వాళ్లిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిద్దరిని పిలిపించుకునీ మరీ ముఖ్యమైన పోస్టింగ్‌లు ఇచ్చారు. వాళ్ల సమర్థత, నిజాయితీ, కష్టపడేతత్వం చూసిన చంద్రబాబు వారిని కీలక స్థానాల్లో కూర్చోబెట్టారు. వారిలో ఒకరినైతే.. వెంటనే వచ్చి తన దగ్గర జాయిన్ అయిపో..అంటూ ఆఫర్ ఇచ్చారు. దీంతో..ఆ అధికారిపై చంద్రబాబుకు ఎంత నమ్మకమో..బయట ప్రపంచానికి తెలిసింది. మరో అధికారి గురించి చెప్పాల్సిన పనిలేదు. నిజాయితీకి, నీతికి, సమర్థతకు, కష్టపడేతత్వానికి ఆయన ఐఏఎస్ అధికారులందరికీ ఆదర్శం. అయితే..ఏడాదిన్నర చంద్రబాబు పాలన పూర్తి అయిన తరువాత వీరిలో ఒకరు కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి ధరఖాస్తు చేసుకున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం తన అనుమతిని కూడా ఇచ్చేసింది. దీంతో ఆయన నేడో..రేపో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతారు. ఇప్పుడు కేంద్రం ఇక ఆయనకు పోస్టింగ్ ఇవ్వడమే మిగిలింది. అత్యంత సమర్థుడు, నిజాయితీపరుడైన ఆయన ఇక్కడ నుంచి వెళ్లడానికి కారణాలు ఏమిటో ఇతిమిద్దంగా తెలియదు కానీ..ఆయన వెళ్లడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే. కాగా మరో అధికారిపై ఇటీవల కాలంలో పలు మీడియా సంస్థలు పలు రకాలైన వార్తలను ప్రచురిస్తున్నాయి. ఆయన తన కుటుంబానికి ఏదో మేలు చేసుకుంటున్నాడని, ఒక మహిళా అధికారిని ఇబ్బందులు పెట్టాడని, టిడిపి నాయకులకు పనులు చేసిపెట్టడం లేదని, ముఖ్యంగా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారిని అసలు పట్టించుకోవడం లేదని వార్తలు ప్రచురిస్తున్నారు. ఒక ప్రధాన పత్రిక ఆయన గురించి బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. అయితే..ఇవన్నీ వాస్తవాలు కావని, ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారని, చంద్రబాబు చెప్పిన పనులే ఆయన చేస్తున్నారని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే..ఆయనను చంద్రబాబు తప్పిస్తారని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి దీనిలో నిజమెంతో తెలియదు. అయితే..ఇలా వార్తల్లో ఉన్న ఐఎఎస్‌లు ఎవరో కాదు. ఒకరు సిఎంఓ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర కాగా మరో అధికారి ఐటి కార్యదర్శి కాటమనేని భాస్కర్‌లు. వీరిద్దరూ ఇప్పుడు ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నారనే వార్త సచివాలయంలో చక్కర్లు కొడుతోంది.
చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే..తన కార్యాలయ అధికారిగా సీనియర్ ఐఏఎస్ రవిచంద్రను నియమించుకున్నారు. ఆయనే స్వయంగా రవిచంద్రను ఆహ్వానించారు. ఆయన సమర్థత, నిజాయితీపై నమ్మకంతో ఆయనను చంద్రబాబు తన వద్ద నియమించుకున్నారు. చంద్రబాబు ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వంలో రవిచంద్ర కీలక పాత్రపోషిస్తున్నారు. అయితే..గత కొన్నాళ్లుగా ఆయనపై కొన్ని మీడియా సంస్థలు పదే పదే ఆరోపణలు చేస్తున్నాయి. ఇందులో ఒక ప్రముఖ పత్రిక కూడా ఉంది. అయితే..అప్పట్లో ఆయనపై ఆ పత్రిక చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనీసం ఆయన వివరణ కూడా కోరలేదు. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. దీంతో..అంతటితో ఆ విషయం ముగిసిపోయిందనుకున్నారు. అయితే ఇటీవల కాలంలో..కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆయనకు వ్యతిరేకంగా వార్తలు వండుతున్నాయి. ఆయనను సిఎంఓ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆయన తన బంధువులకు దోచిపెడుతున్నారని, కొందరు అధికారులను వేధిస్తున్నారని, ముఖ్యంగా చంద్రబాబు సామాజికవర్గ అధికారులపై ఆయన గురిపెట్టారని, వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారనే ఆరోపణలతో ప్రత్యేక కథనాలు వండివార్చాయి. అయితే..వాళ్లు చేస్తోన్న యాగీని చంద్రబాబు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆయనను అక్కడ నుంచి తప్పించే ప్రసక్తే లేదని, ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో రవిచంద్రను వదులుకోరని తెలుస్తోంది. ఆయనను అక్కడే కొనసాగిస్తారంటున్నారు.
కాగా ఐటి, ఆర్‌టిజిఎస్ కార్యదర్శిగా ఉన్న కాటమనేని భాస్కర్ కేంద్ర సర్వీసులకు వెళ్లడం రాజకీయ, అధికారవర్గాల్లో ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయనను ప్రతిష్టాత్మకమైన సిఆర్‌డిఏ కమీషనర్‌గా చంద్రబాబు ఏరికోరి నియమించుకున్నారు. అయితే..ఇక్కడ మున్సిపల్ మంత్రి నారాయణకు భాస్కర్‌కు పడకపోవడంతో..పలుసార్లు వారిద్దరి మధ్య రాజీ చేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. అయితే..అది కుదరకపోవడంతో భాస్కర్‌ను అక్కడి నుంచి ఐటి శాఖకు బదిలీ చేశారు. అయితే..ఇప్పుడు ఆయన అసలు రాష్ట్రంలోనే పనిచేయకుండా కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారు. ఇంత సమర్థత, నిజాయితీ, కష్టపడే అధికారి ఎందుకు కేంద్రానికి వెళుతున్నారు..ఆయనను ఇక్కడ ఇబ్బందులు పెడుతోంది ఎవరు అనేదానిపై స్పష్టత లేదు. వాస్తవానికి భాస్కర్ సిఆర్‌డిఏ కమీషనర్‌గా ఉండగానే ప్రపంచబ్యాంక్, హడ్కోతో రుణ ఒప్పందాలు జరిగాయి. ఆయన కృషి వల్లే రాజధాని అమరావతికి నిధుల ప్రవాహం జరిగిందనేది జగమెరిగిన సత్యమే. సిఆర్‌డిఏ నుంచి ఆయన బయటకు వచ్చాక..ఇప్పుడు అక్కడేమి జరుగుతుందో ప్రపంచం మొత్తం చూస్తోంది. తనకు కావాల్సిన నారాయణ కోసం చంద్రబాబు భాస్కర్‌ను వదిలేసుకున్నారని, ఆ ఫలితాలను ఇప్పుడు చవిచూస్తున్నారు. సిఆర్‌డిఎ నుంచి భాస్కర్ ఐటికి వచ్చిన తరువాత ఐటి రంగంలో లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. గూగుల్, కాగ్నిజెట్, టిసిఎస్, సట్టావా గ్రూప్, ఎఎన్ఎస్సార్ గ్రూప్, ఎసెంచర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు ఆంధ్రాకు క్యూ కట్టాయి. ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్‌ను ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఒక్క సంస్థే దాదాపు లక్షన్నర కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఇలా లక్షల కోట్ల పెట్టుబడులు తేవడంలో కీలకంగా వ్యవహరిస్తోన్న భాస్కర్‌ను చంద్రబాబు ఏ కారణాలతో వదులు కుంటున్నారో తెలియడం లేదు. అయితే..కేంద్ర సర్వీసులకు వెళ్లాలన్న భాస్కర్ కోరికతోనే..ఇది జరిగిందనే వాదన ఉంది. అయితే..భాస్కర్ కోరుకున్నా.. చంద్రబాబు ఆయనను వదులుకోరని కొన్ని వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఇద్దరు ఐఏఎస్‌ల వ్యవహారం అటు రాజకీయంగా, ఇటు అధికారపరంగా చర్చనీయాంశంగా మారింది. మరి చంద్రబాబు ఈ ఇద్దరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.