గత ఎన్నికల్లో ఘోర పరాజయానికి గురైన వైకాపా పార్టీ భవిష్యత్తుపై బ్రహ్మాండమైన ఆశలు పెట్టుకుంటోంది. ఆ పార్టీతో పాటు, ఆ పార్టీ అధినేత, నాయకులు, కార్యకర్తలు..ఎప్పుడు ఎన్నికలు జరిగినా..అధికారం మాదే..అనే ధీమాతో ఉన్నారు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇంకా రెండేళ్లు కాకపోయినా..ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉన్నా..అధికారం మాదే..అనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇలా రెండేళ్లలోనే వారు..ఇతంటి విశ్వాసాన్ని వ్యక్తం చేయడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిలో వ్యక్తం అవుతోన్న ఈ ధీమాకు కారణం ఏమిటో తెలియక వారు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. రెండేళ్లలోనే..కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఇంత నిరాశ, అసంతృప్తి, అసహనం వ్యక్తం అవుతుందా..? అనే ప్రశ్నలకు సరైన జవాబు లేదు. అయినా..అధికారం మాదే..అనే నినాదం వైకాపాలో రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇలా ఆ పార్టీలో ఇంతటి విశ్వాసం రావడానికి అధికార కూటమి చేసిన తప్పులు కొన్ని అయితే.. ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తీరు మరో కారణం.
గత ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడిపోయిన తరువాత..ఆ ఓటమికి తమ తప్పులు కారణం అనే భావన వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఎక్కడా వ్యక్తం కానీయలేదు. కూటమి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచిందనే భావననే ఆయన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తనను ఓడించలేదని, ఈవీఎంలు, టిడిపి కూటమి చేసిన మాయవల్లే తాను ఓడిపోయానని ఆయన చెప్పుకుంటున్నారు. తన క్యాడర్‌కూ అదే నూరిపోశారు. ఆయన చెప్పిందే వేదంలా ఆయన పార్టీ క్యాడర్ నమ్మేస్తోంది. జగన్ అన్నట్లే వీళ్లు కూడా ఈవిఎంల వల్లే ఓడామని..మళ్లీ ఎన్నికలు జరిగితే..తమదే గెలుపని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈవిఎంల వల్లే ఓడితే..భవిష్యత్తులో జరిగే ఎన్నికలు కూడా ఈవిఎంలతోనే జరుగుతాయి కదా..? అప్పుడు కూడా ఇదే కూటమి ఎన్నికలకు వస్తుంది..? మరి అప్పుడు ఈవిఎంలు మ్యానేజ్ కావా..అనే చిన్న ప్రశ్న కూడా వారికి రావడం లేదు. ఈ సంగతి అటుంచితే..నిన్నటి దాకా..వచ్చే ఏడాది నుంచి తాను పాదయాత్ర చేస్తానని, తన పాదయాత్ర వల్ల...పార్టీ అధికారంలోకి వస్తుందని వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తన పార్టీ క్యాడర్‌కు చెబుతుండే వారు. అయితే..ఇప్పుడు ఆయనలో విశ్వాసం మరింత పెరిగిపోయిందని, ఇక పాదయాత్ర కూడా అవసరం లేదని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా..విజయం మనదే అనే ధీమాతో ఉన్నారట. తాను భారీగా పాదయాత్ర కూడా చేయాల్సిన అవసరం లేదని, ఎన్నికలకు ముందు...ప్రజలను నేరుగా కలుసుకుంటే సరిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారని ఆ పార్టీ నాయకులు, సానుభూతిపరులు చెప్పుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలను మోసం చేసిందని, తన పాలనే బాగుందని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారనే అంచనా ఆయనలో ఉందట. ఏ ఒక్క సంక్షేమ పథకమూ ప్రజలకు అందడం లేదని, తాను అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసి ప్రజల పొట్టగొట్టిందని, తాను ఉంటే ప్రజలు ఇలా ఉండేవారు కాదని, తన వల్ల వారికి బాగా లబ్ది చేకూరిందని, అందుకే తనను మళ్లీ గెలిపించుకుంటారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారట. తనను ఓడించిన ప్రజలు ఇప్పుడు తప్పు తెలుసుకున్నారని, తన వల్లే వారికి లాభం ఉంటుందని వారు గ్రహించారని, అందు వల్ల ఇక పాదయాత్ర అసరం లేదనే భావన ఆయనలో ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. అయితే..పాదయాత్ర చేస్తానని చెప్పాను కనుక..అది చేస్తానని అయితే..ముందు చెప్పినట్లు అది సుధీర్ఘంగా ఉండదని చెబుతున్నారట.
కూటమి చేసిన తప్పుల వల్ల వైకాపా పుంజుకుందనే అభిప్రాయాన్ని రాజకీయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వైకాపా చేసిన అవినీతి, అరాచకాలపై కూటమి చర్యలు తీసుకోకపోవడం వల్ల స్వంత పార్టీ క్యాడర్ నుంచే కూటమి నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైకాపా నాయకులు చేసిన అవినీతిపై చర్యలు లేకపోగా..వారితో కుమ్మక్కు అవుతన్నారనే భావన వీరిలో వ్యక్తం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయితే..ఏముందనే భావన వ్యక్తం అవుతోంది. వాళ్లకీ..వీళ్లకీ పెద్ద తేడా ఏమీ లేదు.వాళ్లూ దోచుకున్నారు..వీళ్లూ దోచుకుంటున్నారు..అనే భావన సర్వత్రా ప్రజల్లో వ్యక్తం అవుతోన్న పరిస్థితుల్లో..ఎంతో కొంత పేదలకు సొమ్ములు పంచిన వైకాపానే మేలనే అభిప్రాయం కొన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తం అవుతోంది. వైకాపా వస్తే...రౌడీ రాజ్యం వస్తుందన్న సగటు ప్రజల అభిప్రాయమేమీ మారలేదు కానీ..సంక్షేమ పథకాలపై ఆధారపడ్డ ప్రజలు మాత్రం ఎవరైతే మాకేమిలే అనే భావన వ్యక్తం చేస్తున్నారు. అదే వైకాపాకు ఇప్పుడు బలంగా మారుతోంది. దీంతో..నిన్న మొన్నటి దాకా రెండేళ్లపాటు పాదయాత్ర చేస్తానన్న వై.ఎస్.జగన్ ఇప్పుడు..అదేమీ అవసరం లేదనే స్థాయికి వెళ్లిపోతున్నారు. మొత్తం మీద..కూటమి ప్రభుత్వం చేస్తోన్న తప్పులు..అవినీతి వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌కు వరంగా మారుతున్నాయనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు నేలవిడిచి సాము చేస్తున్నారని, వారంతా..ఎప్పుడో రాబోయే 20ఏళ్లకో..వచ్చే 40ఏళ్లకో ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని, అప్పట్లోగా..అది అవుతుంది..ఇది అవుతుందని చెబుతున్నారని, వాళ్లు చెప్పింది నిజమే అయినా..తక్షణ ఫలితాలు కోరుకుంటోన్న జనం వారి విధానాలను మెచ్చడం లేదు. ఇది ప్రభుత్వ పెద్దలకు తెలుసో..లేదో తెలియదు. ఏది ఏమైనా..ఘోర పరాభవానికి గురైన జగన్‌కు వీళ్లు..బ్రహ్మాండమైన ఆశలు కల్గిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.