ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పి4 (Public-Private-People Partnership) పథకానికి ఆదిలోనే హంసపాదులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనే లక్ష్యంతో పి4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. సమాజంలోని ధనవంతులు, కడు బీదరికంలో ఉన్నవారిని ఆదుకోవాలని తద్వారా పేదరికం లేని సమాజం సాధించవచ్చనని ఆయన చెబుతున్నారు. ఆయన లక్ష్యం బాగానే ఉన్నా..దాన్ని అమలు చేయాల్సిన అధికారులు మాత్రం ఆయన ఆశయాలకు తుంగలో తొక్కుతున్నారు. పి4 వైస్ ఛైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త సి.హెచ్.కుటుంబరావును నియమించారు. ముఖ్య మంత్రి ఆశయాలకు అనుగుణంగా కుటుంబరావు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పలుచోట్లకు వెళ్లి ఆయన పి4పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొందరు ఈ పథకంపై తీవ్ర విమర్శలు చేసినా..ఆయన చలించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ వెళుతున్నారు. ఆయన వరకూ అభ్యంతరం పెట్టడానికి, విమర్శించడానికి ఏమీ లేదు. అయితే..ఈ కార్యక్రమానికి సీఈఓగా ఉన్న అధికారి మాత్రం ముఖ్యమంత్రి అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో రాలయసీమకు చెందిన ఓ పవర్‌పుల్ ఎమ్మెల్యే చెప్పిన మాటలను సదరు సీఈఓ వినిపించుకోలేదని, దాంతో..ఆయనపై ఆ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారని, దీంతో..సదరు సీఈఓ అలిగినట్లు తెలుస్తోంది. తాను ఈరోజు నుంచి ఉద్యోగానికి రావడం లేదని చెబుతూ తన సీనియర్ అధికారులకు, పి4 వైస్-ఛైర్మన్‌కూ ఆయన ఓ పోస్టు పెట్టినట్లు తెలిసింది. దీంతో సదరు సీనియర్ అధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ఉద్యోగానికి రావడం లేదని తనకే పోస్టు పెడతారా..? ఎంత ధైర్యం అంటూ ఆ అధికారి అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇక ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదని, ఆయనను తప్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. దీంతో..తనకు ఉద్వాసన తప్పదని భావించిన సీఈఓ మళ్లీ కార్యాలయానికి వస్తున్నారట. తన పనులు మౌనంగా చేసుకుంటూ వెళుతున్నారట. అయితే..సీనియర్ అధికారులు ఆయనను అక్కడ నుంచి తప్పించి వేరే అధికారిని అక్కడ నియమించడానికి అంతా సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పథకానికి ఎంతో ఉపయుక్తంగా పనిచేయాల్సిన వారు ఈ రకంగా వ్యవహరించడం ఏమిటనే భావన అధికార పార్టీలో వ్యక్తం అవుతోంది.