ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఒక ఆలోచన వస్తేనో..లేక ఎవరి ఆలోచనైనా..ఆయనను మెప్పిస్తే..ఆయన ఇక వెనుతిరిగి చూడరు. ఆ ఆలోచన అమలు చేయడానికి వెనుకా ముందాడరు. ఆచరణలో సాధ్యమేనా..? ఇది అసలు సాధ్యం అవుతుందా..? అనేది చూడరు. గుడ్డిగా ముందుకు వెళ్లిపోవడమే..లక్ష్యంగా పెట్టుకుంటారు. ఏ విషయంలోనైనా..ఆయన అంతే..! దాని వల్ల ఆయనకు రాజకీయంగా నష్టం కలిగినా..ఆయన లెక్కపెట్టరు. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు ఐటి విషయంలో ఆయనకో ఆలోచన వచ్చింది. ఆయనకా ఆలోచన వచ్చిందో..లేక ఎవరైనా..ఆయనకు చెప్పారో తెలియదు కానీ..ఆ విషయంలో గుడ్డిగా ముందుకు వెళ్లారు. ఆయన ఆలోచన అప్పటి పరిస్థితులకు వర్తించేవి కావు. కానీ..ఆయన అదేమీ లెక్కపెట్టకుండా ముందుకు వెళ్లారు. దాని వలన ఓ తరం బాగా లాభపడింది. అయితే..రాజకీయంగా మాత్రం చంద్రబాబు ఘోరంగా దెబ్బతిన్నారు. ప్రస్తుత పరిస్థితులను ఆలోచించకుండా..అప్పట్లో ఆయన ఐటి అంటూ చేసిన ప్రయోగం వల్ల రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్నారు. 1999-2004 మధ్య ఆయన ఢిల్లీలో చక్రం తిప్పారు. ప్రధానులను,రాష్ట్రపతులను ఆయన కంటిచూపుతో శాసించారు. ఇదంతా ఆయనకు ఉన్న అధికారబలంతోనే...? అయితే..అలాంటి అధికారబలాన్ని ఆయన అంతే తేలిగ్గావదిలేశారు. ఎందుకు ఆయనను ఆయన ప్రత్యర్ధులు అంత తేలిగ్గా ఓడించారంటే..కాలానికి తగ్గట్లు ఆయన వ్యవహరించకపోవడమే.
అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో...చంద్రబాబు బ్రహ్మాండమైన అధికారాన్ని చెలాయిస్తున్నా..పరిస్థితులు ఆయనకు అంత అనుకూలంగా లేవు. ఒకవైపు కరువు పరిస్థితులు, మరోవైపు మావోస్టులు, మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు సృష్టించిన ప్రాంతీయ విభేదాలు, ఉద్యోగుల సమస్యలు, విద్యుత్ ఛార్జీలు..ఇలా ఒకటా రెండా..అనేక సమస్యలు ఉంటే..ఆయన మాత్రం ఐటి, బీటీ అంటూ..ఒకటే పాటపాడారు. వాస్తవానికి ధీర్ఘకాలికంగా అవి ప్రజలకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.కానీ..ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేసిన ప్రచారం, వాస్తవ పరిస్థితిపై చంద్రబాబుకు అవగాహన లేకపోవడంతో..అప్పట్లో ఆయన కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. అప్పట్లో చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉన్న వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తన ఉపన్యాసాల్లో చేతులు తిప్పుతూ..అమ్మం అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడటా...అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. ఇవి అప్పట్లో ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. అంతేనా..విద్యుత్ ఛార్జీల విషయంలో మొండిగా వ్యవహరించి ప్రపంచబ్యాంక్ ఏజెంట్...అనే ముద్ర వేయించుకుని..విద్యుత్ సంస్కరణలు తేవడానికి..చంద్రబాబు చేసిన ప్రయత్నం చివరకు ఆయన సీటుకు ఎసరు పెట్టింది. ప్రస్తుత కాలానికి తగ్గట్లు వ్యవహరించకపోతే...ఆ వ్యక్తికి భవిష్యత్తు ఉండదనే దానికి ఇది ఉదాహరణ. అంతెందుకు కాంగ్రెస్ చేసిన కుఠిల రాజకీయాన్ని ఆంధ్రాప్రజలు గ్రహించి మళ్లీ 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఆయనను సిఎం చేస్తే..అప్పుడూ అదే కలలతో మళ్లీ అధికారాన్ని కోల్పోయారు. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తానంటూ...ఆయన ఆయన చుట్టూ ఉండే పరివారం చేసిన హడావుడితో..వాస్తవాలకు దూరమై, ప్రజలను ఊహాగానాల్లో ముంచేత్తే..2019లో ఘోర పరాజయం ఎదురైంది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే...వాస్తవాలకు దూరంగా, భవిష్యత్తుపై అపారమైన ఊహాగానాలకు తెరలేపితే..వచ్చే సమస్యలే ఇది.
