Janam Online

ఎన్‌డిఏ గెలుపు-అనుమానాలు...!?



బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార ఎన్‌డిఏ అద్భుత గెలుపును ఎన్‌డిఏ నేత‌లు కూడా ఊహించ‌లేదు. వివిధ స‌ర్వే సంస్థ‌లు ఎన్‌డిఏ గెలుస్తుంద‌ని చెప్పినా..ఈ స్థాయిలో విజ‌యం సాధిస్తుంద‌ని ఎవ‌రూ చెప్ప‌లేదు. గ‌త ఇర‌వై సంవ‌త్స‌రాలుగా అధికారంలో ఉన్న నితీష్‌కుమార్‌పై ప్ర‌జ‌ల్లో కొద్దిగా కూడా అసంతృప్తి లేక‌పోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో 202 సీట్లు అధికార కూట‌మి గెలుచుకోవ‌డం, ప్ర‌తిప‌క్షాల‌కు క‌నాక‌ష్టంగా ప్ర‌తిప‌క్ష‌హోదా ద‌క్క‌డం అన్ని వ‌ర్గాల్లో ఆశ్చ‌ర్యానికి కార‌ణ‌మ‌వుతోంది. అయితే..ఇంత‌టి గెలుపుకు ఎన్‌డిఏ నేత‌ల ప‌నితీరు, ఎన్నిక‌ల‌కు ముందు మ‌హిళ‌ల ఎకౌంట్‌ల్లో వేసిన ప‌దివేల రూపాయ‌లు, నీతీష్‌కుమార్‌పై ఉన్న న‌మ్మ‌కం, ప్ర‌తిప‌క్ష యుపిఏపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డమే కార‌ణ‌మే విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. అయితే... అధికారంలో ఉన్న పార్టీ దేనికి..ఇంత‌టి ఘ‌న‌విజ‌యం ద‌క్క‌దు. ఆ ప్ర‌భుత్వం ఎంత బాగా చేసినా..ప్ర‌జ‌ల‌ను బంగారంలో పెట్టి చూసుకున్నా..ఎంతో కొంత అసంతృప్తి ప్ర‌జ‌ల్లో ఉంటుంది. కానీ..ఇక్క‌డ మాత్రం అదేమీ క‌నిపించ‌లేదు. వాస్త‌వానికి స‌గ‌టు బీహారీ ఎన్నో స‌మ‌స్య‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వ‌ల‌స‌లంటేనే బీహార్ గుర్తుకు వ‌స్తుంది. నితీష్ 20ఏళ్ల పాల‌న‌లో ఈ వ‌ల‌స‌లేమీ ఆగిపోలేదు. బీహారీ ప్ర‌జ‌లు త‌మ ఉపాధి కోసం దేశంలో వివిధ చోట్ల ప‌నిచేస్తున్నారు. నితీష్ పాల‌న‌లోనూ ఇవి కొన‌సాగుతూనే ఉన్నాయి. రోడ్ల స్థితి గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అప్పులు మ‌రీ సూక్ష్మ‌రుణాల బారిన ప‌డి..వారికి వ‌డ్డీలు క‌ట్ట‌లేక అల్లాడిపోతోన్న కుటుంబాలు ఎన్నెన్నో...? ఉపాధిలేమి,నిర‌క్ష‌రాస్య‌త‌,నిరుద్యోగం, బ‌ల‌హీన‌మైన ఆరోగ్య‌రంగం..శాంతిభద్ర‌త‌ల స‌మ‌స్య‌..ఇలా ఒక‌టా రెండా..ఎన్నెన్నో స‌మ‌స్య‌లను నితీష్ ఏమీ ప‌రిష్క‌రించ‌లేదు. అయితే..లాలూ ఆయ‌న కుటుంబం కంటే..మెరుగు అనేది నిజ‌మే. అయితే..దీనితోనే బీహారీలు ఆనందించి..ఇంత క‌నీవినీ ఎర‌గ‌ని మెజార్టీల‌తో ఎన్‌డిఏని గెలిపించారా...? అనే అనుమానాలు ప‌లువురిలో వ్య‌క్తం అవుతున్నాయి. ఏదో జ‌రిగింద‌నే ప్ర‌చారం మెండుగానే ఉంది. ఈవిఎంల‌ను ట్యాంప‌రింగ్ చేశార‌నే పాత వాద‌న ఎగ‌టు పుట్టిస్తోంది. ఈవిఎంల మీద ఓట‌మి నెపాన్ని తోయ‌డం కంటే..ఇత‌ర‌త్రా జ‌రిగిన అవ‌క‌త‌ వ‌క‌ల‌పై ప్ర‌తిప‌క్ష‌పార్టీలు దృష్టిసారిస్తే మంచిదేమో. ఇందులో ముందుగా ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించ‌డం ఒక‌టి కాగా..రెండోది..అంత‌ర్గ‌త స‌మీక్ష చేసుకోవ‌డం. ఆన్‌గోయింగ్ స్కీమ్‌గా ప‌దివేల పంపిణీని ఎన్నిక‌ల సంఘం ఎందుకు ఆప‌లేదు..?  దీనిపై ప్ర‌తిప‌క్షాలు ఎన్నిక‌ల సంఘాన్ని నిల‌దీయాలి. గ‌తంలో..ఇటువంటి ప‌రిస్థితి ఎప్పుడూ లేదు. ఎన్‌డిఏ క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యానికి ఈ ప‌దివేలే ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ఇక ప్ర‌తిప‌క్షాల అస‌మ‌ర్థ ఎన్నిక‌ల వ్యూహాన్ని స‌మీక్షించుకోవాలి. ఎంత‌సేపూ..ముఖ్య‌మంత్రి అయిపోతున్నాం..విజ‌యం మ‌న‌దే..లాంటి క‌ల‌లు..త‌ప్ప క్షేత్ర‌స్థాయిలో చేసిందేమీ లేద‌నే వాద‌న అన్నివ‌ర్గాల నుంచి వ‌స్తోంది. ఉత్తుత్త హామీలు ఇస్తే..న‌మ్మేస్తారా..? ఇప్ప‌టికైనా..వాస్త‌వంలోకి రావాలి. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను గుప్పెట ప‌ట్టిన అధికార‌ప‌క్షాన్ని..అదే స్థాయిలో తిప్పికొట్టే ఆలోచ‌నాప‌రుల‌ను,  అక్కున చేర్చుకోవాలి. అదే స‌మ‌యంలో అరాచ‌క‌వాదుల‌ను, అవినీతిప‌రుల‌ను దూరం పెట్టాలి. ప్ర‌జ‌లు అవినీతిప‌రుల‌ను, అరాచ‌క‌వాదుల‌ను గ‌మ‌నిచండం లేద‌నికోవ‌డ‌మే ఇక్క‌డ ప్ర‌తిప‌క్షాల ఘోర ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం.