Janam Online

అధికార‌వ్య‌వ‌స్థ‌లో భారీ మార్పులు...!



ఏడాది ఆఖ‌రులో అధికార వ్య‌వ‌స్థ‌లో భారీ మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయి. పాల‌న‌లో కీల‌క‌మైన స్థానాల్లో భారీ మార్పులు వ‌స్తాయి. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ న‌వంబ‌ర్ ఆఖ‌రులో రిటైర్ కాబోతున్నారు. ఆయ‌న స్థానంలో కొత్త‌వారికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శిగా అవ‌కాశం రానుంది. అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో కూడా మార్పులు వస్తాయ‌నే ప్ర‌చారం ఉంది. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ప‌నిచేసే కీల‌క ఐఏఎస్ కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ‌తార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న‌తో పాటు మ‌రో యువ ఐఏఎస్‌ను కూడా అక్క‌డి నుంచి త‌ప్పిస్తార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ప‌నిచేసే సీనియ‌ర్ ఐఏఎస్‌ను త‌ప్పిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్వ‌యంగా ఆయ‌నే ఆ అధికారిని పిలిపించి కార్యాల‌యాన్ని అప్ప‌గించినందును ఆయ‌న‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో త‌ప్పించ‌ర‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. అయితే..ఇటీవ‌ల కాలంలో ఆ అధికారిపై కావాల‌నే కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తోన్న నేప‌థ్యంలో ఆయ‌నంత‌ట ఆయ‌నే వెళ్లిపోవాల‌ని కోరుకుంటున్నార‌ని స‌చివాల‌యంలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ‌తార‌నే ప్ర‌చారం ఉంది. మ‌రోవైపు డైన‌మిక్ ఐఏఎస్ అధికారి కాట‌మ‌నేని భాస్క‌ర్ కేంద్ర స‌ర్వీసుల‌కు వెళుతున్నారు. ఆయ‌న కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్ల‌డం ఇక లాంఛ‌న‌మే. అయితే..ఆయ‌న కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లినా..రాష్ట్రంలోనే ప‌నిచేస్తారంటున్నారు. ఆయ‌న‌ను విశాఖ‌పోర్టు ఎండిగా నియ‌మిస్తార‌నే ప్ర‌చారం ఉంది. నిజాయితీప‌రుడు, స‌మ‌ర్థుడు, డైన‌మిక్ అధికారి అయిన కాటంనేని కేంద్రానికి వెళితే, ప్రస్తుతం ఆయ‌న నిర్వ‌హిస్తోన్న ఐటి, ఆర్‌టిజిఎస్ శాఖ‌ల‌కు మ‌రో అధికారిని నియ‌మించాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో సిఎంఓలో మార్పులు జ‌రిగితే..అక్క‌డా కొత్త‌వారికి అవ‌కాశం ల‌భిస్తుంది.


కాగా...ప్ర‌స్తుత ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్‌కు మ‌రో ఆరు నెల‌లు స‌ర్వీసు పొడిగిస్తార‌నే ప్ర‌చారం ఉంది. అయితే..ఇదంత సుల‌భ‌మేమీ కాదు. గ‌తంలోనే సాయి ప్ర‌సాద్‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తాన‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌ని, ఆయ‌న ఇచ్చిన హామీ ప్ర‌కారం సాయి ప్ర‌సాద్‌ను ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తారంటున్నారు. అయితే..విజ‌యానంద్‌కు ఆర్ఇసి ఛైర్మ‌న్‌గా అవ‌కాశం ఇస్తార‌నే ప్ర‌చారం ఉంది. అయితే..గ‌త కొన్నాళ్లుగా విద్యుత్ వ్య‌వ‌స్థ‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌కు విజ‌యానంద్ కేంద్ర బిందువుగా ఉంటున్నారు. గ‌త వైకాపా ప్ర‌భుత్వంలో కానీ, అంత‌కు ముందున్న టిడిపి ప్ర‌భుత్వంలో కానీ, విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కానీ..విద్యుత్‌రంగం అంటే విజ‌యానంద్‌..విజ‌యానంద్ అంటే విద్యుత్‌శాఖ అన్న‌ట్లుగా ఆయ‌న పేరు మారుమ్రోగిపోయింది. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న రిటైర్ అయిన త‌రువాత కూడా ప్ర‌భుత్వం ఆయ‌న‌ను కొన‌సాగించి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌ను ఇంకా అవ‌కాశం ఇస్తుందా..? అనే అనుమానాలు ఉన్నాయి. కాగా..రాష్ట్ర ఆర్ధిక‌శాఖ కార్య‌ద‌ర్శిగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత ఇష్టుడైన ఓ సీనియ‌ర్ ఐఏఎస్‌ను నియ‌మిస్తార‌నే ప్ర‌చారం ఉంది. కొన్ని నెల‌ల ముందే ఆయ‌న‌ను నియ‌మించ‌డానికి అంతా సిద్ధ‌మైన స‌మ‌యంలో ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌తో ఆ ప్ర‌తిపాద‌న వాయిదా ప‌డిందంటున్నారు. దీనితో పాటు..మ‌రి కొంద‌రు శాఖాధిప‌తుల‌ను మార్చే అవ‌కాశం ఉంది. మొత్తం మీద ఏడాదాఖ‌రులో పాల‌నా వ్య‌వ‌స్థ‌లో భారీ మార్పులు జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం స‌చివాల‌యంలో జోరుగా సాగుతోంది.