ఒకరు వద్దు..ఐదారుగురే ముద్దు...!?
ఇప్పుడు తాజాగా చంద్రబాబు అందుకున్న నినాదం ఏమిటంటే..ఒకరు వద్దు...ముగ్గురు లేకా..ఐదారుగురు పిల్లలే ముద్దట. ఇద్దరి కంటే..ఎక్కువ పిల్లలను కంటే..రూ.25వేలు బహుమానం ఇస్తారట. మొన్న అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటన ఇది. గత కొన్నాళ్లుగా ఆయన ఇదే హడావుడి చేస్తున్నారు. 2024లో మరోసారి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో పి4 అంటూ హడావుడి చేశారు. ఏమిటీ పి4 అంటే..రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడం అంట. ఆచరణలో ఇది సాధ్యం కాదని, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన అమెరికా సమాజంలోనే పేదరికం ఉందని అంటే..అటువంటి వారి గొంతులను దబాయించి మూయించారు. సరే..బాబుగారు చెబుతున్నారు కదా..అని..అలాంటి వారంతా నోరెత్తకుండా..ఆయనేమి చేస్తున్నారో..మౌనంగా చూస్తున్నారు. మొదట్లో హడావుడి చేసిన ఆయన ఆయన బృందం..ఇప్పుడు ఆ పి4 అనేది ఒకటి ఉందా..? అన్నట్లు...అనుమానంగా చూస్తున్నారు. ఇప్పుడు పి4ని వదిలేసి..ముగ్గురు పిల్లలు లేదా ఐదుగురు పిల్లలంటూ..ఒకటే పాటపాడుతున్నారు. మన సమాజంలో జనాభా శాతం తగ్గిపోతోంది..అధిక జనాభానే రాబోయే కాలంలో ఆస్తి అంటూ..ఆయన చేస్తోన్న వాదనలు కొంత వరకూ నిజమే. అయితే..ప్రస్తుత పరిస్థితికి ఇది పనికిరాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో..ఒక్క పిల్లాడిని సాకడమే కనాకష్టం అవుతోంది. మేలైన, స్థిరమైన ఉద్యోగాలు లేని పరిస్థితులు ఒకవైపు, కునారిల్లుతోన్న వ్యవసాయరంగం మరోవైపు, ఆధారపడలేని సేవారంగం ఇంకోవైపు ఉన్న పరిస్థితుల్లో సగటు మనిషి..ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిన్నటి దాకా అతిగా ఆధారపడిన ఐటి రంగం ఇప్పుడు దివాలా స్థితికి చేరింది. ఈరంగంపై ఆధారపడిన వారే..ఇప్పుడు ఏమి చేయాలో తెలియక..ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో..ఏ గంటలో ఊడుతుందో..తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర జనాభాలో అధికంగా ఆధారపడిన వ్యవసాయరంగం..కుదేలవుతోంది. ఇప్పుడు వ్యవసాయం చేయడమంటే చావుతో సవాసం చేసినట్లే..అటువంటి పరిస్థితుల్లో ఈ రంగంపై ఆధారపడిన వారు..ముగ్గురు నలుగురు పిల్లలు కనడం అయ్యే పనేనా..? పిల్లలను కంటే వారిని పోషించే శక్తి వారికి ఏది...? రాష్ట్ర జనాభాలో దాదాపు ముప్పావు వంతు మందిని ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల కిందకు తెచ్చిన ప్రభుత్వాలు వాళ్లు అధిక జనాభాను కంటే..వాళ్లకూ..తలా ఇంత వేస్తారా..? ఇదే మహా ప్రసాదమని వాళ్లు భావించాలా..? వేల కోట్లు ఆస్తులు, వందల కోట్లు సంపదలు ఉన్నవాళ్లే..ఒక్కరు చాలనుకుంటుంటే...బతుకుబండి లాగడానికే...నానా ఇబ్బందులు పడుతోన్నవారికి ముగ్గురు లేక ఐదుగురు అవసరమా..? ఏది ఏమైనా..చంద్రబాబు ఆలోచనలు..ఈ తరానికి కంటే..నేను ముందు ఉన్నాను అని అనిపించుకోవాలనే దుగ్థ తప్ప..వాస్తవానికి, ప్రస్తుత పరిస్థితులకు ఏ మాత్రం సరిపోవు!