వివాహేతర సంబంధం పెట్టుకుని, ఓ మహిళను ఓ సీనియర్ ఐఏఎస్ హత్య చేసిన ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐఏఎస్, అధికార వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఓ ప్రముఖ దిన పత్రిక ఈ హత్య విషయాన్ని ప్రచురించింది. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు వేరే సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఆమెను సదరు ఐఏఎస్ అధికారి హత్య చేశారని ఆ పత్రిక కథనం. హత్య విషయాన్ని సదరు ఐఏఎస్ అధికారి దాచిపెట్టి మేనేజ్ చేసుకున్నారని, పోలీసులు, హత్యకు గురైన మహిళ కుటుంబ సభ్యులను, హాస్పటల్ వర్గాలను, ఇతర వర్గాలను సదరు ఐఏఎస్ సంతృప్తిపరిచి హత్య విషయాన్ని దాచి, యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని ఈ పత్రిక పేర్కొంటోంది. అయితే దీన్ని తెలంగాణ పోలీసులు నిర్ధారించలేదు. దీనిపై వాళ్లు ఇంత వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కావడంతో..తెలంగాణ ప్రభుత్వం దీనిపై విచారణ చేసే అవకాశం ఉంది. అయితే..సదరు హత్యకు గురైన మహిళ బంధువులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తారా..? లేక సుమోటోగా దర్యాప్తు చేస్తారో చూడాలి. అయితే..ఇప్పుడు దీనిపై కేసు నమోదు చేస్తే..సదరు ఐఏఎస్‌తో పాటు, హాస్పటల్ వర్గాలపై కూడా కేసు నమోదు చేయాల్సిఉంటుంది. కాగా..ఈ ఐఏఎస్ మొదటి నుంచి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాస్తుంటారనే పేరుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కాకా పట్టేవారని, తరువాత జగన్ అధికారంలోకి రావడంతో..ఆయనకు బాకా ఊదేవారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఈయన ఇష్టారాజ్యంగా చెలరేగారని అప్పట్లో టిడిపి వర్గాలు విమర్శలు గుప్పించేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈయనకు చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే..సదరు ఐఏఎస్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లి తనకు క్యాన్సర్ ఉందని ఎక్కువ రోజులు బతకలేనని, తనకు పోస్టింగ్ ఇవ్వాలని బ్రతిమాలాడడంతో..చంద్రబాబు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారనే ప్రచారం ఉంది. కాగా ఇటీవల ఐఏఎస్ బదిలీలు జరిగితే..ఆయనకు ప్రాధాన్యతా పోస్టు దక్కుతుందని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే..ఇప్పుడు హఠాత్తుగా హత్య కేసులో సదరు ఐఏఎస్ ఇరుక్కోవడంతో..ఆయనకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కాగా...ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విచారణ చేయించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
జగన్ హయాంలో....!
ఒకప్పుడు మంచి పనిమంతుడిగా పేరున్న సదరు ఐఏఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడంతోనే అదుపుతప్పి ప్రవర్తించాడంటారు. జగన్‌కు కావల్సింది చేసిపెట్టి తనకు కావాల్సింది దక్కించుకున్నారని అనధికార మాటల్లో ఐఏఎస్‌లు అంటుంటారు. జగన్ హయాంలో ఈయనొక్కరే కాదు. చాలా మంది ఐఏఎస్‌లు, ఇతర సర్వీసులకు చెందిన అధికారులు నైతికతకు పాతరేసి అనైతిక కార్యక్రమాలు సాగించారనే విమర్శలు ఉన్నాయి. జగన్ ఒక్కోశాఖను ఒక్కో అధికారికి కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లూ వీళ్లు కూడా ఆ శాఖలను ఇంటి సంస్థలుగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్‌కు దోచిపెట్టేది దోచిపెట్టడం..తరువాత వీరు, ఇతర అధికారులు దోచుకోవడం...తరువాత అనైతిక కార్యక్రమాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఒకరో ఇద్దరో కాదు..పది మంది దాకా..ఇలా అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన వారు ఉన్నారు. వీరందరిపై విచారణ జరిపిస్తే..ఐఏఎస్ వర్గాల్లో కొంచెమైనా భయం అనేది ఉంటుంది. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వీళ్లు అవినీతి, అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ పాలనను గాలికి, తమ మందిమాగాధులకు అప్పచెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు బోలెడు ఉన్నాయి. ఇటువంటి వారిపై ప్రభుత్వం వెంటనే దృష్టిపెట్టి పాలనకు వీళ్లను దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.