తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్కోసారి నేల విడిచి సాము చేస్తుంటారు. అధికారంలో ఉంటే ఆయనకు ఉండే అతివిశ్వాసం బహుశా దేశంలో ఏ నాయకుడి కూడా ఉండదేమో..? తనకే అంతా తెలుసని, పార్టీని ఎలా గెలిపించాలో..తనకు బాగా తెలుసనని, ఎవరి మాటా వినే ఉద్దేశ్యం కూడా లేదన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఆయనా..ఆయన అధికారులదే హవా అంతా...? అధికారులు చెప్పే నంగనాచి మాటలకు ఆయన పడిపోతుంటారు. అంతా బాగుందనే భ్రమలో బతికేస్తుంటారు. అలా కాదని ఎవరైనా అంటే వారిపై ఎదురుదాడి చేస్తుంటారు. తన అధికారులు చెప్పిందే నిజం..వాళ్లే సర్వసమన్నట్లు వ్యవహరిస్తారు. చివరకు ఘోరమైన దెబ్బలు తిన్న తరువాత వాస్తవంలోకి వచ్చి అప్పుడు తాను చేసింది కరెక్ట్ కాదు..సవరించుకుంటాను..పార్టీని పట్టించుకుంటాను..కార్యకర్తలను పట్టించుకుంటాను..ఈసారి చూడండి..విరగతీస్తాను..ఇక కార్యకర్తలకే పెద్దపీట, నాయకులకు ప్రాధాన్యత ఇస్తానని మరోసారి అమాయక పార్టీ కార్యకర్తలను, నాయకులను బుట్టలో వేసుకుంటారు. వాళ్లూ అమాయకంగా ఆయనను నమ్మిమోసపోతుంటారు. ఇది చంద్రబాబు టిడిపి పార్టీని అధీనంలోకి తెచ్చుకున్నప్పటి నుంచీ జరుగుతున్నదే. ఎప్పటికప్పుడు ఇదే తంతు..అధికారంలో ఉంటే..అంతా బాగుంది. ఐటి,బీటీ, డేటా సెంటర్లు,భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, బీటీ రోడ్లు, నిరంతవిద్యుత్ ఇలా అన్ని భారీ హంగుల మీదే దృష్టి. వాస్తవానికి ఏమి జరుగుతుందో..సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో..పార్టీ ఎలా ఉందో, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు ఇతర నాయకులు ఏమి చేస్తున్నారో తెలుసుకోలేనంత బీజీ. నేలవిడిచి చేసిన సాము ప్రతిసారీ దెబ్బలు తగిలించుకుంటున్నా..? మళ్లీ అదే బాట.
2004లో ఏమి జరిగిందో..తెలియదా..? అప్పట్లో అభివృద్ధి చేయలేదని ప్రజలు ఓడించారా..? అవినీతిపరుడని ఓడించారా..? లేదు కదా...? సామాన్యుల కష్టాలను పట్టించుకోవడం లేదనే కదా..? సామాన్యులకు దూరంగా వెళ్లారనే కదా..? యూనిట్ ధర తగ్గించాలన్న సామాన్య ప్రజానీకం కోరికను పట్టించుకోకపోవడం వల్లే కదా..;? కరువుతో రైతాంగం అల్లాడుతుంటే..నీరు లేక పంటలు ఎండిపోతుంటే..వారిని వదిలేసి..ఐటీ, బీటీ అంటూ ఊరేగడంతోనే కదా..టిడిపి చరిత్రలో లేని విధంగా తొలిసారి 47సీట్లు వచ్చింది. పోనీ తరువాత అయినా..పాఠాలు నేర్చుకున్నారా..? అంటే అదీ లేదు. 2014లోనూ..అదే తీరు..గెలిచిన దగ్గర నుంచి ఎక్కడలేని ఊహాసౌధాలతో ప్రజలను మురిపించి, ఎమ్మెల్యేల, మంత్రుల అవినీతిని అరికట్టలేక జగన్ చేతిలో బోల్తా కొట్టారు. సరే..మీకు అదృష్టం జెర్రిపోతులా ఉండబట్టే 151 సీట్లు వచ్చిన జగన్ మళ్లీ తన చేతిలోని అధికారాన్ని బంగారుపల్లెంలో పెట్టి మీకు అప్పగించారు. మరి మళ్లీ అధికారంలోకి వచ్చిన తమరు చేస్తోన్నదేమిటి...? గెలిపించిన పార్టీ కార్యకర్తలను, నాయకులను, సానుభూతిపరులను పట్టించుకున్నారా..? మళ్లీ అధికారులదే పాలన...? వాళ్లకు నచ్చిన వారికి, మెచ్చిన వారికే పనులు..? పార్టీ వ్యతిరేకులు, వైకాపా వారికే పనులు అవుతున్నాయన్న కార్యకర్తల అరణ్యరోదన తమరికి కానీ, తమ సుపుత్రుని కానీ వినిపిస్తున్నాయా..? లక్షల కోట్ల అవినీతి చేసిన వైకాపా నాయకులు ఇప్పుడు కాలరెగరేసుకుని తిరుగుతుంటే..పార్టీ కార్యకర్తల కడుపుమంటను పట్టించుకునే నాధుడేడి....? గత వైకాపా ప్రభుత్వ హయాంలో పార్టీ ముద్ర వేసి తొలగించిన పార్టీ సానుభూతిపరుల పింఛన్లు రెండేళ్లు కావస్తున్నా..ఇప్పించే నాధుడే లేడు...? ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ప్రత్యర్థులు చేసే హేళనను సామాన్య కార్యకర్త, సానుభూతిపరులు మౌనంగా భరిస్తున్నారు. వీళ్లు ఇలా మౌనంగా ఉంటేనే పార్టీ మళ్లీ మళ్లీ గెలుస్తుందా..? ఎంత సేపూ కన్సెల్టెంట్ మీద ఆధారపడుతూ, వారిచ్చే బోగస్ సర్వేలను నమ్ముతూ..నేల విడిచి సాము చేస్తే..ఎప్పుడూ అధికారంలోనే ఉంటామా...? డబ్బులు తీసుకుని..మళ్లీ మీరే గెలుస్తారు..మిమ్మలను ఓడించలేరు..అంటూ చెప్పే మాటలు నమ్మితే..జగన్ కు ఏగతి పట్టిందో..అదే గతి పార్టీకి పడుతుందనే సంగతిని ఇంత అనుభవజ్ఙుని ఎవరు చెబుతారు..? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో...? ఎమ్మెల్యేల, ఎంపిల అవినీతి ఎంత దుర్మార్గంగా ఉందో..ఎంత నీచస్థాయిలో అవినీతి చేస్తున్నారో.. ప్రజలను ఎలా పీడిస్తున్నారో మీకు తెలియదా..? ఇలాంటి వాటిని ప్రజలు గమనించడం లేదనుకున్నారా..? సమయం వచ్చినప్పుడు కర్రుకాల్చి వాతపెడతారు...? అప్పుడు తీరిగ్గా విచారించాల్సిందే..? అప్పటి దాకా..మన్నల్ని ఎవరూ ఓడించలేరు..కలకాలం మనదే అధికారమంటూ..ఊహలపల్లకిలో ఊరేగవచ్చు.