Janam Online

ఇద్ద‌రికీ క‌లిపి ఒక‌టే జీవో ఇస్తారేమో...!?



ఈ నెలాఖ‌రులో రిటైర్ కాబోతున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ స‌ర్వీసును మూడు నెల‌ల పొడిగిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న స‌ర్వీసును పొడిగింపుపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కేంద్రానికి లేఖ‌రాశార‌ని తెలుస్తోంది. దీంతో..ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న స‌ర్వీసును పొడిగిస్తారా..?  లేదా అనే దానిపై ఉన్న సందేహాలన్నీ తొల‌గిపోయాయి. విజ‌యానందే మ‌రో మూడు నెల‌ల‌పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉండ‌బోతున్నార‌ని ముఖ్య‌మంత్రి లేఖ‌తో స్ప‌ష్టమైంది. వాస్త‌వానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి ఇలా రిటైర్ అయిన ఐఏఎస్‌ల స‌ర్వీసుల‌ను పొడిగించ‌డం ఇష్టం లేద‌ని గ‌తంలో అనేక సంద‌ర్భాల్లో వెల్ల‌డైంది. అయితే కేంద్ర ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన భాగ‌స్వామిగా తెలుగుదేశం పార్టీ ఉండ‌డంతో...దీని గురించి ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోర‌ని అంటున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అడిగిన‌ట్లు విజ‌యానంద్‌కు స‌ర్వీసు పొడిగింపు ద‌క్క‌డం ఇక లాంఛ‌న‌మే. కాగా..ప్ర‌స్తుతం విజ‌యానంద్ నిర్వ‌హిస్తోన్న ఇంద‌న‌శాఖ కార్య‌ద‌ర్శిగా కూడా ఆయ‌నే కొన‌సాగుతారు. వాస్త‌వానికి విజ‌యానంద్ స‌ర్వీసును పొడిగించ‌కుండా..ఆయ‌న‌ను ఇంద‌న‌శాఖ కార్య‌ద‌ర్శిగా కొన‌సాగించాల‌నే ఆలోచ‌న మొద‌ట ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో ఉంద‌ట‌. అయితే..ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన వ్య‌క్తి..మ‌రో సిఎస్ కింద ప‌నిచేయ‌డం స‌రికాద‌నే భావ‌న‌తో..విజ‌యానంద్ స‌ర్వీసును పొడిగించ‌డానికి కార‌ణ‌మైందంటున్నారు. కాగా..గ‌తంలోనే సీనియ‌ర్ ఐఏఎస్ సాయిప్ర‌సాద్‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి అప్ప‌గిస్తాన‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌నే ప్ర‌చారం ఉంది. అయితే..ఇప్పుడు విజ‌యానంద్‌కు స‌ర్వీసు పొడిగిస్తుండ‌డంతో..సాయిప్ర‌సాద్ నొచ్చుకునే అవ‌కాశం ఉంది. అయితే..ఆయ‌న నొచ్చుకోకుండా..ముందుగానే..ఆయ‌న‌కు విజ‌యానంద్ త‌రువాత ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జీవో ఇస్తార‌నే ప్ర‌చారం ఉంది.


