హైదరాబాద్‌లో వివాహేతర సంబంధంతో ఓ మహిళను ఆంధ్రాకు చెందిన ఓ ఐఏఎస్ హత్య చేశాడని, తరువాత దాన్ని మాఫీ చేసి విజయవాడకు వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నాడంటూ వచ్చిన వార్తలు నిరాధారమని కొంత ఐఏఎస్ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. కావాలనే ఆ ఐఏఎస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు అంటున్నారు. సదరు పత్రికలో వచ్చిన వార్తను కావాలనే కొందరు సృష్టించారని, సదరు ఐఏఎస్‌పై వృతిగతమైన పగతోనే ఈ వార్తను రాయించారంటున్నారు. సదరు ఐఎఎస్ మూడు సంవత్సరాల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయన కనీసం సరిగా నడవలేరని, ఇప్పటికీ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారని, అటువంటి వ్యక్తికి వివాహేతర సంబంధాలు అంటకట్టి లేనిపోని తప్పుడు వార్తలు రాయించారని సదరు అధికారులు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సదరు ఐఏఎస్‌ను ఒక ప్రాధాన్యత కలిగిన పోస్టులో నియమించిందని, ఆ పోస్టులో చాలా రకమైన సర్వీసులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలను సదరు ఐఏఎస్ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని, ఎవరి ఒత్తిడికి ఆయన లొంగరని, ఆయనను దెబ్బతీయడానికి ఇటువంటి కథనాన్ని కొంతమంది తోటి క్యాడర్ అధికారులు, మరి కొంత మంది నాన్ క్యాడర్ అధికారులు కలిసి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు ఇది ఒక ట్రైబల్ అధికారిపై జరుగుతోన్న కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు. ఎస్టీ అధికారులపై ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచురించడం సరికాదని వారు అంటున్నారు. కాగా..ఇప్పుడు ఈ విషయంపై తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. పత్రికలో వచ్చిన వార్తపై కేసులు నమోదు చేస్తాయా..? లేక ఎవరూ ఫిర్యాదు చేయలేదు కనుక వదిలేస్తాయా...? వాస్తవానికి ఫిర్యాదు లేకుండా ఓ సీనియర్ ఐఏఎస్‌పై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు. నిజంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం తప్పకుండా కేసును నమోదు చేసి..హత్యకు ఆధారాలు ఉంటే..సదరు ఐఏఎస్‌ను అరెస్టు చేయవచ్చు. మరోవైపు చనిపోయిందని చెబుతోన్న మహిళ ఎప్పుడు చనిపోయింది..? ఆమె అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి..? ఏ హాస్పటల్‌లో చికిత్స తీసుకుంది..? ఆమె బంధువులు ఎవరు..? మరి ముందు రాజీపడిన ఆమె బంధువులు ఇప్పుడు కేసు పెడతారా..? ఇప్పుడు కేసు పెడితే..చనిపోయినప్పుడు ఏమి చేస్తున్నారన్న ప్రశ్న..? మొత్తం మీద..ఈ వ్యవహారం..ఓ క్రైమ్‌థిల్లర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోదు. చూద్దాం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో..?