‌తో అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని చంద్ర‌బాబు, మోడీలు కాపాడ‌తార‌ని, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తార‌ని, హైద‌ర‌బాద్‌ను మించిన రాజ‌ధానిని నిర్మిస్తార‌ని అప్ప‌ట్లో ప్ర‌జ‌లు న‌మ్మి వారి పార్టీల‌కు ఓటు వేశారు. అయితే..అధికారంలోకి వ‌చ్చిన ఈ కూట‌మి ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను నెర‌వేర్చ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంద‌నే విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు మెండుగా రావ‌డంతో అప్ప‌ట్లో దానికి టిడిపి ప్ర‌తిఫ‌లం చెల్లించింది. ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో వీరు ఘోరంగా విఫ‌లం అయ్యార‌నే భావ‌న అప్పుడూ...ఇప్పుడూ వ్య‌క్తం అవుతోంది. చంద్ర‌బాబు రాజ‌ధాని నిర్మాణా నికి ఏక్ష‌ణాన‌ పూనుకున్నారో కానీ, ఏ క్ష‌ణాన దాన్ని మంత్రి నారాయ‌ణ చేతిలో పెట్టారో కానీ..అక్క‌డ నుంచి ప్ర‌తిదీ వారికి ఎదురుతున్నుతూనే ఉంది. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ ప్రాజెక్టు అంతా పి.నారాయ‌ణ చేతుల మీదుగానే న‌డుస్తోంది. మొద‌ట్లో మున్సిప‌ల్ మంత్రిగా నారాయ‌ణ కొద్దిగా హ‌డావుడి చేశారు. బ్ర‌హ్మాండ‌మైన రాజ‌ధానిని నిర్మిస్తామ‌ని చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం తాత్కాలిక స‌చివాల‌యం అంటూ చేసిన నిర్మాణం విమ‌ర్శ‌లు కొని తెచ్చ‌కుంది.




2014-19 మ‌ధ్య రాజ‌ధానిలో ఎటువంటి పురోగ‌తి లేక‌పోవ‌డంతో....అప్ప‌టి ప్ర‌తిప‌క్ష వైకాపా దానిపై విషం చిమ్మి..రాజ‌కీయంగా లాభ‌ప‌డింది. అయితే.. దీనిలో వైకాపా వ్యూహాన్ని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. రాజ‌కీయ ల‌బ్దికోసం వారు చేయాల్సిన‌దంతా చేసి అధికారాన్ని ద‌క్కించుకున్నారు. ఇక్క‌డ వారిని అన‌డానికి ఏమీ లేదు. బ్ర‌హ్మాండ‌మైన హామీలు ఇచ్చి...చివ‌ర‌కు తుస్సుమ‌న్న టిడిపి-కూట‌మి నేత‌ల‌దే త‌ప్పంతా..?  ప్ర‌జ‌ల్లో అద్భుత‌మైన ఊహాగానాలు క‌ల్పించి.. వారిని ఎక్క‌డెక్క‌డో క‌ల‌ల విహారం చేయించి...చివ‌ర‌కు త‌స్సుమంటే..త‌ప్పు ప్ర‌జ‌ల‌దా...?  ప్ర‌తిప‌క్షానిదా..?  లేక ఆ ఊహ‌ల్లో విహ‌రింప‌చేసిన వారిదా..? అంటే నిజంగా ఊహాల్లో తేల్చిన వారిదే..త‌ప్పు...స‌రే అప్పుడేదో జ‌రిగిపోయింది..త‌రువాత అయినా..త‌ప్పులు దిద్దుకుంటున్నారా..? అంటే అదేమీ లేదు..మ‌ళ్లీ చేసిన త‌ప్పులే చేసుకుంటూ పోతున్నారు. ఇప్ప‌టికి మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు కావ‌స్తున్నా..మ‌ళ్లీ అదే దారి..అదే త‌ప్పులు..లెక్క‌కు మించి త‌ప్పులు మీద త‌ప్పులు చేసుకుంటూ పోతున్నారు.




నారాయ‌ణ‌ను న‌మ్ముకుంటే..అంతేనా...!?