గ‌తంలో చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఇలానే ఇద్ద‌రు సీనియ‌ర్ అధికారులు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి పోటీ ప‌డ‌డంతో..ఒకే జీవోలో ఇద్ద‌రికీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ జీవో విడుద‌ల చేశారు. అప్ప‌ట్లో అది అధికార వ‌ర్గాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించింది. 2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు సిఎంగా ఉండ‌గా..అప్ప‌ట్లో సీనియ‌ర్ ఐఏఎస్‌గా ఉన్న అజ‌య్‌క‌ల్లంకు సిఎస్ ప‌ద‌వి ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌ట‌. అయితే..అప్ప‌ట్లో సిఎంఓలో చ‌క్రం తిప్పిన స‌తీష్‌చంద్ర దినేష్‌కుమార్‌కు ఆ ప‌ద‌వి ఇవ్వాల‌ని ఒత్తిడి చేశారంటారు. స‌తీష్‌చంద్ర ఒత్తిడితో చంద్ర‌బాబుకు ఏమి చేయాలో పాలుపోక త‌న హామీని నిల‌బెట్టుకోవ‌డానికి అజ‌య్‌క‌ల్లంను సిఎస్‌గా నియ‌మిస్తూ..జీవో ఇస్తూనే..అదే జీవోలో నెల రోజుల త‌రువాత నుంచి దినేష్‌కుమార్ సిఎస్‌గా ప‌నిచేస్తారంటూ జీవో ఇచ్చారు. అది అప్ప‌ట్లో వివాదాస్ప‌ద‌మైంది. త‌రువాత రోజుల్లో అజయ్‌క‌ల్లం చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌డానికి, మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ద‌గ్గ‌ర కావ‌డానికి ఇదో కార‌ణమంటారు. తన‌కు ముందుగా ఇచ్చిన హామీ మేర‌కు సిఎస్ ప‌ద‌వి ఇచ్చి త‌రువాత మ‌రో ఆరు నెల‌లు పొడిగింపు ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌ని, కానీ..త‌న‌కు నెల‌రోజులు మాత్ర‌మే సిఎస్ ప‌ద‌వి ఇచ్చి..త‌న‌ను అవ‌మానించార‌ని అజ‌య్‌క‌ల్లం త‌న స‌న్నిహితుల వ‌ద్ద వ్యాఖ్యానించార‌ట‌. ఈ కోపంతోనే ఆయ‌న జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లి చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై బుర‌ద‌చ‌ల్లార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అంతేనా... త‌రువాత కాలంలో..జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన తరువాత త‌నకు అడ్డువ‌చ్చిన స‌తీష్‌చంద్ర‌ను తీవ్రంగా అవ‌మానించారంటారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఆయ‌న స‌చివాల‌యంలో చంద్ర‌బాబు పాల‌న‌లో సిఎంఓ కార్య‌ద‌ర్శిగా స‌తీష్‌చంద్ర కూర్చునే రూమ్‌నే తీసుకుని..ఆ రూమ్ ముందే స‌తీష్‌చంద్ర‌ను నిల‌బెట్టి అవ‌మానించార‌నే ప్ర‌చారం ఉంది. వాస్త‌వానికి స‌తీష్‌చంద్రకు మంచి అధికారి అనే పేరుంది. ముఖ్యంగా టిడిపి నాయ‌కుల్లో, కార్య‌క‌ర్త‌ల్లో, అభిమానుల్లో అలాంటి అధికారి ఇప్పుడు ఉంటే బాగుండు..అనే భావ‌న ఉంది. అయితే..త‌న‌కు సిఎస్ పోస్టు నెల‌రోజులు మాత్ర‌మే రావ‌డానికి స‌తీష్‌చంద్రే కార‌ణ‌మ‌నే దుగ్థ‌తో అజ‌య్‌క‌ల్లం ఆయ‌న‌ను అవ‌మానించారు. అయితే..మంచి వాడికి మంచే జ‌రుగుతుంద‌న్న నానుడి నిజం చేస్తూ..స‌తీష్‌చంద్ర రిటైర్ అయినా..జమ్మూ-కాశ్మీర్‌లో మంచి పోస్టులు వ‌చ్చాయి. ఆయ‌న మంచిత‌న‌మే..ఆయ‌న‌కు మేలు చేసిందనే భావ‌న ఉంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వ‌చ్చిందంటే..గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల విష‌యంలో చేసిన త‌ప్పును మ‌ళ్లీ చేస్తున్నార‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. ముందుగా సాయిప్ర‌సాద్‌కు అవ‌కాశం ఇస్తార‌నుకుంటే..ఆయ‌న‌కు ఇవ్వ‌కుండా విజ‌యానంద్‌కు ఇచ్చారు. అయితే..ఆయ‌న రిటైర్ అయిన త‌రువాత అయినా.. సాయి ప్ర‌సాద్‌కు ఇస్తార‌న‌కుంటే.. ఇప్పుడూ..మ‌ళ్లీ పాత‌విధంగానే చేస్తున్నారు. స్వంత సామాజిక వ‌ర్గ అధికారికి ఇలా అన్యాయం చేస్తున్నార‌నే భావ‌న ఆ సామాజిక‌ వ‌ర్గంలో వ్య‌క్తం అవుతోంది. కాగా..సాయిప్ర‌సాద్‌కు సిఎస్ పోస్టు ఇవ్వ‌కుంటే..రాజీనామా చేయాల‌ని ఓ బిజెపి నేత సూచించార‌ని, ఇప్పుడు ఆయ‌న ఏమి చేస్తారో చూడాలి. సిఎస్ పోస్టు రాకుంటే..వెంట‌నే రాజీనామా చేయాల‌ని, అలా చేస్తే..త‌న కంపెనీలో వెంట‌నే ఉద్యోగం ఇస్తాన‌ని కూడా ఈ నేత చెప్పార‌నే ప్ర‌చారం ఉంది. మొత్తం మీద‌..ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు ప‌దే ప‌దే త‌ప్పులు చేస్తున్నార‌నిపిస్తోంది.