2014-19 మ‌ధ్య మున్సిప‌ల్ మంత్రిగా చంద్ర‌బాబు త‌న‌కు ఎంతో ఆప్తుడు, మిత్రుడైన నారాయ‌ణ క‌ళాశాల‌కు చెందిన నారాయ‌ణ‌ను మంత్రిగా నియ‌మించుకున్నారు. అప్ప‌ట్లో ఆయ‌న క‌నీసం ప్ర‌జాప్ర‌తినిధి కూడా కాదు. దొడ్డిదారిన ఆయ‌న మంత్రిగా వ‌చ్చినా విద్యావ్యాపారి క‌నుక‌..ఇప్ప‌టికే ద‌క్షిణాదిని లెక్క‌కు మించి భ‌వ‌నాల్లో క‌ళాశాలలు న‌డుపుతోన్న ఆయ‌న రాజ‌ధానిని నిర్మిస్తారేమో అని ప‌లువురు ఆశించారు. అందుకే చంద్ర‌బాబు ఆయ‌న‌కు మున్సిప‌ల్ మంత్రి ప‌ద‌వి ఇచ్చి..రాజ‌ధానిని ఆయ‌న చేతిలో పెట్టిన పెద్ద‌గా ఎవ‌రూ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేదు.  అయితే..త‌న బాస్ త‌న‌కు అప్ప‌గించిన ప‌నిని నెర‌వేర్చ‌డంలో నారాయ‌ణ విఫ‌లం అయ్యార‌నే చెప్పాలి. తొలిరోజుల్లో తాత్కాలిక భ‌వ‌నాలంటూ చేసిన ప్ర‌చారం..టిడిపి పుట్టిముంచింది. ప్ర‌జ‌లేమో..అమెరికా లోని లాస్ ఏంజిల్స్‌, బ్రిట‌న్‌లోని పార్ల‌మెంట్‌, ఢిల్లీలోని పార్ల‌మెంట్ వంటి భ‌వ‌నాల‌ను నారాయ‌ణ నిర్మిస్తున్నారేమో..మ‌న‌కూ అలాంటి భ‌వ‌నాలు వ‌స్తాయ‌ని ఎన్నెన్నో ఊహాగాల‌ను పెట్టుకుని ఎదురు చూస్తుంటే..చివ‌రికి నారాయ‌ణ నిర్మించిన తాత్కాలిక స‌చివాల‌యం, తాత్కాలిక అసెంబ్లీని చూసి ఉస్సూర‌మ‌న్నారు. ప్ర‌జ‌ల్లో క‌ల్గించిన ఊహాగానాల‌కు త‌రువాత పార్టీ ప్ర‌తిఫ‌లం చెల్లించినా..చంద్ర‌బాబు మాత్రం త‌న అనుంగు అనుచ‌రుడు, మిత్రుడు, హితుడైన నారాయ‌ణ‌కు మ‌ళ్లీ అదే మంత్రిత్వ‌శాఖ‌ను ఇచ్చేసి..చేతులు దులిపేసుకున్నారు.  


ఆరో సిఆర్‌డిఏ క‌మీష‌న‌ర్‌...!

మంత్రి నారాయ‌ణ మున్సిప‌ల్ మంత్రిగా వ‌చ్చిన ఈ ఏడేళ్ల‌లో ఆరుగురు సిఆర్‌డిఏ క‌మీష‌న‌ర్లు వ‌చ్చారు. అంటే దాదాపుగా ఏడాదికి ఒక‌రు అన్న‌మాట‌. మంత్రిగా నారాయ‌ణ వ‌చ్చిన‌ప్పుడు సిఆర్‌డిఏ క‌మీష‌న‌ర్‌గా గిరిధ‌ర్ ఉండేవారు. ఎందుకో ఆయ‌న ప‌నితీరు మంత్రికి న‌చ్చ‌క‌పోవ‌డంతో త‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన నాగుల‌ప‌ల్లి శ్రీ‌కాంత్‌ను క‌మీష‌న‌ర్‌గా నియ‌మించుకున్నారు. మ‌రి ఎందుకో త‌రువాత ఆయ‌న కూడా న‌చ్చ‌లేదో..మ‌రి ఏమిటో తెలియ‌దు కానీ..ఆయ‌న‌ను తీసేసి..చెరుకూరి శ్రీ‌ధ‌ర్‌ను నియ‌మించుకున్నారు. ఈ చెరుకూరి శ్రీ‌ధ‌ర్ ఉన్న‌ప్పుడే అమ‌రావ‌తికి రైతులు భారీగా భూములు భూ స‌మీక‌ర‌ణ కింద ఇచ్చేశారు. రైతుల‌తో క‌లివిడిగా మాట్లాడి, వారికి న‌చ్చ చెప్పి..ఎటువంటి వివాదాలు లేకుండా శ్రీ‌ధ‌ర్ భూ స‌మీక‌ర‌ణ చేయించారు. ఆయ‌న హ‌యాంలో సిఆర్‌డిఏ ఎంతో కొంత ప్ర‌గ‌తిని సాధించింది. రాజ‌ధాని ప‌నులు శ‌ర‌వేగంగా న‌డిచాయి. సిఆర్‌డిఏలో నిర్మించిన సీడ్ యాక్సిస్ రోడ్డు, స‌చివాల‌యం, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌, ఐఏఎస్‌ల క్వార్ట‌ర్స్ ఇలా కొంచెం ప్ర‌గ‌తి క‌నిపించింది. అయితే..అంత‌లో ప్ర‌భుత్వం మార‌డం..జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం..రాజ‌ధాని అధోగ‌తిపాల‌వ‌డం చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి. అయితే.. 2024లో అధికారంలోకి వ‌చ్చిన టిడిపి కూట‌మి గ‌త త‌ప్పుల‌ను దిద్దుకుని శ‌ర‌వేగంగా పూర్తి చేయాల్సిన నిర్మాణాల‌ను పూర్తి చేయ‌లేక‌పోతోంది. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇద్ద‌రు క‌మీష‌న‌ర్ల‌ను ప్ర‌భుత్వం మార్చింది. ఇద్ద‌రు క‌మీష‌న‌ర్ల‌కు మంత్రి నారాయ‌ణ‌కు ప‌డ‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు మూడో క‌మీష‌న‌ర్ వ‌చ్చారు. దాదాపు ఏడేళ్ల‌లో ఆరుగురు క‌మీష‌న‌ర్లు మార‌డం అంటే..అక్క‌డ ఏమి జ‌రుగుతోంది అన్న ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క‌రిలో నెల‌కొంటోంది.  ప్ర‌భుత్వం ఏంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అమ‌రావ‌తి ప్రాజెక్టులో ఇలా ఎందుకు జ‌రుగుతోంది? ఇదంతా మంత్రి నారాయ‌ణ వ‌ల్లేనా..లేక ప్ర‌భుత్వ పెద్ద‌ల వ‌ల్లా..? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి. . ఇలా ప్ర‌తిసారి అధికారులను మార్చుకుంటూపోతే..ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అమ‌రావ‌తి ఎప్ప‌టికి పూర్తి అవుతుంది. ఎన్నో త్యాగాలు చేసిన రైతులకు న్యాయం ఎప్ప‌టికి జ‌రుగుతుందనే ప్ర‌శ్న ప‌లువ‌ర్గాల నుంచి వ‌స్తున్నాయి. 




చంద్ర‌బాబు ప్ర‌త్య‌క్ష జోక్యం చేసుకోవాలి...!

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రాజ‌ధాని నిర్మాణంలో చోటు చేసుకుంటోన్న ప‌రిణామాల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు జోక్యం చేసుకోవాల‌ని, ఆయ‌న నేరుగా దీనిపై ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌నే భావ‌న రాజ‌ధాని రైతుల్లో, అమ‌రావ‌తి ప్రేమికుల్లో ఉంది. ఆయ‌న జోక్యంతోనే రాజ‌ధాని ప‌నులు వేగంగా జ‌రుగుతాయ‌ని, ప్ర‌తిసారీ క‌మీష‌న‌ర్లును మార్చుకుంటూ పోతే..రాజ‌ధాని ప‌నులు ముందుకు సాగ‌వ‌నే అభిప్రాయం ఉంది. మంత్రి నారాయ‌ణ నుంచి ఆ బాధ్య‌త‌ను తీసుకుని చంద్ర‌బాబే రాజ‌ధాని నిర్మాణాన్నిసాగించాల‌ని, కావాల‌నుకుంటే మంత్రి నారాయ‌ణ‌ను మున్సిప‌ల్ మంత్రిగా కొన‌సాగిస్తూనే రాజ‌ధాని విష‌యంలో ఆయ‌నకు ఎటువంటి పాత్ర లేకుండా చేయాల‌నే సూచ‌న‌లు కూడా వ‌స్తున్నాయి. త‌న అంత‌రంగికుడిని చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టినా...పెట్ట‌క‌పోయినా...రాజ‌ధాని నిర్మాణంలో చంద్ర‌బాబు నేరుగా ప‌ర్య‌వేక్షించాల‌ని, అలా కాకుంటే..గ‌తంలో జ‌రిగిన‌ట్లే మ‌ళ్లీ జ‌రుగుతుంద‌ని, దీని వ‌ల్ల పార్టీకి మ‌రోసారి బ‌ల‌మైన ఎదురుదెబ్బ త‌గిలే అవ‌కాశం ఉంద‌ని, పార్టీతో పాటు, త‌న‌పై ఎంతో న‌మ్మ‌కంతో..రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతుల‌కూ దెబ్బ‌తగులుతుందనే భావ‌న వ్య‌క్తం అవుతోంది.